‘దశ-దిశ’ అద్వితీయం

Mon,October 21, 2019 02:55 AM

-రెండు ప్రాంతాల ప్రజలను ఏకంచేసిన కార్యక్రమం
-తెలుగు ప్రజల దశ-దిశ గ్రంథావిష్కరణ సభలో సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రముఖ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో హెచ్‌ఎంటీవీ నిర్వహించిన చరిత్రాత్మక చర్చా కార్యక్రమం తెలుగు ప్రజల దశ-దిశ అపూర్వం.. అద్వితీయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. రామచంద్రమూర్తి రచించిన తెలుగు ప్రజల దశ-దిశ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది. ఈ గ్రంథాన్ని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఒక భావోద్వేగమైన అంశంపై టెలివిజన్ కేంద్రాన్ని ప్రజలమధ్యకు తీసుకెళ్లి సమావేశపర్చడం మామూలు విషయం కాదని అన్నారు.

పోలీసులు, లాఠీలు, తుపాకులు అన్నీ కూడా శాంతిని నెలకొల్పలేని సందర్భంలో ఒక ప్రాంత అతిథులను మరో ప్రాంతానికి తీసుకెళ్లి చర్చాకార్యక్రమాన్ని నిర్వహించడం రామచంద్రమూర్తికి మాత్రమే సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం, వృత్తి పట్ల నిబద్ధత లేకపోతే అలాంటి సమావేశాలను ఆ పరిస్థితుల్లో అదుపుచేయడం సాధ్యం కాదని, సమాజం విడిపోతున్న సందర్భంలో చర్చల ద్వారా ప్రజలను ఒకచోట చేర్చడం సాధ్యమేనని నిరూపించింది దశ-దిశ కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా నేడు పత్రికలు, మీడియా ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని తెలిపారు. పాలకులను ప్రశ్నించాలి.. పాలకులు పౌరులకు విధేయంగా ఉండాలి.. సంభాషణల ద్వారా భావజాలాన్ని వ్యాప్తిచేయాలి. అప్పుడే ప్రజలు ఏం కోరుకొంటున్నారో తెలుస్తుందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు.

జర్నలిజం అంటే వ్యాపారం కాదు: హరీశ్

జర్నలిజం అంటే వ్యాపారం, ప్రచురణ, ప్రసారం మాత్రమే కాదని.. ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావడమని తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాను స్టూడియోనుంచి ప్రజల మద్యకు తీసుకొచ్చి చర్చలు జరిపించారని, ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న రోజుల్లో దశ-దిశ నిర్వహించడం ద్వారా ప్రజల భావజాలం ఏమిటన్నది తెలిసిందని, తెలంగాణ ఉద్యమానికి దశ-దిశ ఒక చెరిగిపోని గ్రంథమని పేర్కొన్నారు. రామచంద్రమూర్తి మంచి అనుభవమున్న సంపాదకులని మంత్రి హరీశ్ అన్నారు. రాష్ర్టాలు వేరుపడ్డప్పటికీ, మనమంతా తెలుగుజాతి బిడ్డలమని, అంతా మన మంచికే జరిగిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జరుగబోయేదానిని మనం, మన పాలకులు గుర్తెరిగి కలిసి ముందుకెళ్లాలన్నారు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కలిసి పనిచేసుకొంటున్నారని, మనలో మనకు మనస్పర్థలు ఉండకూడదని బొత్స అభిప్రాయపడ్డారు.

అనంతరం బుద్ధవనం స్పెషలాఫీసర్ మల్ల్లెపల్లి లక్ష్మయ్య, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గ్రంథకర్త రామచంద్రమూర్తి, చుక్కా రామయ్య, ఎస్ వెంకటనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, హెచ్‌ఎంటీవీ సీఈవో శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, తెలంగాణ సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, ప్రముఖ పాత్రికేయులు వల్లీశ్వర్, తెలకపల్లి రవి, విరాహత్ అలీ, ప్రముఖ ప్రచురణకర్త ఎమెస్కో విజయ్‌కుమార్, సీనియర్ నాయకులు చెన్నమనేని రాజేశ్వర్‌రావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles