Koil Alwar Thirumanjanam | శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 10 నుంచి 12 వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. 10న పెద్దశేష వాహనం, 11న హనుమంత వాహనం, 12న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.