ఇది అమానుషం

Mon,December 2, 2019 03:14 AM

-జస్టిస్ ఫర్ దిశ కేసు సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు..
-అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
-కాలంచెల్లిన చట్టాలను మార్చాలి..
-ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
-అప్రమత్తమైన జైలు అధికారులు
-వెటర్నరీ డాక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ
-బాధితురాలి పేరును ఎక్కడా వాడొద్దు
-జస్టిస్ ఫర్ దిశగా సంబోధించాలి: సీపీ సజ్జనార్

హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ, శంషాబాద్: శంషాబాద్ ఘటన అమానుషమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెటర్నరీ వైద్యురాలిపై జరిగిన ఘాతుకంపై స్పందించారు. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని, సామూహిక లైంగికదాడికి పాల్పడి సజీవదహనం చేయడం దారుణమైన, అమానుషమైన దుర్ఘటన అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. జస్టిస్ ఫర్ దిశ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేయాలని సూచించారు. ఇటీవల వరంగల్‌లో మైనర్ బాలిక హత్యకేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం కేసీఆర్.. ఇదేతరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు.
justiceforPriyankareddy1
బాధితురాలి కుటుంబానికి అవసరమైన అన్నిరకాల సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. మహిళలు అంతా మనఇంటి ఆడబిడ్డలేనని, మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వేయవద్దని అధికారులను ఆదేశించారు. మహిళా ఉద్యోగుల డ్యూటీలు రాత్రి 7.30- 8గంటల వరకే ముగించేలా చూడాలని స్పష్టంచేశారు. అధికారులు ప్రతి మహిళను తమ ఇంటి ఆడపడుచుగా చూడాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జస్టిస్ ఫర్ దిశ కేసు సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్టు న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు కిరాతకుల చేతిలో దారుణంగా హత్యకు గురైన బాధితురాలి పేరును ఎక్కడా వాడొద్దని.. జస్టిస్ ఫర్ దిశగా సంబోధించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టంచేశారు.

లైంగికదాడికి పాల్పడితే ఉరిశిక్ష విధించాలి

మహిళలపై లైంగికదాడుల ఘటనలు జరుగకుండా కఠినచట్టాలు తీసుకొచ్చేలా పార్లమెంట్‌లో చర్చించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు. దేశంలో జరుగుతున్న లైంగికదాడుల కేసుల్లో నిందితులు పట్టుబడినప్పటికీ, వారికి వేసిన శిక్షల అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని.. ఏడేండ్ల కింద జరిగిన నిర్భయ ఘటనలో నిందితులకు ఇప్పటికీ ఉరిశిక్ష అమలుకాలేదని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో జస్టిస్ ఫర్ దిశ ఘటనలోనూ నిందితులను పోలీసులు వెంటనే పట్టుకున్నారని.. అయితే తమ బిడ్డను కోల్పోయిన తర్వాత దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ఏవిధంగా సాంత్వన చేకూర్చాలో అర్థం కావడం లేదన్నారు. న్యాయం ఆలస్యమైతే.. అన్యాయం జరిగినట్టే అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి క్రూరమైన ఉదంతాల్లో అమలుచేయాల్సిన చట్టాలపై, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చర్చచేపట్టాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తిచేశారు. అత్యంత హీనమైన నేరాలకు పాల్పడిన నీచులకు కఠినశిక్ష విధించాల్సిన అవసరం ఉన్నదన్నారు. మహిళలు, పిల్లలపైన అఘాయిత్యానికి పాల్పడేవారికి ఎలాంటి ఆలస్యం లేకుండా ఉరిశిక్ష విధించాలని సూచించారు.
Rape-victims

హైసెక్యూరిటీ బ్యారక్‌లోకి ఆ నలుగురు

జస్టిస్ ఫర్ దిశ నిందితులను చర్లపల్లి జైలులో ఖైదీలు అసహ్యించుకుంటున్నట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు నిందితులను హై సెక్యూరిటీ బ్యారక్‌లోకి మార్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నలుగురినీ ఒకేచోట కాకుండా ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో ఉంచారు. గదుల నుంచి బయటకు వస్తే ఖైదీలనుంచి సమస్యలు వస్తాయనే అనుమానంతో వారి గదులలోకే భోజనం అందిస్తున్నారు. ఆ నలుగురు చేసిన పైశాచిక అఘాత్యంపై జైలులో ఖైదీలు ఆగ్రహంగా ఉన్నారని అధికారులు ధ్రువీకరించకపోయినా.. నిందితులను హై సెక్యూరిటీ బ్యారెక్‌లో పెట్టామని స్పష్టంచేశారు.

ఘటనా స్థలాలను పరిశీలించిన డీజీపీ

జస్టిస్ ఫర్ దిశ కుటుంబాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట సీపీ సజ్జనార్, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. బాధితురాలి కుటుంబానికి డీజీపీ ధైర్యం చెప్పారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి వద్ద హత్య జరిగిన ప్రదేశంతోపాటు, మృతదేహాన్ని దహనం చేసిన షాద్‌నగర్ పరిధిలోని చటాన్‌పల్లి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.

దండనీతి లోపంతో దోషాలు పెరుగుతాయి

-త్రిదండి చినజీయర్‌స్వామి
chinnajeeyarswamy
తప్పుచేసిన వ్యక్తికి పాలకులు తగిన దండన విధించకపోతే.. అలాంటి తప్పును మరో పదిమంది చేసేలా ప్రోత్సహించినట్టవుతుందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఆదివారం మైహోం అవతార్ ప్రాజెక్టులో జరిగిన భూవరాహస్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సమాజంలో దండనీతిలో లోపం ఏర్పడితే దోషాలు పెరుగుతాయని చెప్పారు. మనదేశంలో దోషంచేసిన వ్యక్తి దొరికినా దండించే వ్యక్తి దురదృష్టవశాత్తు తగినవిధంగా శిక్షించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. వ్యక్తిని హింసించడమే కాకుండా.. దారుణమైన మారణకాండకు గురిచేసే స్థితి నెలకొన్నదని అన్నారు. అరబ్ దేశాల్లో చిన్న దొంగతనమైతే నలుగురిలో వేళ్లు తీసేస్తారు.. అంతకంటే మించిన దోషంచేస్తే నడిరోడ్డులో ఉరితీస్తారు. తప్పుచేసిన వ్యక్తిని జైలులో పెట్టడం, పది పదిహేనురోజులు రిమాండ్ విధించడం కరెక్టు కాదు. అలాంటివారికి తగిన దండన విధించి తీరాలి. అదీ ఎక్కడో సీక్రెట్‌గా కాకుండా.. పదిమంది చూసేట్టుగా, పదిమందికి తెలిసేట్టుగా చేయాలి. ఇంకెవరైనా అలాంటి ఆలోచన చేయాలన్నా.. ఖబడ్దార్ అనే వార్నింగ్ ఇవ్వగలిగినట్టుగా దండన ఉన్నప్పుడే ఇలాంటివి తగ్గుతాయి అని పేర్కొన్నారు.

ఖబర్దార్..అన్నట్టుగా దండన ఉండాలి

దారుణమైన మారణకాండకు పాల్పడేవారికి తగిన దండన విధించి తీరాలి. పదిమంది చూసేట్టుగా, పదిమందికి తెలిసేట్టుగా చేయాలి. ఇంకెవరైనా అలాంటి ఆలోచన చేయాలన్నా.. ఖబడ్దార్ అనే వార్నింగ్ ఇవ్వగలిగినట్టుగా దండన ఉండాలి.
- త్రిదండి చినజీయర్‌స్వామి

బాధితురాలి పేరును వెంటనే తొలగించాలి

కిరాతకుల చేతిలో హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలు పేరు ఎక్కడ వాడొద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టంచేశారు. సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇకనుంచి బాధితురాలి పేరు కానీ, వారి కుటుంబసభ్యుల పేర్లు కానీ ప్రచారం చేయొద్దని సూచించారు. బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడిన పోలీసులు ఇకనుంచి పేరును జస్టిస్ ఫర్ దిశగా సంబోధించాలని కోరారు. బాధితురాలు, కుటుంబసభ్యుల పేర్లను నేరుగా వాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పా రు. సోషల్ మీడియా, ఇతరవాటిల్లో ఎక్కడైనా బాధితురాలి పేరుఉంటే వాటిని తొలగించాలని సూచించారు. తమ కూతురుతోపాటు, కుటుంబసభ్యుల పేర్లను సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో నిరంతరం వాడుతుండట తమను మానసిక వేదనకు గురిచేస్తున్నదంటూ బాధిత కుటుంబం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితురాలు, వారి కుటుంబసభ్యుల పేర్లను వాడొద్దనే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

2105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles