న్యూఢిల్లీ, జూలై 2: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్.. మంగళవారం ఓ ప్రీ-పెయిడ్ ఫారెక్స్ కార్డును పరిచయం చేసింది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల కోసం ‘సఫిరో’ సిరీస్లో ఈ కార్డును బ్యాంక్ తీసుకొచ్చింది.
చదువు సంబంధిత ఖర్చులను అధిగమించడానికి అటు విద్యార్థులతోపాటు ఇటు తల్లిదండ్రులకూ తమ ఈ కార్డు ఎంతో సౌకర్యవంతంగా, ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. అడ్మీషన్ ఫీజులు, కోర్సు సంబంధిత చెల్లింపులతోపాటు ప్రయాణం, భోజనం, కిరాణా ఇతర రోజువారీ ఖర్చులకు సఫిరో ఫారెక్స్ కార్డు ఉపయోగపడుతుందని ఓ ప్రకటనలో బ్యాంక్ వివరించింది.