ఉలగనాయన్ కమల్ హాసన్ ఇటీవల భారతీయ సినిమాలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్న కమల్ త్వరలో ఇండియన్ 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. అయితే కమల్ హాసన్ నేడు ఆసుపత్రిలో అడ్మిట్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2016లో కమల్‌కి ప్రమాదం జరగగా, అతని కాలికి రెండు సర్జరీలు జరిగాయి. తాజాగా మరో సర్జరీ చేసేందుకు డాక్టర్స్ కమల్ని ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని సూచించారు. ఈ సర్జరీ ఎప్పుడో చేయించుకోవలసి ఉన్నప్పటికి, సినిమాలు, రాజకీయాలతో ఉన్న బిజీ వలన వాయిదా పడింది. నేడు ఆపరేషన్ చేసి కాలులో ఉన్న ఇంప్లిమెంట్స్ తొలగిస్తారట. ఆపరేషన్ తర్వాత కమల్ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు.