వాన మొదలైందంటే ఎడతెరపి లేకుండా కురుస్తున్నది. ఊరు.. వాడ అనే తేడా లేకుండా వరదలు పోటెత్తుతున్నాయి.
వీధులు చెరువులను తలపిస్తుండగా.. రోడ్లపైకి, ఇండ్లల్లోకి భారీగా చేరుతున్న నీటితో ఎక్కడికక్కడే వాహనాలు మునిగిపోతున్నాయి.
అయితే వాహన బీమా ఉన్నవారికి నష్టం తప్పుతుండగా.. లేనివారికి లాస్ ఖాయమే. మరి ఈ ప్రమాదం నుంచి మీరు సురక్షితంగా ఉన్నారా? లేదా?
వానలు జోరుగా పడుతున్నాయి. రోజూ కురుస్తున్న కుండపోత వర్షాలతో ఇప్పుడు వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎక్కడ పెట్టినా వాహనాలకు వరద ముప్పు తప్పట్లేదు మరి. దీంతో వాహన బీమా ప్రాధాన్యత ఇప్పుడు అందరికీ తెలిసొస్తున్నది. నిజానికి గతంతో పోల్చితే బీమా కంపెనీలు సైతం నేడు కస్టమర్లకు సమగ్ర పాలసీలనే అందిస్తున్నాయి. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. యాడ్-ఆన్ కవర్స్ కూడా ఉండటం మంచిది. ఇక ప్రీ మాన్సూన్ ఆఫర్ లేదా మాన్సూన్ ఆఫర్ వంటివి ఈ సీజన్లో కార్ల కంపెనీలూ ఇస్తున్నాయి. వీటిపైనా ఓ లుక్కేయడం బెటర్.
కాంప్రహెన్సివ్ పాలసీ అనేది మొత్తం కవరేజీని ఇస్తుంది అనుకోవడం పొరపాటు. వీటిల్లో ఇంజిన్, గేర్‌బాక్స్‌లు కవర్ కాకపోవచ్చు. నీళ్లలో మునిగి వాహనం పాడైపోతే.. మొదటగా ఎఫెక్ట్ అయ్యేది ఇంజిన్, గేర్బాక్స్లే. కాబట్టి యాడ్-ఆన్ విషయంలో కాస్త ఆలోచించండి. తెలివైన నిర్ణయం తీసుకుంటే ఇంజిన్ పార్ట్స్‌లో ముఖ్యమైన సిలిండర్ హెడ్ పిస్టన్, క్రాంక్ షాఫ్ట్ వంటివి కూడా బీమాలో భాగమవుతాయి. ఇంజిన్ పాడైతే దాని ఖర్చు భారీగానే ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
వర్షాకాలంలో ఇది కూడా మరో ముఖ్యమైన యాడ్-ఆన్. ఏదైనా కారణం చేత వాహనం రోడ్డుపైనే ఆగిపోతే మనకు వాహన కంపెనీ నుంచి కొద్దోగొప్పో సాయం లభిస్తుంది. థర్డ్‌పార్టీ సేవలు వినియోగించుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని క్లెయిం చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఒక్కోసారి టోయింగ్కి సిటీలో అయితే రూ.2,000-3,000, బయట ప్రాంతాల్లోనైతే ఇంతకు 2-3 రట్లైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అన్ని కార్ కంపెనీల సర్వీస్ సెంటర్లు అన్ని నగరాల్లో ఉండకపోవచ్చని గుర్తించండి. ఇది వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసుకున్న పాఠం. అందుకే కొద్దోగొప్పో మనకు అసిస్టెన్స్ లభించేందుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్నూ యాడ్-ఆన్‌లో చేర్చుకోండి. ఇది చాలాచాలా తక్కువ ఖర్చుతో లభిస్తుంది.
ఇక్కడ రెండు అంశాలుంటాయి. ఒకటి షోరూమ్ ఇన్వాయిస్, రెండోది ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ. కాలం గడిచేకొద్దీ వాహన విలువ తగ్గుతూ ఉంటుంది. ఇది ఇన్సూర్డ్ వాల్యూ. ఒకవేళ వాహనం చోరీ అయినా, లేదా ఏదైనా ప్రమాదం వల్ల పూర్తిగా ఉపయోగ యోగ్యం కాకపోయినా వచ్చే ధర ఇది. అయితే రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ తీసుకోవడం వల్ల సదరు సంవత్సరంలో ఏదైనా జరిగితే.. మనకు ఎక్స్‌షోరూం ధర లభిస్తుంది. ప్రధానంగా పాత కార్లకు ఐడీవీ మాత్రం బాగా తక్కువుంటుందని గమనించండి.
ఇది కూడా మరో ముఖ్యమైన యాడ్-ఆన్ కవర్. మన వాహనానికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఖర్చును పూర్తిగా భరించదు. రిపేర్ చార్జీలను కూడా కొన్ని సందర్భాల్లో అన్ని పార్ట్స్‌కు ఇవ్వదు. అయితే జీరో డిప్ యాడ్-ఆన్ కవరేజీ వల్ల బంపర్ టు బంపర్ కవరేజ్ లభిస్తుంది. బ్యాటరీలు, టైర్లు, ట్యూబ్స్ తప్ప దాదాపుగా అన్ని పార్ట్స్‌కు మొత్తం క్లెయిమ్ లభించే వీలుంటుంది. కానీ మరీ పాత వాహనాలకు ఈ యాడ్-ఆన్ ఇచ్చేందుకు కొన్ని బీమా కంపెనీలు నిరాకరిస్తున్నాయి.
బీమా ఉంది కదా అని.. నీళ్లలోకి వాహనాన్ని డ్రైవ్ చేయడం, దుందుడుకు చేష్టలు వంటి వాటిని బీమా కంపెనీలు ముమ్మాటికీ ఒప్పుకోవనే విషయం మరువద్దు. ఇన్సూరెన్స్ అనేది ఫైరింజన్ లాంటిది. పక్కన ఎమర్జెన్సీ కోసం ఉంచుకోవాలేగానీ.. దాన్ని ఎప్పుడో ఒకసారైనా ఉపయోగించాలనే ఆత్రం పనికిరాదు. ఏదేమైనా భారీ వర్షాల్లో డ్రైవిం గ్ చేసేటప్పుడు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాహనదారులు కనీస జాగ్రత్తల్నైనా పాటిస్తే మంచిది.
-నాగేంద్ర సాయి కుందవరం
ఇటీవలికాలంలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) వినియోగం బాగా పెరిగిపోతున్నది. కార్లు, బైకులు, త్రీవీలర్లు ఇలా అన్నింటా ఈవీల సందడి మామూలుగా లేదు. కాబట్టి ఈవీల యజమానులూ బీమాకు తప్పక పెద్దపీట వేయాల్సిందే. ఈవీలకు బ్యాటరీ ప్యాక్ చాలా ముఖ్యం. దీంతో యాడ్-ఆన్‌లో అడిషనల్ బ్యాటరీ ప్రొటెక్షన్ కవరేజీ తీసుకోవడం ఎంతో ఉత్తమం. మనకు మనం మొత్తం బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇటువంటప్పుడు ఈ కవరేజీ లాభదాయకంగా ఉంటుంది.