కేటీఆర్ ట్వీట్ కొండంత అండ

Sun,September 15, 2019 03:08 AM

-యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తాం
-దొంగే దొంగ అన్నట్టుగా బీజేపీ, కాంగ్రెస్ వ్యవహారం ఉన్నది
-మీడియాతో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నల్లమలలో యురేనియం తవ్వకాల అంశంపై ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన ట్వీట్ తమ ప్రాంత ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నదని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. కేటీఆర్ స్పందనతో నియోజకవర్గ ప్రజలకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టున్నదని చెప్పారు. ట్వీట్‌తో ఉత్సాహం నింపిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ట్వీట్‌తో యురేనియం తవ్వకాల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకునే నైజం సీఎం కేసీఆర్‌ది కాదని మంత్రి కేటీఆర్‌ను కలిసినప్పుడు చెప్పారని పేర్కొన్నారు. యురేని యం తవ్వకాలను వ్యతిరేకిస్తామని, దేశంలోనే అత్యధికంగా పులులు సంచరిస్తున్న నల్లమలను కాపాడుకుంటామని స్పష్టంచేశారు.

బీజే పీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ.. నల్లమలలో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు నల్లమలలో వజ్రాల తవ్వకాల కోసం అనుమతినిస్తే దానికి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేశామని గుర్తుచేశారు. తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానిక నాయకుడు సాంబశివుడుతో కలిసి మాజీ ఎంపీ కవిత పోరాటం చేసి న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కానీ, ప్రస్తుతం దొంగే దొంగ అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నల్లమలలో తవ్వకాలకు బీజమేసిన కాంగ్రెస్సే.. ప్రస్తుతం నల్లమలపై సీఎం కేసీఆర్ స్పందించడం లేదనడం బాధాకరమని పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నా, టీఆర్‌ఎస్ పార్టీ స్పందించడంలేదని నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరు

యురేనియం తవ్వకాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతినిచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితిలోలేరని గువ్వల బాలరాజు చెప్పారు. అడవులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బడ్జెట్‌లో రూ.కోట్లు కేటాయిస్తున్న ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్‌రావు నల్లమలలో యురేనియం తవ్వకాలకు మద్దతు తెలుపబోరని స్పష్టంచేశారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉన్నదని, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించా రు. సేవ్ నల్లమల పేరిట సెలబ్రిటీలు చేస్తున్న సహకారాన్ని తీసుకుంటామని వెల్లడించారు. అవసరమైతే సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలతో కేంద్రంపై పోరాటానికి సిద్ధమేనని గువ్వల స్పష్టంచేశారు.

463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles