ఎదురుతిరిగితే చంపేస్తాం..

Sun,September 15, 2019 03:03 AM

-అన్యాయాన్ని నిలదీసిన మహిళపై గ్రామపెద్దల దాడి
-సర్పంచ్ సాక్షిగా కాళ్లు మొక్కించుకొని కక్ష సాధింపు
-అవమానంతో బాధితురాలి ఆత్మహత్యాయత్నం
-యాదాద్రి జిల్లా కాలువపల్లిలో దారుణం

ఆత్మకూరు(ఎం): తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించిన మహిళపై ఆ ఊరి పెద్దలు దాడిచేశారు. చేయని తప్పును.. ఒప్పుకోవాలని బెదిరించి సర్పంచ్ సాక్షిగా రచ్చబండ వద్ద కాళ్లు మొక్కించారు. ఈ విషయాన్ని మీడియాకు చెప్తే.. కుటుంబాన్ని గ్రామం నుంచి వెలేస్తామని హుకూం జారీచేశారు. అవమానం తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పా ల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని కాలువపల్లిలో జరిగింది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాలువపల్లికి చెందిన సంఘబంధం మాజీ అధ్యక్షురాలు పలుసం పద్మ 2015లో వాటర్‌షెడ్ పథకంలో జీవనోపాధి కోసం సంఘం తరఫున రూ.2.60 లక్షల రుణం పొందింది. గ్రామంలోని 74 మంది సభ్యులకుగాను 55 మంది సభ్యులు ఈ మొత్తం తీసుకున్నారు. రుణాలు తీసుకున్న మహిళలు కొందరు వడ్డీతోపాటు చెల్లించగా.. కొందరు చెల్లించలేదు. అప్పటి సంఘబంధం అధ్యక్షురాలైన పద్మ ఈ బకాయి లను చెల్లించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. చేసేదిలేక పద్మ రుణం పొందిన మహిళలపై ఒత్తిడితెచ్చి వడ్డీతోపాటు రుణం చెల్లించారు.

2019 మేలో వెలుగు అధికారులు గ్రామంలో ఆడిట్ నిర్వహించి సంఘబంధం సభ్యులు తీసుకున్న రూ.2.60 లక్షలకు వడ్డీతో కలుపుకొని రూ.3.49 లక్షలు చెల్లించారని, ఇందులో ఎలాంటి అవకతవకలులేవని తేల్చిచెప్పి కొత్త అధ్యక్షురాలిని ఎన్నుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గ్రామంలోని కొందరు పెద్దమనుషులు మాత్రం వ్యక్తిగత కక్షతో ఆగస్టు 28న పద్మ కుటుంబసభ్యులను రచ్చబండ వద్దకు పిలిపించారు. రూ.2.60 లక్షల రుణానికి వడ్డీతో కలుపుకొని రూ.4 లక్షలైందని, మరో రూ.50 వేలు కట్టాలని బెదిరించారు. లెక్కలు సక్రమంగా ఉన్నాయని వెలుగు అధికారులు నిర్ధ్దారించారని, ఇప్పుడు రూ.50 వేలు ఎందుకు కట్టాలని పద్మ కుటుంబసభ్యులు ఎదురు తిరిగారు. దీనిని జీర్ణించుకోలేని గ్రామపెద్దలు కొందరు పద్మ కుటుంబసభ్యులపై దాడిచేసి సర్పంచ్ సాక్షిగా కాళ్లు మొక్కించుకున్నారు. ఈ అవమానం తట్టుకోలేక పద్మ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయినప్పటికీ ఆమె కుటుంబానికి బెదిరింపులు తప్పలేదు. ఈ విషయాన్ని మీడియాకు చెప్తే చంపేస్తామని, కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రాణభయంలో బాధితురాలు ఈనెల 12న ఆత్మకూర్(ఎం) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దాడిచేయడమేకాకుండా, చేయని తప్పును ఒప్పుకోవాలని బెదిరించి కాళ్లు మొక్కించి రూ.50 వేలు వసూలుచేసిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరింది.

1350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles