సాహో రివ్యూ

Fri,August 30, 2019 01:58 PM

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాతో జాతీయస్థాయిలో అభిమానగణాన్ని సొంతం చేసుకున్నారు ప్రభాస్‌. అతడి ఇమేజ్‌ను ఈ సినిమా పతాక స్థాయిలోని నిలబెట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయడానికి భిన్న భాషలకు చెందిన అగ్ర దర్శకనిర్మాతలు ఆసక్తిని ప్రదర్శించారు. కానీ ప్రభాస్‌ మాత్రం వారిని కాదని ఒకే ఒక సినిమా అనుభవమున్న సుజీత్‌ను ఎంచుకొని ఆందరిని ఆశ్చర్యపరిచారు. సుజీత్‌పై ఉన్న నమ్మకంతో అతడితో సాహో సినిమా చేశారు.


దాదాపు మూడు వందల కోట్ల వ్యయంతో స్క్రీన్‌ప్లే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు అన్ని భాషల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ అంచనాల్ని సుజీత్‌ ఏ మేరకు నిలబెట్టాడు?బాహుబలి విజయాన్ని ప్రభాస్‌ ఈసినిమాతో కొనసాగించాడా?లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
ముంబాయిలో వరుసగా దోపిడీలు జరుగుతుంటాయి. తెలివిగా ఓ దొంగ వందల కోట్ల రూపాయల్ని దోచుకుంటూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతుంటాడు. దాంతో అతడిని పట్టుకునే బాధ్యతను అండర్‌కవర్‌ ఆఫీసర్‌ అశోక చక్రవర్తి (ప్రభాస్‌) తీసుకుంటాడు.

అమృతనాయర్‌(శ్రద్ధాదాస్‌) అనే ధైర్యవంతురాలైన మహిళా పోలీస్‌తో కలిసి అశోక్‌ ఆ దొంగ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. మరోవైపు కిల్లర్‌ సామ్రాజ్యం వాజి సిటీకి పృథ్వీరాజ్‌ తర్వాత నాయకుడిగా రాయ్‌(జాకీష్రాఫ్‌) ఎదుగుతాడు. అతడి పెత్తనం పృథ్వీరాజ్‌ కొడుకు దేవరాజ్‌కు కంటగింపుగా మారుతుంది. రాయ్‌ ఇండియాలో తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని అనుకొని ముంబాయి వస్తాడు. అతడిని దేవరాజ్‌ చంపేస్తాడు. రాయ్‌కు చెందిన రెండువేల కోట్ల రూపాయల డబ్బును దోచుకుంటాడు. తండ్రిని చంపిన వారిని పట్టుకోవడంతో పాటు ఆ డబ్బును తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రాయ్‌ కొడుకు విశ్వక్‌(అరుణ్‌ విజయ్‌) ప్రయత్నాలు మొదలుపెడతాడు.

రాయ్‌ దాచిపెట్టిన ఓ రహస్యం తాలూకు బాక్స్‌ ఒకటి ఇండియాలో ఉండటంతో దానిని దక్కించుకోవడం కోసం విశ్వక్‌ బృందంతో పాటు దేవరాజ్‌ ప్రయత్నిస్తుంటాడు. వారి నుంచి ఆ బాక్స్‌ను సాహో(ప్రభాస్‌) అనే దొంగ తస్కరిస్తాడు. సాహో ఎవరు?అశోక చక్రవర్తి అనే మారుపేరుతో పోలీసుగా అతడు ఎందుకు డ్రామా ఆడాడు?వాజి సిటీతో పాటు చనిపోయిన రాయ్‌తో అతడికి ఉన్న సంబంధమేమిటి? తన తండ్రి చావుకు కారణమైన వారిపై రాయ్‌ కొడుకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ఇదివరకు చాలా సార్లు వెండితెరపై వచ్చిన ప్రతీకార కథ ఇది. ఈ ఇతివృత్తానికి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌, భారీ పోరాట ఘట్టాలతో కొత్తదనాన్ని ఆపాదించాలనే ఆలోచనతో నేల విడిచి సాము చేశారు సుజీత్‌. ఆ హంగుల్లో అసలైన కథను విస్మరించడంతో సాహో చతికిలపడింది. తండ్రి మరణానికి కారణమైన శత్రువుల్ని తుదముట్టించి అతడి కలను ఓ కొడుకు ఎలా నేరవేర్చాడనే చిన్న పాయింట్‌తో సుజీత్‌ ఈ కథను రాసుకున్నారు. ఈ అంశానికి దొంగ పోలీస్‌ డ్రామా, ప్రేమకథను జోడించి చెప్పారు. ప్రథమార్థం మొత్తం నీల్ నితిన్‌ ముకేశ్ ను పట్టుకోవడానికి ప్రభాస్‌ చేసే ప్రయత్నాలు, తమ తెలివితేటలతో ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో నడిపించారు. ఈ పోలీస్‌, దొంగ డ్రామాలోనే అంతర్లీనంగా ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌ల ప్రేమకథను మిళితం చేశారు. అయితే ఆ ఎపిసోడ్‌ మొత్తం టైమ్‌పాస్‌ వ్యవహారంగా ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ గందరగోళాన్ని రేకెత్తిస్తుంటాయి.

విరామ సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్‌తో కథ మలుపు తిరుగుతుంది.
ద్వితీయార్థంలో కథ వేగం పెరుగుతుందని ఊహించిన ప్రేక్షకుల ఓపికకు అనవసరమైన ఐటెంసాంగ్‌, నాయకానాయికల రొమాన్స్‌తో పరీక్ష పెట్టాడు దర్శకుడు. కథను ముందుకు సాగించడానికి ఇబ్బందులు పడినట్లు అనిపిస్తుంది. వాజి సిటీకి ప్రభాస్‌ రావడం, శత్రువులతో పనిచేస్తున్నట్లు నటిస్తూనే వారిని దెబ్బతీసే సన్నివేశాలతో పతాక ఘట్టాల్ని అల్లుకున్నారు.

చిన్న కథను స్క్రీన్‌ప్లేతో ఉత్కంఠభరితంగా చెప్పడంలో దర్శకుడు నేర్పును ప్రదర్శించడంతో పాటు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మలుపులతో కథనాన్ని ఉత్కంఠగా చెప్పాలనే సుజీత్‌ ఆలోచన కన్ఫ్యూజన్ కు గురిచేసింది. ఒకే టైమ్‌ పీరియడ్‌లో రెండు కథలను సమాంతరంగా నడిపిస్తూ వాటికి మధ్య సంబంధాన్ని సరిగా ఆవిష్కరించలేకపోయారు. స్క్రీన్‌ప్లే సినిమాల్లో వేగం చాలా ముఖ్యం. అందుకు భిన్నంగా ఈ సినిమా కథ పూర్తిగా సాగతీత ధోరణిలో సాగుతుంది. కథ,లాజిక్‌ల కంటే ప్రభాస్‌ ఇమేజ్‌, గ్రాండియర్‌గా సినిమాను రూపొందించడంపైనే దృష్టిసారించారు. ఏ పాత్ర ఎందుకు వస్తుందో, ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యే ఎమోషన్స్‌ కనిపించవు.

హాలీవుడ్‌ వారితో పోటీపడుతూ వారి ప్రమాణాలకు తగిన సినిమా తీయాలనే ఆలోచన మంచిదే. అయితే అందుకు తగ్గ మంచి కథను సిద్ధం చేసుకుంటే బాగుండేది. మిషన్‌ ఇంపాజిబుల్‌, ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ లాంటి ఆంగ్ల చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయంటే యాక్షన్‌ హంగులతో పాటు వాటిలో ఉండే కథ, కథనాలే కారణం. కథ లేకుండా ఎంతటి యాక్షన్‌ సినిమా అయినా ప్రేక్షకుల్ని మెప్పించలేదు. అందుకు ఈ సినిమా నిదర్శనంగా నిలుస్తుంది.

అశోక చక్రవర్తిగా, సాహోగా భిన్న పార్శాలున్న పాత్రలో ప్రభాస్‌ చక్కటి వైవిధ్యాన్ని కనబరిచారు. తనదైన శైలి సంభాషణలతో సీరియస్‌గా సాగే కథలో వినోదాన్ని పంచారు. వన్‌మెన్‌షోగా ఈసినిమాకు నిలిచాడు. ఆయనపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రియుడికి, వృత్తి ధర్మానికి మధ్య సంఘర్షణకు లోనయ్యే పోలీస్‌ అధికారిగా శ్రద్ధాకపూర్‌ పాత్ర ఎమోషనల్‌గా సాగింది. యాక్షన్‌ సన్నివేశాల కంటే పాటల్లోనే తన గ్లామర్‌ హంగులతో ఆకట్టుకున్నది. జాకీష్రాఫ్‌, లాల్‌, అరుణ్‌విజయ్‌, నీల్‌నితిన్‌, మందిరాబేడి, మురళీశర్మతో పాటు భిన్న భాషలకు చెందిన పలువురు నటులు సినిమాలో ఉన్న వారిని ైస్టెలిష్‌గా చూపించడంపైనే దర్శకుడు దృష్టిసారించాడు. వారి నటనాప్రతిభను వాడుకోలేకపోయారు. హీరోకు ధీటైనా బలమైన ప్రతినాయకుడు సినిమాలో కనిపించడు.సాంకేతికంగా సినిమా అత్యున్నతంగా ఉంది. కథలేని ఈ సినిమాను మది ఛాయాగ్రహణం, జిబ్రాన్‌ నేఫథ్య సంగీతం చాలా వరకు నిలబెట్టాయి.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఎలాంటి కథ, కథనాలతో సినిమా చేస్తాడోనని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ కథలోని వైవిధ్యత కంటే సాంకేతికంగా ఉన్నతమైనమైన సినిమా చేయడానికే ప్రభాస్‌ ప్రయత్నించారు. సగటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో కనిపించవు. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా వచ్చిన ఇమేజ్‌, పేరుప్రఖ్యాతుల్ని ఈసినిమాతో కొనసాగించలేకపోయారు. సినిమాపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఈ వారంతం ఓపెనింగ్స్‌ భారీగానే ఉంటాయి. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలను ఏ మేరకు నిలబెడుతుందో చూడాల్సిందే..
రేటింగ్:2.25/5

17956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles