ఆర్టీసీ సమ్మెకు త్వరలో పరిష్కారం

Fri,October 18, 2019 03:05 AM

-సీఎం, సీఎస్‌ను కలిశాక నమ్మకం ఏర్పడింది
-చర్చల్లో భాగస్వాములమవుతాం
-ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడూ భయపెట్టలేదు
-ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ మమత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ సమ్మె త్వరలోనే పరిష్కారమవుతుందని, కార్మికులెవరూ అధైర్యపడవద్దని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ వీ మమత అన్నారు. కార్మికులు, ఉద్యోగులకు ఉద్యోగసంఘ జేఏసీ అండగా ఉన్నదని తెలిపారు. ఆర్టీసీ సమ్మెతోపాటు ఉద్యోగులకు సంబంధించిన 17 అంశాలపై ఉద్యోగ జేఏసీ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి వినతిపత్రం సమర్పించింది. సీఎస్‌తో సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించింది. అనంతరం కారం రవీందర్‌రెడ్డి, మమత మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెతోపాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలు త్వరలోనే పరిష్కారమవుతాయని తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిశామని, ఇప్పుడు సీఎస్‌ను కలిసి చర్చించాక నమ్మకం ఏర్పడిందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వరుసగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం కూడా కారణమేనని చెప్పారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక తర్వాత ఉద్యోగుల జేఏసీతో చర్చించి, సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, సీఎస్‌ కూడా అదేవిషయం చెప్పారని తెలిపారు.

ఆర్టీసీ చర్చల్లో ఉద్యోగ సంఘాల జేఏసీ భాగస్వామ్యం అవుతుందని, సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే పదం ఎక్కడా లేదని, దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల కార్యాచరణకు సంఘీభావం ప్రకటిస్తున్నామని, బంద్‌ నేపథ్యంలో భోజన విరామసమయంలో ఉద్యోగులు ప్రదర్శన తెలుపుతారని పేర్కొన్నారు. ఉద్యోగసంఘాల నేతలను ప్రభుత్వం భయపెడుతున్నదంటూ వదంతులు సృష్టిస్తున్నారని, ‘లోగుట్టూ ఏ గుట్టూ లేదని.. రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగుల గుట్టే మా లోగుట్టు’ అని తెలిపారు. సమావేశంలో జేఏసీ సెక్రటరీలు మామిళ్ల రాజేందర్‌, ఏనుగుల సత్యనారాయణ, తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్‌ వంగ రవీందర్‌రెడ్డి, టీయూటీఎఫ్‌ మల్లారెడ్డి, ఇంటర్‌విద్య జేఏసీ కృష్ణకుమార్‌, టీసీటీజీవోఅధ్యక్షుడు వెంకటయ్య, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నర్సరాజు, పలు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోండి: గవర్నర్‌

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లుచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌.. రాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మను ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ రవాణాఏర్పాట్లను గురువారం సునీల్‌శర్మ రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వివరించారు. ఆర్టీసీ సమ్మెపై రాజకీయపార్టీలు, సంస్థలు పలు ప్రతిపాదనలు తీసుకొచ్చాయని ఈ సందర్భంగా గవర్నర్‌ తెలిపారు. ప్రస్తుతం 9వేల బస్సులు నడుస్తున్నాయని, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకుండా అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. టికెట్ల జారీకి యంత్రాలను వినియోగిస్తున్నామని తెలిపారు.

హైకోర్టులో ఎండగడతాం: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

ప్రభుత్వ వైఖరిని హైకోర్టులో ఎండగడతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రజలందరూ తమ సమ్మెకు మద్దతు తెలుపాలని, మేధావులు స్పందించాలని కోరారు. గురువారం టీఎంయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

3178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles