వృథాతోనే ఆహారం కొరత

Fri,October 18, 2019 03:04 AM

-మన దేశంలో 40 శాతం ఆహారం వృథా
-ఆహార వృథాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
-హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మనిషి మనుగడ సాగించేందుకు కావాల్సిన గాలి, నీరు, ఆహారం.. ఒకప్పుడు స్వేచ్ఛగా లభించినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గాలి, నీరు కొంతవరకు అందరికీ అందుబాటులో ఉన్నా.. ఆహారం కోసం చాలా మంది అలమటిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఆకలి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నదని తాజాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ) నివేదిక వెల్లడించింది. ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 117 దేశాల జాబితాలో భారత్ 102వ స్థానంలో ఉన్నదని పేర్కొన్నది. మన దేశంలో ఈ పరిస్థితి దాపురించడానికి ఆహార పదార్థాలను వృథాచేయడమే అసలు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆహారం వృథాను అరికట్టడంలో ప్రతీఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరమున్నదని సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారత్‌లో 40 శాతం వరకు ఆహారం వృథా అవుతున్నది. ఇలా వృథా అవుతున్న ఆహారాన్ని డబ్బు రూపంలో మార్చితే.. దాదాపు రూ.50 వేల కోట్లకు చేరుతుందని అంచనా. మన దేశంలో 25 శాతం జనాభా ఆకలితో అలమటిస్తున్నదని, సుమారు 19 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇటీవలి ఒక సంస్థ సర్వేలో వెల్లడైంది. పంటలు వ్యవసాయక్షేత్రాల నుంచి రిటైల్ దుకాణాలకు చేరే లోపే 14 శాతం వృథా అవుతున్నదని తేలింది. ఆహార పదార్థాలను నిలువ చేయడం, రవాణా చేయడం వంటి వివిధస్థాయిల్లో కూడా వృథా జరుగుతున్నదని స్పష్టమవుతున్నది.

హైదరాబాద్ పరిధిలో రిఫ్రిజిరేటర్ల ఏర్పాటు

ఆహారం వృథా కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరువ తీసుకొంటున్నది. ఆపన్నులకు ఆహారం అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. మిగులు ఆహారాన్ని నిల్వ చేసేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎనిమిది ప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్లను ఏర్పాటుచేసింది. ఇంటిలో మిగిలే ఆహారాన్ని ఈ పద్ధతి ద్వారా అవసరమైనవారికి అందించే వీలున్నది. దీనితో ప్రజల్లో ఆహారం వృథా చేయకూడదనే అవగాహన కలుగడంతోపాటు, రిఫ్రిజిరేటర్లలో వదిలే ఆహారాన్ని ఆకలితో అలమటించే వారికి అందించేందుకు వీలు కలుగుతుంది. వివాహాలు, ఇతర శుభకార్యాల్లో పెద్ద మొత్తంలో మిగిలిపోయే ఆహారాన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఎంత తినగలరో అంతే వడ్డించుకోవాలి అనే అవగాహన కల్పించడం ద్వారా ఆహారాలు వృథా కాకుండా చూడవచ్చు. ఇంటిలోగానీ, ఫంక్షన్లల్లోగానీ మిగిలిపోయిన ఆహార పదార్థాలను పారబోయకుండా అన్నార్తులకు అండగా నిలిచే సమాజసేవకులకు సమాచారం అందించడం ద్వారా కొంతమంది కడుపులైనా నింపినవారం అవుతాం.

1018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles