మద్దతు ధర కోసం రూ.7వేల కోట్లు

Fri,October 18, 2019 03:03 AM

-ధాన్యానికి రూ.1,835, పత్తికి రూ.5,550 మద్దతు ధర
-రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం
-పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించండి
-ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడి

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ: రైతులు పండించిన పంటకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ రూ.7వేల కోట్లు కేటాయించారని, ప్రభుత్వం ధాన్యానికి రూ. 1,835, పత్తికి రూ.5,550 మద్దతు ధర అందించనున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. రైతులు పంటలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. గురువారం సిద్దిపేట, గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఈసారి రికార్డుస్థాయిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నదని వెల్లడించారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, సుమారు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నదని, ఇందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. గతంలో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని చెప్పారు. జిల్లాలో ఈ సీజన్‌లో రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి మార్కెట్‌కు వస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని తెలిపారు. యాసంగికి సబ్సిడీపై ధాన్యం, శనగ, పొద్దుతిరుగుడు, మక్కజొన్న, వేరుశనగ విత్తనాలను అందుబాటులో ఉంచామని, అన్ని రకాల ఎరువులను ముందుగానే దుకాణాల్లో నిల్వ ఉంచినట్టు వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై కశ్మీర్‌, హర్యానా, పంజా బ్‌ ప్రతినిధులు పరిశీలించి తమ రాష్ర్టాల్లో అమలుచేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఇమామ్‌, మౌజమ్‌ల గురించి సీఎం కేసీఆర్‌ తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదని గుర్తుచేశారు. గజ్వేల్‌లో రూ.కోటి వ్యయంతో ముస్లిం షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నామని, రూ.2కోట్లతో షాదీఖానా నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ భూపతిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, నాయకులు వంగ నాగిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles