బావిలో ఆగిన ఊపిరి

Thu,July 11, 2019 02:27 AM

-చేదబావిలోకి దిగి ముగ్గురు యువకుల మృత్యువాత
-మోటర్ మరమ్మతుకు వెళ్లి దుర్మరణం.. మృత్యుంజయులుగా మరో ముగ్గురు
-మృతుల్లో ఇద్దరిది ఆసిఫాబాద్ జిల్లా కాగా.. మరొకరిది మంచిర్యాల

కౌటాల/ కౌటాల రూరల్: మోటర్ మరమ్మతు కోసం చేదబావిలో దిగిన ముగ్గురు యువకులు ఊపిరి ఆడక మృత్యువాత పడ్డారు. ఒకరి కోసం మరొకరు వెళ్లిన ముగ్గురూ అందులోనే విగతజీవులుగా మారారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామంలో బుధవారం జరిగిన ఈ ఘటన పెనువిషాదం నింపింది. ముత్తంపేటకు చెందిన కారం మహేశ్ ఇంటి సమీపంలో 30 ఫీట్ల లోతు చేదబావి ఉన్నది. నీటిని తోడేమోటర్‌పాడవటంతో మరమ్మతు చేయడానికి మధ్యా హ్నం కారం మహేశ్ (18) బావిలోకి దిగాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో పైన ఉన్న గాదిరెడ్డి రాకేశ్(23), సొక్కల శ్రీనివాస్ (35) విద్యుత్ షాక్ తగిలిందని భావించి తీగలు తొలగించారు. ఎంతపిలిచినా మహేశ్ పలుకకపోవడంతో శ్రీనివాస్.. ఆ తర్వాత గాదిరెడ్డి రాకేశ్ కూడా అందులోకి దిగాడు.

singareni-rescue-team2
ముగ్గురిలో ఎవరూపైకి రాకపోవడంతో ఊపిరాడక మృతిచెంది ఉంటారని పైన ఉన్నవారు భావించారు. తర్వాత పంజాల పోశం తాడుసాయంతో బావిలో దిగేందుకు యత్నిం చి.. కొంతదూరం వెళ్లగానే ఊపిరాడక స్పృ హ కోల్పోవడంతో మీదికి లాగారు. డొన్నయ్య, శివయ్య కూడా బావిలో దిగేందుకు ప్రయత్నించి అస్వస్థతతకు గురయ్యారు. గ్రామ సర్పంచ్ ఆదె శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ మోహన్, ఎసై ఆంజనేయులు హుటాహుటీన అక్కడకు చేరుకొన్నారు. పోలీసులు ఓ కోడిని తీసుకువచ్చి దానిని తాడుతో కట్టి బావిలోకి దించి.. 5 నిమిషాల తర్వాత బయటకు తీయగా, నిర్జీవంగా కనిపించింది. దీంతో బావిలో ఆక్సిజన్ అందకపోవడం వల్లే యువకులు మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చారు.

పొక్లెయినర్‌తో తవ్వకాలు..

బావిలోకి వెళ్లి మృతదేహాలను తీసుకువచ్చేందుకు వీలులేకపోవడంతో జేసీబీ ద్వారా తవ్వకం చేపట్టారు. తర్వాత పొక్లెయినర్‌ను రప్పించి బావిచుట్టూ సమాంతరంగా తవ్వడం ప్రారంభించారు. 20 ఫీట్లవరకు తవ్వకం చేపట్టగా.. మిగిలిన పదిఫీట్ల లోతుకు రెస్క్యూ టీం ఆక్సిజన్ సాయంతో దిగి మృతదేహాలను వెలికితీసింది. ఆక్సిజన్ అందకనే యువకులు మృతిచెందారని సింగరేణి రెస్క్యూ బృందం తెలిపింది. ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ సహాయకచర్యలు పర్యవేక్షించారు.

మృతులు ముగ్గురూ దగ్గరి బంధువులు

మృతులు మహేశ్, సొక్కల శ్రీనివాస్, గాదిరెడ్డి రాకేశ్ దగ్గరి బంధువులు. కారం మహేశ్‌కు.. గాదిరెడ్డి రాకేశ్ మేనత్త కొడుకు. రాకేశ్ చెల్లిని సొక్కల శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. కారం రాజన్న-బుజక్క రెండో కుమారుడైన మహేశ్ కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్టియర్ చదువుతున్నాడు. గాదిరెడ్డి అంజయ్య -లస్మక్క చిన్న కొడుకు రాకేశ్ ఇంటర్ పూర్తిచేశాడు.

అత్తారింటికి వచ్చి..

సొక్కల శ్రీనివాస్‌ది మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం శిఖినం గ్రామం. ముత్తంపేటకు చెందిన శైలజను వివాహం చేసుకున్నాడు. అతడికి ఆరేండ్ల కుమారుడు, మూడేండ్ల కుమార్తె ఉన్నారు. ముత్తంపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివుకునే కుమారుడికి పుస్తకాలు కొనిచ్చేందుకు మంగళవారం భార్యతో కలిసి అత్తగారింటికి వచ్చాడు. బావమరిది కోసం బావిలోదిగి మృత్యువాత పడ్డాడు.

4486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles