తెలంగాణ సంస్కృతికి పట్టం

Mon,October 21, 2019 03:10 AM

-తెలంగాణ కళలను అద్భుతంగా తెరకెక్కించారు
-తుపాకిరాముడు ప్రీరిలీజ్ వేడుకలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
-25న విడుదల కానున్న సినిమా

సినిమా డెస్క్: తెలంగాణ పల్లెలు, కళలు, సంప్రదాయాలను, బతుకమ్మ పండుగను అద్భుతంగా చూపించిన సందేశాత్మక చిత్రం తుపాకిరాముడు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. బిత్తిరి సత్తి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రసమయి ఫిల్మ్స్ పతాకంపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. టీ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదలకానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై పాటలను, ట్రైలర్‌ను విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాత, దర్శకుడు, నటీనటులంతా తెలంగాణవారే ఉన్న ఈ చక్కటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని, వందరోజులు ఆడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తీసిన సినిమా తర్వాత రసమయి బాలకిషన్ తుపాకిరాముడుతో ముందుకొచ్చారని, ఈ సినిమాతో ఆయన సాహసోపేత ప్రయత్నం చేశారని అన్నారు.

యావత్ తెలుగు ప్రజలకు బిత్తిరి సత్తిగా చిరపరిచితుడైన చేవెళ్ల రవి ఈ సినిమాతో మరింత పేరుతెచ్చుకోవాలని, అద్భుతమైన నటుడిగా ఎదగాలని కోరుకుంటున్నానని మంత్రి హరీశ్ తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రసమయి బాలకిషన్ చక్కటి సృజనాత్మకత కలిగిన కళాకారుడన్నారు. ఈ సినిమా విజయవంతమై ఆయనకు మంచిపేరు రావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తీసిన అనేక సినిమాల్ని అక్కున చేర్చుకున్నట్లుగానే తుపాకిరాముడును ప్రేక్షకులు ఆదరించాలన్నారు.

కళలపట్ల మక్కువతో తీసిన సినిమా: మంత్రి తలసాని

సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కళలపట్ల ఉన్న మక్కువతో రసమయి బాలకిషన్ ఎన్నో కష్టాలకోర్చి ఈ సినిమా తీశారని చెప్పారు. తెలుగు చిత్రసీమలో పెద్దదిక్కుగా నిలిచిన దిల్‌రాజు ఈ సినిమా విడుదలకు ముందుకురావడమే కాకుండా థియేటర్లను కూడా కేటాయించడం సంతోషకరమన్నారు. పైసావసూల్ ఆలోచనతో కాకుండా సామాజిక బాధ్యతను చాటుకుంటూ రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కొనియాడారు. చిత్ర నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఈ సినిమా రూపకల్పనలో ఎన్ శంకర్ తనకు ప్రేరణనిచ్చారని, ఆయన రూపొందించిన శ్రీరాములయ్య లాంటి గొప్ప సినిమా తీయాలన్న తన కల తుపాకిరాముడుతో నెరవేరిందని తెలిపారు. ఎమ్మెల్యేగా తీరికలేకుండా ఉండే నీవు ఈ సినిమా తీయగలవా? అని చాలామంది తనను ప్రశ్నించారని, నియోజకవర్గ ప్రజల అభిమానంతో ఈ సినిమా చేయగలిగానని చెప్పారు. ఎదుటివాడి సంతోషాన్ని కోరుకునే తుపాకిరాముడి కథే ఇదని, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా తీసిన ఈ చిత్రాన్ని భుజాన వేసుకొని విడుదలచేస్తున్న దిల్‌రాజు తనకెంతో బలాన్నిచ్చారని పేర్కొన్నారు.

సినిమా ప్రోమో అద్భుతం: దర్శకుడు ఎన్ శంకర్

దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆలోచన, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరాయన్న విషయాన్ని ఈ సినిమా ప్రోమోల్లో అద్భుతంగా చూపించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో మంది స్థానిక కళాకారులు చిత్రసీమలో అగ్రస్థానానికి చేరుకున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుగు సినిమా ఎదుగుతున్నదని దిల్‌రాజు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు టీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇది తెలంగాణ సంస్కృతిపై తీసిన సినిమా అన్నారు. ఈ సినిమాతో రసమయి బాలకిషన్ తనను హీరోను చేశారని బిత్తిరి సత్తి చెప్పారు. 2003లో తాను దిల్ సినిమా ఆడిషన్‌కు హాజరయ్యానని, ఇప్పుడు తాను నటించిన సినిమాను దిల్‌రాజు విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నానని బిత్తిరిసత్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలె యాదయ్య, తుపాకిరాముడు యూని ట్ సభ్యులు పాల్గొన్నారు.

452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles