Credit card bills | క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపు గడువు విషయంలో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) కీలక ఆదేశాలిచ్చింది. గడువు దాటిపోయినప్పటికీ కస్టమర్లపై అదనపు భారం పడకుండా వెసులుబాటు కల్పించింది. ఇలాంటి వారిపై వడ్డీల పేరుతో భారం మోపొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే గడువు తేదీని చాలా మంది మరిచిపోతుంటారు. సకాలంలో బిల్లు చెల్లించనివారి నుంచి పెద్ద మొత్తంలో ఆలస్య రుసుంతోపాటు వడ్డీ, ఇతర ఛార్జీలు ఆయా క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వసూలు వేస్తుంటాయి. ఇది సిబిల్ స్కోర్‌పైన కూడా ప్రభావం చూపుతుంది. బిల్లు చెల్లింపు గడువును మరిచిపోయిన వారికి వెసులుబాటు కల్పించే నిర్ణయం ఆర్బీఐ తీసుకున్నది.
క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలను ఆర్బీఐ ఇటీవల తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు జారీ సంస్థలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు బకాయి పడిన రోజుల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ముగిసిన 3 రోజుల వరకు కస్టమర్లపై ఎలాంటి అదనపు రుసుం విధించకూడదు. గడువు తేదీ ముగిసిన విషయాన్ని వారికి సమాచారమిచ్చి, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం కల్పించాలి. 3 రోజుల తర్వాత కూడా చెల్లించనిపక్షంలో నిబంధనల ప్రకారం అవపరాధ రుసుం, వడ్డీ వసూలు చేయాలి. ఆలస్య రుసుం అవుట్‌స్టాండింగ్ మొత్తంపైనే వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనతో కస్టమర్లకు పెద్ద మొత్తంలో వడ్డీ, ఫైన్ చెల్లించే భారం తప్పిపోనున్నది.