ఎస్టీ యువత ఎదగాలి

Fri,November 8, 2019 02:59 AM

-ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
-తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు
-రాయితీల కోసం పరిశ్రమలుపెడితే సక్సెస్ కాలేరు
-పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
-సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం రెండోబ్యాచ్ ప్రారంభం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యోగాలు అడిగే దశనుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. తెలివితేటలు, సామర్థ్యం, వ్యాపారంలో రాణించడం ఏ ఒక్కరి సొత్తు కాదని.. ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో రాణించగలుగుతారని చెప్పారు. మధ్య, చిన్నతరహా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గచ్చిబౌలి ఐఎస్బీలో గురువారం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం రెండో బ్యాచ్‌ను మంత్రి కేటీఆర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తిచేసుకొన్న మొదటిబ్యాచ్‌లోని 17 మందికి రుణ మంజూరు పత్రాలను మంత్రులు అందజేశారు.

ప్రభుత్వం ఇచ్చే రాయితీలకోసం కంపెనీలు, సంస్థలను పెట్టేవారు ఎప్పటికీ విజయవంతం కాలేరని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఇంత పెద్దవేదికపై ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అభినందించారు. అభిరుచి, మక్కువ, ఆసక్తి ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. వ్యాపారమైనా, వాణిజ్యమైనా, రాజకీయమైనా.. ఏది చేసినా తమ అభిరుచికి, ఆసక్తికి అనుగుణంగా పనిచేస్తే తప్పకుండా విజ యం సాధిస్తారని తెలిపారు. ఇందుకు గొప్ప ఉదాహరణ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు తెలంగాణ వస్తుందని 99 శాతం మంది నమ్మలేదని, కానీ 14 ఏండ్లలో భారత రాజకీయ వ్యవస్థను, పార్లమెంట్‌ను ఒప్పించి అసాధ్యమనుకున్న తెలంగాణను సాధ్యంచేశారని గుర్తుచేశారు. చేసే పనిని మనస్ఫూర్తిగా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. నేను ఉద్యోగంకోసం ఇంకొకరిని యాచించను. శాసిస్తాను అని అనుకొంటే తప్పకుండా గెలుస్తారని పేర్కొన్నారు. మన చదువుకు, మనంచేసే పనికి చాలాసార్లు పొం తన ఉండదని, తాను బయోటెక్నాలజీలో పీజీ చేశానని, ఎంబీఏ చేశానని.. కానీ తాను చేస్తున్న పని వేరని తెలిపారు. చదువు విషయ పరిజ్ఞానాన్ని, మెళకువలను, తెలివితేటల్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందన్నారు.

ఆత్మన్యూనత పనికిరాదు

ఆత్మన్యూనతాభావంతో ఉంటే జీవితంలో ముందుకు పోలేమని మంత్రి కేటీఆర్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు హితవుచెప్పారు. గతాన్ని తలుచుకుంటూ ఉంటే భవిష్యత్తు వైపు చూడలేమని, వర్తమానంలో పనిచేయలేమని పేర్కొన్నారు. దళితులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దడానికి వందమందికి శిక్షణ.. వందకోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చినట్లు చెప్పా రు. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మధ్య, చిన్నతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ద్వారానే లభిస్తాయని తెలిపారు. భారీ పరిశ్రమల ద్వారా చిన్న పరిశ్రమలకు అవకాశాలు దక్కుతాయని చెప్పారు. ఈ కార్యక్రమం తనకు ఆత్మసంతృప్తినిచ్చిందని, పెద్ద పెద్ద వాళ్లను కలిసినప్పుడు కూడా ఇలాంటి తృప్తి కలుగలేదని పేర్కొన్నారు. ఈ పథకంద్వారా శిక్షణ పొందిన ప్రతిఒక్కరి వ్యాపారాన్ని ప్రారంభించడానికి తాను గానీ, ఇతర ప్రముఖులు గానీ తప్పకుండా హాజరవుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

పెద్దఎత్తున రాయితీలు

పరిశ్రమలశాఖలో పెద్దఎత్తున రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పా రు. పారిశ్రామిక పార్కుల్లో భూముల కేటాయింపునకు సంబంధించి రిజర్వేషన్లు పాటిస్తున్నామని, అందులో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్ ఉన్నదని తెలిపారు. ఈ పథకం ద్వారా వ్యాపారంచేస్తున్నవారు.. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా పారిశ్రామికపార్కుల్లో ప్రాధాన్యం ఉం టుందని తెలిపారు. మహిళల కోసం మూడు ప్రత్యేక పార్కులను ఏర్పాటుచేశామన్నారు. ఎలాంటి తాకట్టు అవసరంలేకుండానే బ్యాంకులద్వారా రుణం ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. ఖాయిలాపడే దశలో ఉన్న ఎమ్మెస్‌ఎంఈలను గుర్తించి వాటి పునరుద్ధరణ జరిగేలా చూడటానికి పారిశ్రామిక హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. రుణాలు చెల్లించని సందర్భాల్లో వేలం వేయడానికి ఉద్దేశించిన సర్‌ఫెసీ చట్టం చాలా క్రూరమైన చట్టంగా మంత్రి అభివర్ణించారు. ఈ చట్టంద్వారా ఎమ్మెస్‌ఎంఈ పరిశ్రమలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వాటిని కాపాడాల్సిన అవసరం ఎం తైనా ఉన్నదని, సీఎం కేసీఆర్ ఆర్బీఐని చాలాసార్లు కోరారని తెలిపారు. వ్యాపారమనేది హాకీస్టిక్‌లాంటిదని, కష్టాలు.. నష్టాలు వచ్చినప్పడు ఆందోళనచెందాల్సిన అవసరం లేదని, ప్రభు త్వం అండగా ఉంటుందని హామీఇచ్చారు. పరిశ్రమల్లో అమ్మాయిల సంఖ్య పెరుగాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఒక అబ్బాయికి ఉద్యోగం వస్తే ఆయన బాగుపడతాడు కానీ, అమ్మాయికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబమే బాగుపడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
KTR1

గిరిజన యువతకు మంచి అవకాశాలు: మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజనులను అన్నిరకాలుగా అభివృద్ధిచేయాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారని గిరిజన, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా రు. గిరిజనులు ఉద్యోగాలు చేయడమే కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగాలన్నదే ము ఖ్యమంత్రి సంకల్పమని పేర్కొన్నారు. మారుమూల తండాల నుంచి ఐఎస్బీ వరకు రావ డం వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుందన్నారు. మారుమూల తండా నుంచి వచ్చిన తనకు మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని చెప్పారు. తన చిన్నతనం లో మూడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకున్నామని తెలిపారు. మన రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావడం అదృష్టమని తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, గిరిజనశాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తు, ఐఎస్‌బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ, ఎస్బీఐ డీజీఎం దేబాశిష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

1532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles