పల్లెలకూ బస్సు పరుగులు

Fri,October 18, 2019 03:06 AM

-13వ రోజూ ఆగని ప్రగతిచక్రం
-సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కనిపించని సమ్మె ప్రభావం
-రాష్ట్రంలో సాఫీగా సాగుతున్న ప్రయాణాలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. పల్లెలకు సైతం బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ సమ్మె గురువారం 13వ రోజుకు చేరినా.. ప్రజారవాణాకు ఇబ్బందిలేకుండా సర్కారు పకడ్బందీగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో తిరిగాయి. గురువారం జిల్లాలో ఆర్టీసీ, అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులు మొత్తం కలిపి 381 బస్సులు నడిచాయి. ఖమ్మం డిపోలో ఆర్టీసీ 67, అద్దె బస్సులు 58, సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ 70, అద్దె బస్సులు 29, మధిర డిపోలో ఆర్టీసీ 38, అద్దె బస్సులు 20, రవాణాశాఖ ఏర్పాటుచేసిన ప్రైవేట్ బస్సులు 29, మాక్సీక్యాబ్‌లు 70 వరకు సేవలందించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలో 268 బస్సులకుగాను 149 ఆర్టీసీ బస్సులు, 64 హైర్ బస్సులు కలిపి మొత్తం 213 బస్సులను తిప్పుతున్నారు. 70 శాతం బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, వరంగల్ ప్రాంతాలకు బస్సులను నడిపారు.
RTC-Bus1

కరీంనగర్‌లో 96.66 శాతం సర్వీసులు

కరీంనగర్ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో గురువారం 96.66 శాతం బస్సులు నడిచాయి. అధికారులు 659 బస్సులకుగాను 637 బస్సులను నడిపించారు. ఇందులో 438 ఆర్టీసీ, 199 అద్దె బస్సులు ఉన్నాయి. అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల డిపోల్లో 119 బస్సులు ఉండగా, గురువారం నడపాల్సిన బస్సులకంటే అధికంగా నడిపారు. జిల్లాలో 103 బస్సులు నడపాల్సి ఉండగా 108 బస్సులు తిరిగి, 104.85 శాతం బస్సు సర్వీసులు నడిచాయి. జగిత్యాల జిల్లాలో 198 బస్సులకుగాను 197, పెద్దపల్లి జిల్లాలో 149 బస్సులకుగాను 143, కరీంనగర్ జిల్లాలో 209 బస్సులకుగాను 189 బస్సులు తిరిగాయి.

దూర ప్రాంతాలకూ కదిలిన చక్రాలు

ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో 82 శాతం బస్సులు నడిచాయి. రీజియన్‌లో 552 బస్సులకుగాను 457 బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. ఆదిలాబాద్ డిపో పరిధిలో 114 బస్సులకు 87, ఆసిఫాబాద్ డిపో పరిధిలో 66 బస్సులకు 57, భైంసా డిపోలో 81 బస్సులకు 67 బస్సులు, మంచిర్యాల డిపో పరిధిలో 126 బస్సులకు 97 బస్సులు, నిర్మల్ డిపోలో 131 బస్సులకు 124 బస్సులు, ఉట్నూర్ డిపో పరిధిలో 32 బస్సులకు 25 బస్సులు తిరిగాయి. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌తోపాటు సూపర్ లగ్జరీలు, రెండు రాజధాని బస్సులు నడిచాయి. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 86 శాతం సర్వీసులు తిరిగాయి. పల్లెవెలుగుతోపాటు నాన్‌స్టాప్ మినీ బస్సులు, ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు మొత్తం 458 బస్సులు సేవలందించాయి.
RTC-Bus2

ఉమ్మడి మెదక్‌లో 87 శాతం తిరిగిన బస్సులు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని రీజియన్ పరిధిలో 87 శాతం బస్సులు తిరిగాయి. రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో 617 బస్సులకుగాను 542 బస్సులు నడిచాయి. వీటిలో 371 ఆర్టీసీ బస్సులు, 171 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. మెదక్ డిపోలో 98 బస్సులకుగాను 85, నారాయణఖేడ్ డిపోలో 57 బస్సులకుగాను 48 బస్సులు, సంగారెడ్డి డిపోలో 100 బస్సులకు గాను 95 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సిద్దిపేట డిపోలో 105 బస్సులకుగాను 95 బస్సులు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 69 బస్సులకుగాను 65 బస్సులు, జహీరాబాద్ డిపోలో 93 బస్సులు ఉండగా, 75 బస్సులు, దుబ్బాక డిపోలో 40 బస్సులకుగాను 34 బస్సులు, హుస్నాబాద్ డిపోలో 55 బస్సులకుగాను 47 బస్సులు తిరిగాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని వరంగల్ 1, 2, హన్మకొండ, భూపాలపల్లి, పరకాల, మహబుబాబాద్, నర్సంపేట, తొర్రూర్, జనగామ డిపోలకు చెందిన 930 బస్సులకుగాను 700 సర్వీసులు నడిచాయి.

పల్లె సర్వీసులు సైతం..

నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 308 బస్సులు నడింపించిన అధికారులు.. సుమారు 70 వేలమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. మునుపటిలాగే నల్లగొండ డిపో నుంచి హైదరాబాద్‌కు 10 నిమిషాలకో నాన్‌స్టాప్ బస్సు నడుపుతుండగా.. గ్రామీణ ప్రాంతాలకు పల్లెవెలుగు బస్సులను నడిపిస్తున్నారు. సూర్యాపేట డిపో పరిధిలో 65 ఆర్టీసీ, 45 ప్రైవేట్, 12 స్కూల్ బస్సులు కలిపి మొత్తం 122 బస్సులు తిరిగాయి. కోదాడ డిపో పరిధిలో 72 బస్సులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 58 ఆర్టీసీ బస్సులు, 15 అద్దె బస్సులు, 60 ఇతర బస్సులతో కలిపి మొత్తం 133 బస్సులు నడిచాయి. వికారాబాద్ డిపోలో 58, తాండూరు డిపోలో 65, పరిగి డిపోలో 63 బస్సులు ఇలా మొత్తం 186 బస్సులు సర్వీసులను అందించాయి. మహబూబ్‌నగర్ డిపో నుంచి 75 ఆర్టీసీ, 35 హైర్ బస్సులు నడిచాయి. జిల్లాలో బస్సుల ద్వారా 17 వేల మందికిపైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నారాయణపేట జిల్లాలో 44 ఆర్టీసీ బస్సులు, 33 హైర్ బస్సులు, వనపర్తి డిపో పరిధిలో 82 బస్సులు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 146 బస్సులు తిరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని డిపోలో 102 బస్సులకుగాను 101 బస్సులు నడిచాయి.
RTC-Bus3

1937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles