ఆర్టీసీ కథ కంచికేనా!

Fri,October 18, 2019 03:10 AM

-వాస్తవాలేమిటి?.. అసలు ఏంజరుగుతున్నది?
-పీకల్లోతు అప్పులు
-ఎడతెగని సంక్షోభం
-ఏటా 1200 కోట్ల నష్టం
-తెలంగాణ వచ్చిన తర్వాత 67% పెరిగిన జీతాలు
-600% పెరిగిన ప్రభుత్వ నిధులు
-అయినా చర్చల మధ్యలో చట్టవిరుద్ధంగా సమ్మెకు తెగింపు
-కార్మికుల జీవితాలతో యూనియన్ల చెలగాటం
-ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీసిన సంఘాలు
-సంస్కరణలకు అడుగడుగునా విఘాతం
-సంస్థ ఆదాయ వ్యయాల మధ్య అంతులేని అగాధం
-ఆదాయం రూ.4,882 కోట్లు.. ఖర్చు రూ.5,811 కోట్లు
-అద్దె బస్సులు లాభాల్లో.. సొంత బస్సులు నష్టాల్లో
-రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన ప్రైవేటు వాహనాలు
-సమ్మెకాలంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
-ఫలితంగానే ప్రభావం లేని ఆర్టీసీ కార్మికుల సమ్మె
-ఆదాయం వచ్చే రోజుల్లో సమ్మె సబబేనా?
-పండుగ సీజన్‌లో ఆదాయమార్గానికి దెబ్బ
-అంతిమంగా నష్టపోయేది కార్మికులే
-ఇది.. స్వయంగా విషం తీసుకోవడమే
-కార్మిక సంఘాలకు నిపుణుల హితవు

ఆర్టీసీ సమ్మెతో ఇబ్బంది పడుతున్నదెవరు? నష్టపోతున్నదెవరు? కష్టాలు ఎదుర్కొంటున్నదెవరు? భవిష్యత్తులో దీని పర్యవసానాలు అనుభవించేది ఎవరు?! ప్రభుత్వమా? ప్రయాణికులా? ఆర్టీసీ కార్మికులా?.. ఆర్టీసీలో అసలేం జరుగుతున్నది? కనిపిస్తున్న వాస్తవాలేమిటి? కనిపించనివేమిటి? ఎర్రబస్సుకు ఇన్ని కష్టాలెందుకు? పల్లెవెలుగు ఎందుకు ఆరిపోతున్నది?.. గత పదమూడు రోజులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సర్వత్రా చర్చనీయాంశమవుతున్న కీలక అంశాలు ఇవే! ఒకవైపు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న సంస్థ కార్మికులు.. మరోవైపు అవసరమైన కీలకమైన సమయంలో రవాణాకోసం ఇబ్బంది పడిన.. పడుతున్న ప్రజలు! అంతా తెలంగాణవారే! ఓ ఐదేండ్ల క్రితం వరకు మా తెలంగాణ మాకు కావాలని త్యాగాలకు తెగించి కొట్లాడినవారే! చారిత్రక ఆందోళనల్లో భాగస్వాములై.. కొత్త చరిత్రను సృష్టించినవారే! అందుకే వారందరికీ సంబంధించిన ఈ సమస్యను మూలాల్లోంచి పరిశీలించాలని నమస్తే తెలంగాణ భావించింది. రాష్ట్రసాధన సమరంలో అక్షరాయుధాలు అందించి, బాధ్యతాయుత పాత్ర పోషించిన స్ఫూర్తితోనే.. కార్మికులు రోడ్డున పడ్డారన్న బాధతోనే.. వాస్తవాలను గణాంకాలతో సహా అన్వేషించింది. ప్రస్తుతం సాగుతున్న ఆందోళన నేపథ్యాన్ని లోతుగా విశ్లేషించింది. ఆ క్రమంలో సమైక్యరాష్ట్ర సమయం నుంచీ పాతుకుపోయిన అనేక విడ్డూరాలు దృష్టికొచ్చాయి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆర్టీసీని ఆదుకొనేందుకు జరిగిన ప్రయత్నాలు కనిపించాయి. ఒక మహా భయంకరమైన వినాశం అంచుపై ఆర్టీసీ నిలిచి ఉన్న ఆందోళనకర వాస్తవాలూ వెలుగులోకి వచ్చాయి! ఆర్టీసీలో కీలక సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాయి!
TSRTCstrike1
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: నిజాంకాలం నుంచి సేవలందిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఘన చరిత్రే ఉన్నది. రైల్వేలైన్లు పెద్దగాలేని తెలంగాణలో ప్రజలకు ఆర్టీసీయే పెద్ద దిక్కు. పట్టణాలు, గ్రామాల హద్దులను చెరిపివేస్తూ విస్తృత సేవలందిస్తున్నది. ఆర్టీసీకి రాష్ట్రంలోని 11 రీజియన్లు 24 డివిజన్ల పరిధిలో మొత్తం 97 డిపోలున్నాయి. ఆర్టీసీ సొంత బస్సులు 8,360, అద్దె బస్సులు 2100.. మొత్తం 10,460 బస్సులు సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో సగానికిపైగా.. అంటే 6,620 బస్సులు గ్రామీణప్రాంతాల్లో నడుస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో 3,840 బస్సులు సేవలందిస్తున్నాయి. ఇందులో 453 ఏసీ బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరిగే రూట్లు మొత్తం 3,692. ఒక్కో బస్సులో సగటున 956 మంది చొప్పున.. రోజుకు దాదాపు కోటిమందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఆర్టీసీలో మొత్తం ఉద్యోగులు 49,340. ఇంత పెద్ద శ్రామికశక్తి, ఇంత పెద్ద నెట్‌వర్క్ ఉండి కూడా ఆర్టీసీ నష్టాల్లోకి జారుతున్నది. మొత్తం 97 డిపోలకుగాను 11 డిపోలు మాత్రమే లాభాల్లో నడుస్తుండటమే ఇక్కడ విషాదం. బస్సుల్లో ప్రయాణికుల రద్దీని గమనిస్తే.. ఆర్టీసీకి భారీ ఎత్తున లాభాలు రావాలి. కానీ.. అంతులేని నష్టాలు వస్తున్నాయి. ఎందుకు?

ఆర్టీసీకే నష్టాలు ఎందుకు?

ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నది! కచ్చితంగా చెప్పాలంటే.. గతంలో తీసుకున్న అప్పులు, వాటితోపాటు పీఎఫ్, సీసీఎస్, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ తదితర రూపాల్లో ఉన్నవన్నీ కలిపి దాదాపు ఐదువేల కోట్ల రూపాయల వరకు అప్పులున్నాయి. వీటిలో రుణాలుగా తీసుకున్నవి రూ.3,049 కోట్లు, సీసీఎస్, పీఎఫ్ తదితరాలు రూ.1660 కోట్లు ఉన్నాయి. మరోవైపు.. ఇప్పటికే పది లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు ఆర్టీసీలో 2,600 ఉన్నాయి. మరో 400 బస్సులు ఆ మైలురాయికి దగ్గరలో ఉన్నాయి. వీటిస్థానంలో కొత్తగా మూడువేల బస్సులు కొనుగోలుచేయటానికి ఎంతలేదన్నా రూ.800 కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు అవసరం. ఇవి కొనకపోతే ఆర్టీసీ మనుగడ ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యంకాదు. అంటే ఆర్టీసీ గట్టెక్కాలంటే కనీసం రూ.5,700 కోట్ల నుంచి రూ.6,000 కోట్లు కావాలి. కచ్చితంగా సంస్థకు ఇదో పెద్ద గుదిబండే. ఇక సగటున వార్షిక నష్టాలు రూ.1200 కోట్లుగా ఉన్నాయి. ఇవి రోజురోజుకు పెరుగుతున్నాయితప్ప తగ్గడంలేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇవి తిరుగులేని సత్యాలు! కనుక.. ఇవి ఎందుకు వస్తున్నాయి? రుణభారం ఎందుకు పెరుగుతూ పోతున్నది? దీన్ని నివారించేందుకు ఏం చేయాలి? అనేదే ప్రశ్న!

ప్రభుత్వ నిధులిస్తున్నా నష్టాలే!

ఆర్టీసీకి ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రభుత్వాల నుంచి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. 2009-10 నుంచి 2013-14 వరకు.. ఆర్టీసీకి రూ.712 కోట్లు ఇస్తే.. తెలంగాణ సిద్ధించిన తర్వాత.. ఒకప్పుడు రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం, ఆనాడు ఆ సంస్థతో పెనవేసుకున్న అనుబంధం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2014-15 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మొత్తం రూ.4,253 కోట్లు! వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది వాస్తవం. 2009-10లో నాటి సమైక్య ప్రభుత్వం రూ.66.62 కోట్లు ఇస్తే.. 2013-14 నాటికి అది రూ.193 కోట్లుగా ఉన్నది. కానీ.. 2014-15 రూ.598.61 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రతియేటా నిధులు పెంచుతూ వస్తున్నది. సమైక్య రాష్ట్రంలోని ఐదేండ్ల కేటాయింపులతో పోల్చితే.. గడిచిన ఐదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా దాదాపు 600% నిధులు అధికంగా ఇచ్చింది. ఇంతటి ఆర్థికసహకారం ఉన్నప్పటికీ ఆర్టీసీ ఎందుకు ఇంకా నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నది? అనేది చర్చించాల్సిన అంశం. బస్సులు ఎక్కే ప్రజలు లేరా? అంటే ఉన్నారు. ఉన్నారు కాబట్టే వివిధ కాంట్రాక్ట్ క్యారియర్లు, ట్రావెల్స్ సర్వీసులు పెద్దసంఖ్యలో నడుస్తున్నాయి. ఇవన్నీ లాభాల్లోనే ఉన్నాయి. రోజురోజుకు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా పర్మిట్లు ఇచ్చిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాతే కొత్త పర్మిట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయినా ఆర్టీసీ బస్సులు మాత్రం నష్టాలబాట పట్టాయి. అద్భుతమైన సిబ్బంది.. నిపుణులైన డ్రైవర్లు, అత్యంత కనిష్ఠస్థాయి ప్రమాద సగటు.. ఇన్ని ఉన్నా.. ఆర్టీసీ లాభాల బాట పట్టటానికి సతమతమవుతున్నది.

అద్దె బస్సులు లాభాల్లో.. సొంత బస్సులు నష్టాల్లో

ఆర్టీసీలో యాజమాన్యం బస్సులు 8,360 ఉన్నాయి. మరో 2,100 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే.. ఆర్టీసీ బస్సులు కిలోమీటరుకు రూ.13 నష్టంతో నడుస్తున్నాయి. అంటే.. రోజుకు మూడు కోట్లపైనే నష్టం వాటిల్లుతున్నది. అదే సమయంలో ఆర్టీసీలోని అద్దె బస్సులు కిలోమీటరుకు 75 పైసలు లాభంతో.. రోజుకు 4.72 కోట్ల లాభంతో నడుస్తున్నాయి. ప్రైవేటు బస్సులు సాధించే లాభాలను.. ఆర్టీసీలోనే తిరిగే అద్దెబస్సులు సాధించే లాభాలను ఆర్టీసీ సొంతబస్సులు ఎందుకు సాధించలేకపోతున్నాయనే ప్రశ్న తలెత్తుతున్నది.
TSRTCstrike2

ఐదేండ్లలో 67% వేతనాల పెంపు

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆర్టీసీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీకావు. ఏండ్లు గడిచినా జీతాల పెంపు లేక అనేక ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్‌మెంట్ ప్రకటించారు. దానివల్ల సంస్థపై ఏటా రూ.900 కోట్ల అదనపు భారం పడుతున్నది. 2018లో మరో 16% ఐఆర్ ప్రకటించారు. దాని భారం మరో రూ.200 కోట్లు తోడైంది. మొత్తంగా ఈ ఐదేండ్ల వ్యవధిలో ఆర్టీసీ కార్మికులకు తరతమ స్థాయిల్లో 67.04% మేర వేతనాలు పెరుగటం గమనార్హం. ఒకవైపు సంస్థకు అప్పులు, నష్టాలు ఉన్నా.. కార్మికుల వేతన డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందునే ఇది సాధ్యమైంది. వాస్తవానికి దేశంలోని మరే ఆర్టీసీలోనూ ఈస్థాయిలో జీతాలు పెంచలేదు. వెరసి.. ఆ నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచింది. కరువుభత్యం రూపంలో కార్మికులకు మరో రూ.100 కోట్లను సంస్థ చెల్లిస్తున్నది. అయినప్పటికీ మళ్లీ వేతనాల పెంపు డిమాండ్‌ను కార్మికసంఘాలు ముందుకు తేవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

భారీగా పెరిగిన వాహనాలు

ఇప్పుడు పోటీ ప్రపంచం పరుగులు పెడుతున్నది. సాధారణంగా ప్రజలెవరైనా మరింత ఉత్తమ సేవలవైపే మొగ్గు చూపుతారు. అది ప్రైవేటు ట్రావెల్స్ కావచ్చు.. పల్లెల్లో ఆటో సర్వీసులు కావచ్చు! ప్రజలకు రవాణాను మరింత చేరువ చేస్తున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితినే గమనిస్తే.. తెలంగాణ రావటానికి ముందటివరకు ఈ ప్రాంతంలో 71 లక్షల వాహనాలు ఉండగా.. ఈ ఐదేండ్లలోనే కొత్తగా అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 50 లక్షలు అదనంగా పెరిగాయి. అంటే మొత్తం కోటీ 21 లక్షల వాహనాలు అయ్యాయి. వీటిలో మోటర్‌సైకిళ్లే 91 లక్షల వరకు ఉన్నాయి. అద్దెకార్లు, ట్యాక్సీ/ మ్యాక్సీ క్యాబ్‌లు సుమారు 1.40 లక్షల వరకు ఉన్నాయి. స్టేజీ క్యారేజ్‌లుగా పర్మిట్లు తీసుకున్న బస్సులు (13 సీట్ల నుంచి 50 సీట్ల సామర్థ్యం ఉన్నవి) 4100 ఉన్నాయి. వీటికితోడు వివిధ ట్రావెల్ సంస్థలు 1500 బస్సులకు పర్మిట్లు తీసుకొని నడుపుతున్నాయి.

ఇక వీటన్నింటితోపాటు ఐదు లక్షల ఆటోలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత వాహన వినియోగం పట్టణ ప్రాంతాలతోపాటు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లటానికైనా ఆర్టీసీ బస్సులే దిక్కు. కానీ.. మారిన పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయాలు పెరిగాయి. ఆర్టీసీకి క్యాప్టివ్ ప్యాసింజర్స్ ఇప్పుడు లేరు. హైదరాబాద్‌లో ఒకప్పుడు ఆర్టీసీ బస్సు లేకపోతే ప్రయాణం ఉండేదికాదు. ఇప్పుడు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటివి అందుబాటులోకి వచ్చాయి.. ప్రజలకు ఇబ్బందిలేకుండా పోయింది. గతంలో ఆర్టీసీ సమ్మె జరిగిందంటే.. ప్రజారవాణా దాదాపు స్తంభించిపోయేది. ప్రయాణాలు వాయిదా వేసుకునేవారు. జనజీవితం అస్తవ్యస్తమయ్యేది. కానీ.. ప్రస్తుతం తెలంగాణలో 13 రోజులుగా సమ్మె జరుగుతున్నా దాని ప్రభావం కనిపించకపోవటానికి పైన పేర్కొన్న పరిస్థితులు కూడా ఒక కారణం. దీనికితోడు ప్రభుత్వం కూడా అనేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో ప్రజలకు రవాణాసేవల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావటం లేదని రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు.

చట్టవిరుద్ధంగా సమ్మెలోకి

కార్మికసంఘాలు కొందరి ప్రోద్బలంతో సమ్మెకు దిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. కార్మికసంఘాల సమ్మె నోటీసు నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఒకపక్క చర్చల ప్రక్రియను సుగుమం చేస్తూ సయోధ్య ప్రక్రియ (కన్సిలియేషన్) ప్రారంభించింది. ఇది కొనసాగుతుండగానే యూనియన్లు సమ్మె తేదీని ప్రకటించాయి. ఇది వాస్తవానికి చట్టవిరుద్ధం. సమ్మె చట్టవిరుద్ధమని స్పష్టంగా కనిపిస్తున్నదని హైకోర్టు సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వానికి సమ్మె గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రిస్థాయిలో దీనిపై చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిస్థాయి అధికారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసింది. కమిటీ యూనియన్లతో సంప్రదింపులు ప్రారంభిస్తే.. ఆర్టీసీని విలీనం చేయాలన్న షరతు పెట్టి.. చర్చకు వెళ్లకుండా సమ్మెకు దిగాయి. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమని కార్మికచట్టాలపై అవగాహన ఉన్న నిపుణులు చెప్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత.. సమ్మె విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన యూనియన్లదేనని అంటున్నారు. సోయిదప్పి వ్యవహరిస్తున్న యూనియన్లు.. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, వాటి ఆటలో కార్మికులు పావులుగా మారి.. తమ భవిష్యత్తును, సంస్థ భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చుకుంటున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్టీసీలకు దూరంగా రాష్ర్టాలు

చాలా రాష్ర్టాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలను నిర్వహించడం లేదు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థలు లేవు. పెద్ద రాష్ట్రాలైన బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న బస్సుల సంఖ్య చాలా తక్కువ. తెలంగాణలో ప్రతి లక్షమంది జనాభాకు 29.44% బస్సులు ఉండగా, బీహార్‌లో 0.21%, పశ్చిమబెంగాల్‌లో 2.43%, ఒడిశాలో 1.09% బస్సులు ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. చాలా రాష్ర్టాలు ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టినా.. తెలంగాణలో దశాబ్దాల తరబడి వ్యవస్థ కునారిల్లుతూనే ఉన్నది. ఈ సమయంలో కచ్చితంగా ఆర్టీసీలో కొత్త అధ్యా యం మొదలుకావాల్సిందేనని పలువురు నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీలో సంస్కరణలు తీసుకువచ్చి, బయటిపోటీని తట్టుకునేలా సంస్థను తీర్చిదిద్దాలని చెప్తున్నారు. ఇప్పటికీ రవాణాపరంగా ఆర్టీసీకి ఉన్నంతటి నెట్‌వర్క్ మరి దేనికీలేదు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు నడుస్తున్న నేపథ్యంలో సరుకు రవాణా, నగరాలు, పట్టణాల్లో కాలనీలకు సర్వీసులు సహా అనేక ప్రత్యామ్నాయాలపై సంస్థ దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. సంస్థలో ఎక్కడ లోపాలు ఉన్నాయో గమనించి, వాటిని చక్కదిద్దుకుని, సంస్కరణలు చేపడితేనే సంస్థ మనుగడ సాధించగలుగుతుందని చెప్తున్నారు. ఇందుకు మార్గం సుగమం చేయడమే సంస్థ బంగారు భవిష్యత్తుకు మూలమని అంటున్నారు.

జీతాలు చెల్లించేదెలా?

ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ యాజమాన్యం కార్మికులకు, సిబ్బందికి సెప్టెంబర్ నెల వేతనం బకాయి పడి ఉన్నది. ఇందుకు సుమారు రూ.240 కోట్లు అవసరం ఉన్నది. కానీ, ఇప్పటికిప్పుడు (శుక్రవారంనాటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు) ఆర్టీసీ వద్ద ఉన్న సొమ్ము రూ.8 కోట్లు మాత్రమే. ఇవికూడా రోజువారీ ఖర్చులతో ఎప్పటికప్పుడు క్షీణించిపోతున్నాయి. ఆర్టీసీ.. కార్పొరేషన్ కావటంతో వాళ్ల సొమ్ముతో వాళ్లే జీతాలు, ఇతర ఖర్చులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇప్పటికిప్పుడు వచ్చే సొమ్ము, బకాయిలు కూడా ఏమీలేవు. ప్రభుత్వం వివిధ రాయితీలు, బస్సు పాసులు తదితరాలకు ఇచ్చే సొమ్మును కూడా ఎప్పటికప్పుడు ఇచ్చివేసింది. ఇక ఇంతటి ఆర్థికమాంద్యంలోనూ గత బడ్జెట్‌లో ఆర్టీసీ కోసం ప్రత్యేకంగా రూ.550 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ములో అక్టోబర్ నాటికి రూ.425 కోట్లను అందించింది. వాస్తవానికి ప్రతి నెల పది, ఇరవై కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఆర్టీసీ దుస్థితిని దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం.. ఇస్తామన్న సొమ్ములో 77% నిధులను ఇప్పటికే ఇచ్చివేసింది.

ఈ పరిస్థితిలో ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కార్మికుల జీతాలకు నిధులు వచ్చే అవకాశం ఏ మాత్రంలేదు. ఆర్థికమాద్యం దృష్ట్యా ప్రభుత్వం కూడా ఆదుకొనే పరిస్థితి లేదని చెప్తున్నారు. కనుక ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఆర్టీసీకి సాధ్యంకాకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని హైకోర్టు.. ట్రిబ్యునల్‌కు నివేదిస్తే చట్టప్రకారం కచ్చితంగా జీతాలు చెల్లించాల్సిందేనని, అందుకు ఆర్టీసీ తన ఆస్తులు అమ్ముకోవటం మినహా మరో మార్గంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు బకాయిలు చెల్లించకపోతే బ్యాంకులు ఎన్పీఏలుగా ప్రకటిస్తాయి. ఆ పరిస్థితే తలెత్తితే.. సంస్థ మునగటం ఖాయమని, ఆర్టీసీ కథ ఇక కంచికేనని అంటున్నారు.
TSRTCstrike3

ఆదాయం వచ్చే రోజుల్లో సమ్మె సబబేనా?

ఎక్కడైనా సరే, ఏ ఉద్యోగి అయినా సంస్థను కాపాడుకుంటేనే బతుకుదెరువు ఉండేది. కానీ, ఆర్టీసీ కార్మిక సంఘాలవైఖరి భిన్నంగా కనిపిస్తున్నది. సంస్థకు ఆదాయం గరిష్ఠంగా వచ్చే రోజులు (పీక్ సీజన్), సాధారణ ఆదాయం ఉండే రోజులు (ఆఫ్ సీజన్) ఉంటాయి. పండుగదినాలు, సెలవురోజులను పీక్ సీజన్‌గా పరిగణిస్తారు. మరింత ఆదాయం సాధించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. పీక్ సీజన్‌లో వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తిప్పడం ద్వారా సంస్థకు రాబడి పెరుగుతుంది. ఆఫ్‌సీజన్‌లో రద్దీ సాధారణంగా, లేదా తక్కువగా ఉంటుంది కాబట్టి.. అప్పుడు తగ్గే ఆదాయాలను పీక్ సీజన్‌లో నడిపే ట్రిప్పులతో భర్తీచేసుకునేందుకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి. ఆర్టీసీకి దసరా, బతుకమ్మ పండుగ రోజులు పీక్‌సీజన్. తెలంగాణలో ఇదే పెద్ద పండుగ. ఈ సమయంలో వారంపదిరోజులపాటు ప్రయాణాలు బాగా ఉంటాయి. సాధారణ రోజుల్లో రూపాయి ఆదాయం లభించే చోట.. ఇటువంటి పండుగ సీజన్లలో రూపాయిన్నర ఆదాయం లభిస్తుంది. మొత్తంగా ఈ ఒక్క సీజన్‌లోనే రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పొందే వెసులుబాటు ఆర్టీసీకి ఉన్నది. కానీ.. ఒకవైపు సంస్థ అప్పుల ఊబిలో, నష్టాల్లో కూరుకుపోయి ఉన్న సమయంలో ఆర్టీసీ కార్మికులు ప్రధాన ఆదాయ వనరుకు దెబ్బకొట్టేలా సమ్మెకు దిగటమే ఆశ్చర్యం కల్గిస్తున్నదని పలువురు అంటున్నారు.

సరిగ్గా ఈ నెల నాలుగో తేదీ (శుక్రవారం) అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటం గమనార్హం. నిజంగా సంస్థ పట్ల ప్రేమ, అభిమానం ఉన్నవారు, సంస్థకు ఆదాయం లభించే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించేవారు ఇటువంటి కీలక సమయంలో సమ్మెకు వెళ్లే ఆలోచన కూడా చేయబోరని పలువురు అంటున్నారు. కేవలం తమ పంతం నెగ్గించుకోవాలన్న ఉద్దేశంతో, పండుగ నేపథ్యంలో సమ్మెకు దిగి, ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయవచ్చునన్న దురుద్దేశంతోనే కార్మికులను కొందరు సమ్మెదిశగా నడిపించినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది ఆర్టీసీయేనన్న అంశాన్ని కార్మికులు గుర్తించకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధిక ఆదా యం వచ్చే రోజుల్లో రాత్రింబవళ్లు పనిచేసి, సంస్థ ఉన్నతికి తమ వంతు కృషిచేసి ఉంటే.. కార్మికుల కోరికలను తీర్చడానికి సంస్థ యాజమాన్యం కూడా సంతోషంగా ఒప్పుకొని ఉండేదేమో! కానీ.. వాస్తవ పరిస్థితులతో పొంతనలేకుండా.. రాజకీయ ప్రయోజనాలతో సమ్మెకు వెళ్లినందునే సమస్య ఇంత జటిలంగా మారిందని అంటున్నారు. వెరసి.. కార్మికులు సంస్థకు వచ్చే ఆదాయాన్ని అడ్డుకున్న ఉద్యోగులుగా మిగిలారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. లాభా లు సంపాదించుకునే సమయంలో సమ్మెకు దిగటం.. తెలిసి స్వయంగా విషం తీసుకోవడంతో సమానమని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనియన్లకు సిబ్బంది బతుకుతెరువు మీద బాధ్యత లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఆదాయ వ్యయాల మధ్య అగాధం

ఏ సంస్థ మనుగడైనా దాని ఆదాయం.. అది చేసే వ్యయం.. ఈ రెండింటి మధ్య వచ్చే లాభంపై ఆధారపడి ఉంటుంది. కానీ.. ఆర్టీసీ ఆదాయ వ్యయాలను పోల్చినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. 2019 మార్చి వరకు ఆదాయ, వ్యయాలను విశ్లేషిస్తే.. ఆర్టీసీకి అన్ని రకాల ఆదాయం కలుపుకొని రూ.4,882 కోట్లు ఉంటే.. ఖర్చు 5,811 కోట్లుగా ఉన్నది. అంటే.. సగటున ఆదాయానికి మించి సుమారు 119% వ్యయం కనిపిస్తున్నది. ఇంక లాభం ఎక్కడి నుంచి వస్తుంది? దీనితోపాటు.. ఆర్టీసీ ఆదాయంలో ఎక్కువశాతం జీతాలకే వెళ్లిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 3,20,992 మంది ఉద్యోగులుంటే, వచ్చే ఆదాయంలో 25.36% మాత్రమే జీతాలకు వెళ్తున్నది. లాభాలబాటలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థలో మొత్తం 48,942 మంది ఉద్యోగులు ఉంటే.. వచ్చే ఆదాయంలో 35.08% జీతాల కోసం వెచ్చిస్తున్న పరిస్థితి. మంచి పనితీరు కనబరుస్తున్న విద్యుత్‌రంగ సంస్థల్లోనూ ఇదే తీరు కనిపిస్తుంది. మొత్తం నాలుగు కార్పొరేషన్ల పరిధిలో 48,702 మంది ఉద్యోగులు ఉండగా సుమారు పదిశాతం మాత్రమే జీతాల రూపంలో చెల్లిస్తున్నది. కానీ.. ఆర్టీసీలో మాత్రం గరిష్ఠంగా, ఎక్కడా లేనంత స్థాయిలో 57.95% జీతాలకే చెల్లిస్తుండటం గమనార్హం. రవాణారంగ నిపుణులు ఈ లెక్కలు చూసి ముక్కునవేలేసుకుంటున్నారు. జీతాల తర్వాత భారీగా డీజిల్‌కు వెచ్చిస్తున్నారు. డీజిల్ కోసం ఆదాయంలో రూ.1,385 కోట్లు.. అంటే 28% ఆర్టీసీ ఖర్చుచేస్తున్నది. మూడోస్థానంలో అద్దె చెల్లింపుల కోసం రూ.624 కోట్లు.. అంటే 12.78% చెల్లిస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

24179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles