Vijay Mallya-SEBI | పరారీలో ఉన్న వ్యాపారవేత్త, మాజీ లిక్కర్ బారోన్ విజయ్ మాల్యా విషయమై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ కీలక నిర్ణయం తీసుకున్నది. మూడేండ్ల పాటు ఆయన గానీ, ఆయన సంస్థలు గానీ సెక్యూరిటీ మార్కెట్లలో ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించింది. స్విస్ బ్యాంక్ యూబీఎస్ తోపాటు పలు ఓవర్సీస్ బ్యాంకుల్లోని ఖాతాల ద్వారా ఆయనకు సంబంధించిన ఏదేని లిస్టెడ్ సంస్థ కూడా సెక్యూరిటీ మార్కెట్లలో ట్రేడింగ్ నిర్వహించరాదంటూ నిషేధం విధించింది. నేలకు పరిమితమైన ఎయిర్ లైన్స్ ‘కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంబంధిత ఫ్రాడ్ కేసులో ఇంగ్లండ్ నుంచి విజయ్ మాల్య అప్పగింత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. 2016 మార్చి నుంచి విజయ్ మాల్య.. లండన్ లోనే నివసిస్తున్నాడు.
2006 జనవరి నుంచి 2008 మార్చి వరకూ మ్యాట్టర్ హార్న్ వెంచర్స్ అనే విదేశీ సంస్థాగత ఇన్వెస్టింగ్ సంస్థ ద్వారా తన గ్రూపు ఆఫ్ కంపెనీల్లో విజయ్ మాల్య లావాదేవీలు నిర్వహించినట్లు సెబీ దర్యాప్తులో తెలిపింది. విజయ్ మాల్యా కు చెందిన సంస్థలే హర్బర్ట్స్ సన్స్, యునైటెడ్ స్పిరిట్స్. వీటిల్లో వేర్వేరు ఓవర్సీస్ ఖాతాల ద్వారా నిధులు సమకూరుస్తున్నారని తేలింది. ప్రస్తుతం యునైటెడ్ స్పిరట్స్.. ఇంగ్లిష్ లిక్కర్ జెయింట్ డియాగియో ఆధీనంలో ఉంది. విజయ్ మాల్య తన ఐడెంటిటీని దాచి పెట్టి యూబీఎస్ లో వేర్వేరు ఖాతాల ద్వారా నిధులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు సెబీ నిర్ధారించింది. హర్బర్ట్ సన్స్ లో మ్యాట్టర్ హార్న్ నాన్ ప్రమోటర్ పబ్లిక్ షేర్ హోల్డర్ గా ఉందని, 9.98 శాతం వాటా కలిగి ఉందని శుక్రవారం జారీ చేసిన నిషేధాజ్ఞల్లో సెబీ తెలిపింది.