764 టీఎంసీలు


Thu,July 11, 2019 02:46 AM

Telangana Engineers Committee Preliminary Report With Nine elements

-గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌కు తరలించేందుకు అందుబాటులో ఉన్న జలాలు
-75 శాతం డిపెండబిలిటీ, సరాసరి ప్రవాహాల ఆధారంగా అంచనా
-శ్రీశైలం, సాగర్ నుంచి రెండురాష్ర్టాల అవసరాలు 726.44 టీఎంసీలు
-రాంపూర్ నుంచి సాగర్‌కు గోదావరి మళ్లింపునకు రూ.67,500 కోట్లు
-శ్రీశైలానికి పొడిగించాలంటే అదనంగా రూ.10 వేల కోట్లు
-తొమ్మిది అంశాలతో తెలంగాణ ఇంజినీర్ల కమిటీ ప్రాథమిక నివేదిక!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌కు తరలించేందుకుగాను 764 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఇంజినీర్ల కమిటీ అంచనా వేసింది. గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ, సరాసరి ప్రవాహాల మధ్య తేడాను బేరీజు వేసిన కమిటీ ఈ అంచనాకు వచ్చింది. ప్రధానంగా తొమ్మిది అంశాలను కమిటీ తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ప్రాథమిక నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు..

మళ్లింపు పరిమాణం

గోదావరి జలవివాదాల ట్రిబ్యునల్ ప్రకారం 75 శాతం డిపెండబిలిటీపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాల వాటా 1,486 టీఎంసీలు. వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా గోదావరిలో సరాసరి ప్ర వాహం దాదాపు 2,250 టీఎంసీలు. అంటే.. 75 శాతం డిపెండబిలిటీ, సరాసరి ప్రవాహాల మధ్య తేడాప్రకారం కృష్ణాబేసిన్‌కు తరలించేందుకు 764 టీఎంసీల గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయి.

14 ప్రాజెక్టులు.. 726.44 టీఎంసీలు

నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి ప్రస్తుతం రెండు రాష్ర్టాల నీటి అవసరాలు 726.44 టీఎంసీలు. రెండు రాష్ర్టాల పరిధిలో... సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, ఎస్సెల్బీసీ, డిండి ప్రాజెక్టు, ఎస్సార్బీసీ, హంద్రీనీవా, గాలేరునగరి, వెలిగొండ, తెలుగుగంగ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు హైదరాబాద్, చెన్నై, మిషన భగీరథ తాగునీటి అవసరాలు ఉన్నాయి. వానకాలం తాగు, సాగునీటికి 600.94 టీఎంసీలు, యాసంగికి 125.50 టీఎంసీల అవసరాలు ఉన్నాయి.

కృష్ణాబేసిన్‌లో లోటు

బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లోని ప్రవాహాల జాబితా ప్రకారం.. 1961-62 నుంచి 2007-08 వరకు 47 ఏండ్లలో 11 సంవత్సరాల్లో లోటు ఉన్నట్టుగా గుర్తించాం. ఎగువరాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక బ్రిజేశ్ ట్రిబ్యునల్ కేటాయింపుల్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో 75 శాతం డిపెండబిలిటీపై దిగువన ఉన్న తెలుగు రాష్ర్టాల పరిధిలో 811 టీఎంసీల కేటాయింపునకుగాను లోటు 66 టీఎంసీల నుంచి 386 టీఎంసీల వరకు ఏర్పడుతున్నది. ఆధారిత సంవత్సరాల్లో శ్రీశైలం జలాశయానికి సరాసరిన 380 టీఎంసీల వరకు వరద వస్తున్నందున.. 726 టీఎంసీల నీటి అవసరాలను భర్తీచేసేందుకు మరో 346 టీఎంసీలు అవసరం.

ఆగస్టుకు ముందే మళ్లించాలి

ఎగువ రాష్ర్టాలు బ్రిజేష్ కేటాయింపులనూ వా డుకుంటున్న దరిమిలా ఆగస్టు మొదటివారం కంటే ముందే శ్రీశైలానికి వరద వచ్చే పరిస్థితి లేదు. జూన్, జూలై, ఆగస్టు అవసరాలకుగాను గోదావరిజలాలను మళ్లించాల్సి ఉంటుంది. పక్కా ప్రణాళికతో ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను ఏ ర్పాటుచేసుకొని మళ్లింపు చేపట్టాలి. తద్వారా శ్రీశైలం, సాగర్‌లోకి వరదొచ్చినా ఆ మేరకు ఖాళీ ఉంచుకోవాలి. శ్రీశైలం జలాశయానికి 500 టీఎంసీల జలాల్ని తరలించే వ్యవస్థ ఏ ర్పాటుకంటే రోజుకు టీఎంసీ చొప్పున వంద టీఎంసీలు మళ్లించే వ్యవస్థను ఏర్పాటుచేసుకోవడం ఆర్థికపరంగానూ ప్రయోజనకరం.

రూ.2500 కోట్లతో రాంపూర్ బరాజ్

రాంపూర్ పాయింట్‌గా గోదావరిజలాల మళ్లింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఇంజినీర్ల కమిటీ.. రెండురకాల అంచనా వ్యయాల్ని పొందుపరిచింది. ఇందులోభాగంగా రాంపూ ర్ వద్ద బరాజ్ నిర్మాణానికి రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది.
-రాంపూర్ నుంచి నీటిని నాగార్జునసాగర్ కు తరలించేందుకు చేపట్టే ప్రాజెక్టుకు రూ. 67.5 వేలకోట్ల ఖర్చవుతుందని అంచనా.
-ఈ అలైన్‌మెంట్‌లో 61 కి.మీ. సొరంగమార్గం నిర్మించాలి. 174 కి.మీ. గ్రావిటీ కాల్వ, 78 కి.మీ. లింక్‌కెనాల్, మూడుదశల్లో ఎత్తిపోతల అవసరం ఉంటుంది.
-రాంపూర్-నాగార్జునసాగర్-శ్రీశైలం తరలింపు ప్రాజెక్టుకు రూ.77వేల కోట్లు అవుతుందని అంచనా.
-మొదటి అలైన్‌మెంట్ కంటే అదనంగా 70 కి.మీ. సొరంగమార్గం నిర్మాణంతోపాటు, అదనంగా మరోదశ ఎత్తిపోతలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

4911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles