మాజీ సైనికుడి భూమి మాయం!


Wed,August 14, 2019 01:47 AM

Former soldier Suffering Revenue Officer Negated The Land Registration

-ప్రభుత్వం కేటాయించిన మూడెకరాలు ఆక్రమణ
-ఫిర్యాదుచేసినా పట్టించుకోని అధికారులు
-నాలుగేండ్లుగా తిప్పించుకొంటున్న రెవెన్యూ సిబ్బంది
-ధర్మగంటను ఆశ్రయించిన కామారెడ్డి జిల్లా బాధితుడు

దేశం కోసం 17 ఏండ్లపాటు సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడి భూమి మాయమైపోయింది. ప్రభుత్వం కేటాయించిన భూమికి హద్దులు లేకుండాపోయాయి. స్థానికంగా లేకపోవడమే ఆయన పాలిట శాపమైంది. పక్కనున్న రైతు హద్దురాళ్లు తీసేసి భూమిని ఆక్రమించుకొన్నారు. మోఖామీదకు పోతే.. అక్రమార్కులు వెళ్లగొడుతున్నారు. హద్దులు చూపించాలని రెవెన్యూ అధికారుల దగ్గరకు వెళ్తే పెడచెవిన పెడుతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జాన్ అనే వ్యక్తి తనకు న్యాయం
జరిగేలా చూడాలని ధర్మగంటను ఆశ్రయించారు.


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్న ఎస్ జాన్ 17 ఏండ్లపాటు భారత సైన్యంలో పనిచేశారు. సైనికుల కోటా కింద 2004లో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం రాజుల్లాలో సర్వే నంబర్ 191/2లో మూడెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం కూడా రెవెన్యూ అధికారులు మంజూరుచేశారు. పహాణీలోనూ జాన్ పేరే నమోదైంది. ఈ మూడెకరాల భూమిని జాన్ నాలుగేండ్లపాటు సాగు కూడా చేసుకొన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న జాన్‌కు కామారెడ్డిలోని భూమిని సాగుచేయడం వీలుకాలేదు. దీన్ని అదునుగా భావించిన పక్కనున్న రైతు.. జాన్ భూమిని ఆక్రమించారు. హద్దురాళ్లు తీసేసి ఆనుపానులు లేకుండా చేశారు. 2015లో తన భూమిలో మళ్లీ సాగు చేసుకొందామని వెళ్లిన జాన్.. భూమి లేకుండాపోయేసరికి విస్తుపోయారు.

భూమిని ఆక్రమించిన వాళ్లు జాన్‌ను మోఖామీదకు రానివ్వలేదు. తన సమస్యను పరిష్కరించాలని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ జాన్ ఫిర్యాదుచేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, తాసిల్దార్ తదితర అధికారులందరినీ కలిసి వేడుకొన్నారు. ఏ ఒక్కరూ ఆయన సమస్యకు పరిష్కారం చూపలేదు. రెవెన్యూ సిబ్బంది రేపు మాపు అంటూ తిప్పుకొంటున్నారే తప్ప సమస్యను ఒక కొలిక్కి తేవడంలేదు. చివరకు భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనూ సమస్య పరిష్కారం కాలే దు. బాధితుడికి కొత్త పాస్‌పుస్తకం కూడా ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రైతుబంధు కూడా జాన్ కోల్పోయారు.

ఆధారాలుంటే న్యాయంచేస్తాం

పొజిషన్‌లో ఉండటం అనేది చాలా ముఖ్యం. సమస్యపై మరోసారి నాకు దరఖాస్తు చేస్తే సర్వేచేస్తాం. మోఖాపై ఎవరున్నారో? పట్టాదారు ఎవరో తేలుస్తాం. ఎస్ జాన్ దగ్గర అన్ని ఆధారాలుంటే తప్పకుండా న్యాయంచేస్తాం.
- సమ్మయ్య, బిచ్కుంద తాసిల్దార్

రక్షణ లేకుండాపోయింది


ఎస్ జాన్, బాధితుడు

ప్రభుత్వం కేటాయించిన భూమికి కూడా రక్షణ లేకుండాపోయింది. ఈ భూమి సమస్య కారణంగా పదవీవిరమణ పొం ది కాలక్షేపం చేయాల్సిన సమయంలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి దాపురించింది. మాజీ సైనికుడని కూడా చూస్త లేరు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నా భూసమస్యను పరిష్కరించి న్యాయం చేయాలి. కొత్త పాస్‌పుస్తకం ఇచ్చి రైతుబంధు సాయం అందేలా చూడాలని ఉన్నతాధికారులను కోరుతున్నాను.
సమస్యలు పరిష్కారమవుతున్నాయి


చల్లా సురేందర్‌రెడ్డి, సోలిపేట, సూర్యాపేట జిల్లా

రెవెన్యూశాఖలో అవినీతిని అంతమొందించడానికి సీఎం కేసీఆర్ చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతోపాటు నమస్తే తెలంగాణలో ప్రచురితమవుతున్న కథనాలతో అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి భూసమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారు. గతంలో భూసమస్యలు ఉంటే రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు అయ్యేవికావు. ఇప్పుడు సమస్యలు వెంటనే పరిష్కారమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు, నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు.
ధర్మగంటతో అవినీతి అంతం


రుద్రాక్షి ముత్తయ్య, నిడమనూరు, నల్లగొండ జిల్లా

ధర్మగంటతో అవినీతి అంతమవుతున్నది. రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయడం సంతోషకరం. దశాబ్దాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఒక్కసారిగా పరిష్కారమవుతుండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. సీఎం కేసీఆర్‌లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం రైతుల పాలిట వరం.
రెవెన్యూలో మార్పు అవసరం


మెబెల్లీ, అనంతారం, రైతు, సూర్యాపేట జిల్లా

రెవెన్యూశాఖ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టడం అభినందనీయం. ధర్మగంట పేరుతో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రచురిస్తూ పరిష్కారం చూపుతున్న నమస్తే తెలంగాణ యాజమాన్యానికి రైతులు రుణపడి ఉంటారు. ఇప్పుడు ఏమైనా పనుల కోసం తాసిల్ కార్యాల యానికి పోతే రెవెన్యూ అధికారులు లంచం అడుగడానికి కొంత జంకుతున్నారు.

761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles