తల్లిని కాపాడి.. తనువు చాలించిన త‌న‌యుడు

Tue,January 14, 2020 08:40 AM

కాకతీయ కాల్వలో పడి దుర్మరణం


కరీంనగర్ ‌: కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని ఒడ్డుకు చేర్చిన కుమారుడు.. ఆపై అదే కాల్వలో కొట్టుకుపోయి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ధర్మరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల సారమ్మ సోమవారం దుస్తులు ఉతికేందుకు సమీపంలోని కాకతీయ కాల్వకు కుమారుడు రవి(26)తో కలిసి వెళ్లింది. బట్టలు ఉతుకుతుండగా.. ఓ చీరె కాల్వలో కొట్టుకుపోతుండగా దాన్ని పట్టుకొనే ప్రయత్నంలో కాల్వలోకి జారింది.

గమనించిన కుమారుడు తల్లిని కాపాడేందుకు కాల్వలోకి దిగి ఆమెను ఒడ్డుకు చేర్చాడు. ఆమె ఒడ్డుకు చేరుకోగా ప్రమాదవశాత్తు రవి కాల్వలో కొట్టుకుపోయాడు. సారమ్మ కేకలు వేయడంతో సమీపంలోని పంటపొలాల్లో పనిచేస్తున్న రైతులు వచ్చి అతడిని కాపాడే యత్నం చేయగా అప్పటికే ఊపిరాడక మృతిచెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్‌ దవాఖానకు తరలించారు. రవికి భార్య లావణ్య, కూతురు సాన్విక ఉన్నారు.

6918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles