కృష్ణాలో వరద తగ్గుముఖం

Mon,September 16, 2019 02:29 AM

-ఆల్మట్టికి 30 వేల క్యూసెక్కులు.. నారాయణపురకు 15 వేలు
-జూరాలకు స్థిరంగా వరద.. శ్రీశైలం మూడుగేట్లు ఎత్తివేత
-సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లద్వారా నీటి విడుదల
-పులిచింతలకు లక్ష క్యూసెక్కుల ప్రవాహం

హైదరాబాద్/జోగుళాంబ గద్వాల ప్రతినిధి/నాగర్‌కర్నూల్ ప్రతినిధి/నందికొండ/మెండోరా/కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్‌లో ఆదివారం నాటికి ఇన్‌ఫ్లోలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఎగువన ఆల్మట్టికి కేవలం 30 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఇది మరింత తగ్గనున్నదని కేంద్ర జల సంఘం ముందస్తు సమాచారం ఇచ్చింది. నారాయణపుర జలాశయానికి కూడా వరద 15 వేల క్యూసెక్కులకే పరిమితమైంది. అయితే ఉజ్జయిని నుంచి మాత్రం వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఆదివారం సాయంత్రానికి 66 వేల క్యూసెక్కులకుపైగా అవుట్‌ఫ్లో నమోదైంది. ఈ క్రమంలో జూరాల జలాశయానికి ఇన్‌ఫ్లో 1.18 లక్షల క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 1.39 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. వరద స్థిరంగా కొనసాగుతుండటంతో జూరాలలోని 10 గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 96,075 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో రెండు మోటర్లను ప్రారంభించి 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి వరద కొనసాగుతున్నది.

అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి వరద నీటిని దిగువన ఉన్న తుంగభద్ర జలాశయానికి విడుదల చేస్తున్నారు. అప్పర్ తుంగ నుంచి 13,564 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. ఆదివారం తుంగభద్ర జలాశయానికి 22,811 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 18,134 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి 1.49 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నప్పటికీ సోమవారం ఇది మరింత తగ్గే అవకాశమున్నది. శ్రీశైలం మూడు గేట్ల ద్వారా సాగర్‌కు నీరు విడుదలచేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. ఆదివారం ఉదయం రెండు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా ప్రాజెక్టు ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 1,11,260 క్యూసెక్కులకు తగ్గడంతో రెండుగేట్లను మూసివేసి నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వస్తుండగా అంతేమేర దిగువకు వదులుతున్నారు. ఏపీలోని ప్రకాశం బరాజ్ వద్ద ఇన్, అవుట్‌ఫ్లో ఆదివారం ఉదయం రెండు లక్షల క్యూసెక్కులకుపైగా ఉన్నప్పటికీ క్రమంగా అది తగ్గుముఖం పడుతున్నది.

krishna-basin2

ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి 4,920 క్యూసెక్కులు

గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌కు వరద తగ్గింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి 10,401 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి 4,920 క్యూసెక్కులకు చేరింది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అవుట్‌ఫ్లో 3,900 క్యూసెక్కులు ఉండగా.. లోయర్ మానేరుకు ఇన్‌ఫ్లో 3,146 క్యూసెక్కులుగా ఉన్నది. కడెం ప్రాజెక్టుకు 847 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 4,139 క్యూసెక్కుల వరద వస్తున్నది.

భద్రాచలం వద్ద 33.1 అడుగులు

గోదావరి నది భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం 32.1 అడుగులు ఉన్న ప్రవాహం సాయంత్రం నాలుగు గంటలకు 33.1 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్నది.

తాలిపేరు రెండుగేట్ల ద్వారా నీరు విడుదల

కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఆదివారం వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 5,924 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తున్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా 406 అడుగుల వద్ద ప్రస్తుత నీటిమట్టం ఉన్నది.
projects

907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles