శంకర్ యాక్షన్ అంటే..ప్రేమికుడు ‘టేకిటీజీ పాలసీ’ అంటాడు.‘జెంటిల్మెన్’ హంటర్ మ్యాన్ అవుతాడు.‘శివాజీ’.. వాహ్ జీ అనిపిస్తాడు.అదే శంకర్ రీ యాక్షన్ అంటే..ఆయన యాక్షన్లోంచి పుట్టిన ‘భారతీయుడు’ ఊరుకుంటాడా! 28 ఏండ్ల కిందట మండువేసవిలో దడపుట్టించిన 75 ఏండ్ల సేనాపతి…103 ఏండ్లప్పుడు పూనకంతో ఊగిపోతున్నాడు. ఇంతకీ ఈ రెండో ఇండియన్ ఏం చేయబోతున్నాడు.. ఫస్ట్ ఇండియన్ ఏం చేశాడు..
Indian-2 | 1996 మే 9.. ‘భారతీయుడు’ రిలీజైంది. అంతకుముందే ఆ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఏ నోట విన్నా ఆ పాటలే! ఏ టేప్ రికార్డర్లో చూసినా భారతీయుడు క్యాసెట్టే..! ఆ పాటలతో వీనులవిందు చేసుకొని.. థియేటర్‌కు వెళ్లినవాళ్లకు మొదటి ఆట నుంచే కన్నులపండుగ మొదలైంది. సేనాపతి అలియాస్ భారతీయుడుగా కమల్ హాసన్ విశ్వరూపం. చందూగా అల్లరి వేషం. ఏం చేశాడు సేనాపతి. కలుపు తీశాడు. పచ్చని పైరును నాశనం చేసే కలుపును కూకటివేళ్లతో పెకిలించాడు. అవినీతిని అంతం చేయడానికి కన్నకొడుకు అని కూడా చూడకుండా కడతేర్చాడు.
కొడుకును తండ్రి చంపడం ఏంటి? సెంటిమెంట్‌గా వర్కవుట్ అయ్యే ఫార్ములా కాదు! ఈ ఎండింగ్ చూసి బయ్యర్లు బిర్రబిగుసుకుపోయారు. కానీ, దర్శకుడు శంకర్ దాన్ని ఒప్పించగలిగాడు. కథ, కథనాలతో ప్రేక్షకులనూ మెప్పించగలిగాడు. క్లాస్ ఏ పీపుల్ నుంచి సీ సెంటర్ సినిమా అభిమానులతోనూ ఆమోదింపజేసుకున్నాడు. పైగా చందు పాత్ర తక్కువదేం కాదు! ఆ పాత్ర లేకుంటే.. సినిమా ఉండేదో లేదో, ఉన్నా ఆడేదో కాదో..! మనీషాతో పాటలు, ఊర్మిళతో ఆటలు.. ఏఆర్ రెహమాన్ సంగీతం… అబ్బో ఈ సినిమాను వండర్‌గా నిలబెట్టడంలో చందూ పాత్ర వేసిన చిందులూ కారణమే! చిన్న ఫ్లాష్‌బ్యాక్.. లంచం ఇవ్వనన్న తండ్రి పంతమే తన చెల్లి చావుకు కారణమని చందూ కోపం. లంచం ఇవ్వలేని తండ్రి.. లంచం పుచ్చుకునే కొడుకు.
తన నేరం బయటపడొద్దని తండ్రినే పోలీసులకు పట్టించిన కొడుకు పాత్రలో కమల్ హాసన్ ఉన్నా… ఆ పాత్రపై ప్రేక్షకులకు చిర్రెత్తేలా చేయడంలో దర్శకుడిదే పైచేయి అయింది. ఎయిర్‌పోర్టు రన్‌వే మీద కనిపెంచిన కొడుకును సేనాపతి నిర్దయగా కత్తి పోట్లు పొడుస్తుంటే సీట్లకు అతుక్కుపోయారు ప్రేక్షకులు. ఆ తర్వాత బ్లాస్టింగ్‌లో సేనాపతి చనిపోయాడు అనుకొని అయ్యో అనుకున్నారు. సింగపూర్‌లో తేలిన ఆ పెద్దాయన.. పోలీసులకు ఫోన్ చేసి అవినీతి పడగ విప్పితే.. దాని అంతానికి మళ్లీ వస్తానని చెప్పినప్పుడు ఈలలు మోగాయి. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సేనాపతి 28 ఏండ్లకు మళ్లీ వస్తున్నాడు.
భారతీయుడు 2 చాలాకాలం కిందటే సెట్స్‌పైకి వెళ్లింది. ఎన్నోసార్లు షూటింగ్‌కు ముహూర్తాలు ఫిక్సయ్యాయి. మరెన్నోసార్లు వాయిదాలు పడ్డాయి. నిర్మాతలు మారారు. టెక్నీషియన్సూ మారారు. కథానాయికలు కొత్తవాళ్లు. మారనిది ఇద్దరే! ఒకరు దర్శకుడు శంకర్, మరొకరు హీరో కమల్ హాసన్. ఈ కథ నచ్చినా.. చేయొద్దనుకున్నాడట కమల్. ప్రాజెక్టు నుంచి తప్పించుకోవడానికి రెమ్యునరేషన్ అధికంగా అడిగానని ఆయనే ఇటీవల చెప్పుకొచ్చాడు.
కానీ, శంకర్ మాత్రం భారతీయుడు అంటే కమల్ హాసన్ ఓన్లీ అని ఫిక్సయ్యాడు. హీరో షరతులకు అంగీకరించాడు. షూటింగ్ మొదలైంది. సెట్లో ఏదో ప్రమాదం. షూటింగ్‌కు బ్రేక్! కొన్నాళ్లకు మళ్లీ మొదలైంది. కరోనా వచ్చింది. మళ్లీ గ్యాప్!! ఈ శతాధిక భారతీయ వృద్ధ పాత్ర విన్యాసాలు చూడాలని భారతీయులకు రాసిపెట్టి ఉందేమో..! అన్ని కార్యక్రమాలూ విజయవంతంగా పూర్తి చేసుకొని ఇండియన్-2… జూలై 12న బాక్సాఫీస్ దగ్గర తన మర్మకళ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
మొదటి సినిమాలో లంచం అంతానికి పాటుపడిన సేనాపతి.. ఇప్పుడు ఎవరి పనిపడతాడు? ‘ఇది రెండో స్వతంత్ర పోరాటం.. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను..’ ఈ డైలాగ్ సినిమా ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చూపింది. ‘అందరినీ చీల్చి చెండాడే ఓ హంటింగ్ డాగ్ రావాలి’ సిద్ధార్థ్ పాత్ర పలికే డైలాగ్ ఇది. ఆ వేటకుక్క ఎంత డేంజరో పార్ట్ వన్‌లో చూసేశాం. తప్పు చేస్తే దాన్నుంచి తప్పించుకోలేమని భయం పుట్టించడానికి వేటాడబోతున్నాడు. ఎలా అన్నది తెరమీద చూడాల్సిందే!
సిద్ధార్థ్ పాత్ర సేనాపతి మనవడిది అని ఊహించొచ్చు. ఎందుకంటే… భారతీయుడులో మనీషా పాత్ర గర్భంతో ఉన్నట్టుగా చూపించాడు దర్శకుడు శంకర్. ఆమె కడుపులో ఎదిగిన చందూ ప్రతిరూపం సిద్ధార్థ్ పాత్ర. తండ్రిని చంపిన తాతపై అతనికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ట్రైలర్లో అయితే.. తాతకు తగ్గ మనవడిలాగే కనిపించాడు. ‘భారతీయుడు’లో చందూ కూడా తండ్రికి తగ్గ తనయుడిగానే అనిపిస్తాడు. శంకర్ మార్కు ట్విస్టులు సినిమాను ఏ క్షణంలో అయినా విలక్షణంగా మార్చేయొచ్చు. చూడబోతూ వివరాలు ఎందుకు.
ఇంకో పన్నెండు రోజుల్లో ‘భారతీయుడు-2’ బాక్సాఫీస్ దండయాత్ర మొదలుకానుంది. మర్మకళతో మెస్మరైజ్ చేస్తాడో, మెరుపు స్టంట్లతో మాయ చేస్తాడో చూద్దాం. 103 ఏండ్ల మనిషి స్టంట్లు చేయడమేంటని కొందరి పెదవి విరుపు. మార్షల్ ఆర్ట్స్‌లో సుశిక్షితులై, గుండె బలం కలిగిన యోధులకు వయసు అడ్డంకి కాదని శంకర్ మాట. నిజ జీవితంలోనూ ఇలాంటి యోధులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. చివరిగా సేనాపతి మాటల్లో చెప్పాలంటే.. ‘టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. సో పారిపోనూ లేరు. దాక్కోనూ లేరు’. వెల్కమ్ టు సేనాపతి 2.0. ఈయన అవినీతిలో కూరుకుపోయిన సిస్టమ్‌పై ఎక్కుపెట్టిన పిస్టల్!
భారతీయుడు విజయంలో పాటల పాత్రా ఉంది. అందులోని ‘పచ్చని చిలుకలు తోడుంటే..’ పాట ఇప్పటికీ పాడే కోయిలలు ఎన్నో. ‘టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా..’, ‘మాయామశ్చీంద్ర మచ్చని చూడగ వచ్చావా..’, ‘అదిరేటి డ్రస్సు మేమేస్తే..’, ‘తెప్పలెళ్లిపోయాక ముప్పు తొలిగిపోయిందే..’ ఐదు పాటలూ అదిరిపోయాయి. రెహ్మాన్ మ్యూజిక్ ఆల్బమ్ ఎవర్గ్రీన్ హిట్ జాబితాలో చోటు దక్కించుకుంది. అనిరుధ్ సంగీతం అందించిన ‘భారతీయుడు 2’ పాటలు ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదల వేళకు ఎంత మేరకు పుంజుకుంటాయో చూడాలి!