ఓటీపీ చెప్పారో.. ఖాతా ఖాళీ!

Thu,July 11, 2019 02:53 AM

-ఏడాదికి రూ. 18 కోట్లు దోపిడీచేస్తున్న సైబర్ నేరగాళ్లు
-బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి వల
-మాటల్లో పెట్టి పిన్‌నంబర్లు తెలుసుకుని మోసం
-అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మోసపోతున్న పౌరులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్ నేరగాళ్లు రోజుకోరకం మోసంతో అమాయకుల ఖాతా నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తెలిసి కొందరు.. తెలియక మరికొందరు ఏదోఒక రకంగా సైబర్‌నేరగాళ్లకు మోసాలకు చిక్కి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్లుచేసి ఓటీపీ నంబర్ తెలుసుకొని.. బ్యాంకు ఖాతాలను లూటీచేస్తున్నారు. ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్), యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌పేస్) నంబర్ల ద్వారా కేవలం హైదరాబాద్ నగరంలోనే నెలకు సుమారు రూ.1.5 కోట్లు దోచుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ లెక్కన ఏడాదికి రూ.18 కోట్లు కొల్లగొడుతున్నారు. రాజస్థాన్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, హర్యానా తదితర రాష్ర్టాల్లో మారుమూల ప్రాంతాల్లో కనీసం పదో తరగతి కూడా చదవని యువకులు హిందీ, ఉర్దూలో మాట్లాడుతూ అమాయకులకు వలవేస్తున్నారు. రోజూ 200 నుంచి 300 మందికిపైగా ఫోన్లు చేస్తున్నారు. అందులో 10 నుంచి 20 మందిని తమ బుట్టలో వేసుకుంటున్నారు. ప్రతిరోజూ రూ.5 లక్షల వరకు బ్యాంకు ఖాతాల నుంచి కొట్టేస్తున్నారు. బాధితుల్లో రూ.5 వేల నుంచి లక్షల వరకు పోగొట్టుకుంటున్నవారు ఉంటున్నారు.

ఈ దొంగలు దొరుకరు..!

ఓటీపీ తీసుకుని మోసాలకు పాల్పడుతున్నవారిని పట్టుకోవడం సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్‌గా మారింది. నేరగాళ్లు ఒక్కోకాల్‌కు ఒక్కోసిమ్‌కార్డు వాడుతుండటం, డబ్బులు బదిలీచేసుకునే బ్యాం కు ఖాతాలు ఉత్తరభారతదేశం లేదా ఈశాన్య రాష్ర్టాలకు చెందినవి కావడంతో కేసు దర్యాప్తు కత్తిమీదసాములా మారుతున్నది. బ్యాంకు ఖా తాల ఆధారంగా పోలీసులు నేరస్థులను గుర్తిస్తున్నప్పటికీ ఇందులో ప్రధాన సూత్రధారులు కా కుండా, కేవలం ఖాతాదారులు మాత్రమే చిక్కుతున్నారు. తెలుగు రాష్ర్టాలకు చెందినవారు నేరాలకు పాల్పడితే వెంటనే దొరికేందుకు అవకాశాలున్నా.. ఇతర రాష్ర్టాల నుంచి అమాయకులకు వల వేస్తున్న సైబర్‌నేరగాళ్లలో ఎనభై శాతం మంది దొరకడం లేదు.

అప్రమత్తతతోనే బ్యాంకు ఖాతాలు సేఫ్

సైబర్‌నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు డెబిట్ కార్డు, సీవీవీ, పిన్, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని సూచిస్తున్నారు. అయితే కొందరు అత్యాశతో, మరికొందరు నిర్లక్ష్యంతో, ఇంకొందరు తెలియక సైబర్‌నేరగాళ్ల మోసాలకు బలవుతున్నారు. పూర్తి అప్రమత్తతతో ఉన్నవారు మాత్రమే ఇందులో నుంచి బయటపడుతున్నారు. ఆన్‌లైన్ మొబైల్ అప్లికేషన్లపై కూడా అవగాహన ఉండాలని పలువురు పేర్కొంటున్నారు. అప్రమత్తతతోనే సైబర్‌నేరగాళ్ల బారినపడకుండా ఉండవచ్చని పోలీసులు చెప్తున్నారు.

-రాజస్థాన్‌కు పార్సిల్ పంపేందుకు హరీశ్ గూగుల్ సెర్చ్‌లో పార్సిల్ సంస్థ నంబర్ కోసం వెదికాడు. ఆ నంబర్‌కు ఫోన్‌చేసి పార్శిల్ విషయంపై మాట్లాడాడు. అవతలివ్యక్తి పార్సిల్‌కు సంబంధించిన డబ్బులు ఎలా పంపిస్తావంటూ ప్రశ్నించాడు. ఆన్‌లైన్‌లో పే చేస్తానంటూ సూచించడంతో.. గూగుల్ పేయాప్ ద్వారా పంపించమంటూ మాటల్లో పెట్టి.. హరీశ్ పిన్‌నంబర్‌ను అడిగి తెలుసుకున్నాడు. దాంతో అతడి ఖాతా నుంచి రూ.50 వేలు కాజేశాడు. పొరపాటున మీ ఖాతాలో నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని, ప్రధాన కార్యాలయం నుంచి అవి వాపస్ వస్తాయంటూ నమ్మిస్తూ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను కూడా సేకరించాడు. ఇలా హరీశ్ ఖాతానుంచి రెండ్రోజుల్లోనే రూ.8.6 లక్షలు లూటీ చేశారు. ఇక్కడ అమాయకత్వం..

నిర్లక్ష్యంతోనే హరీశ్ బ్యాంకు ఖాతా ఖాళీ అయింది.

-విశ్రాంత ఉద్యోగి మహేందర్‌కు బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఖాతా అప్‌గ్రేడ్ చేయాలని.. లేదంటే బ్లాక్ అవుతుందంటూ పేర్కొన్నాడు. ఫోన్‌లో వివరాలు చెబితే అప్‌గ్రేడ్ చేస్తామంటూ నమ్మించాడు. దీంతో మహేందర్ తన డెబిట్ కార్డు నంబర్ చెప్పాడు. తరువాత ఒక్కొక్కటి అడుగుతుండగా సీవీవీ నంబర్, ఓటీపీ నంబర్ కూడా చెప్పేశాడు. ఇంతలోనే బ్యాంకు ఖాతాలో నుంచి రూ.49 వేలు మాయమయ్యాయి. ఇక్కడ విశ్రాంత ఉద్యోగికి అవగాహన లేకపోవడంతో ఖాతా నుంచి డబ్బులు పోయాయి.
-ఇమ్రాన్ ఓ వ్యాపారి. మీ డెబిట్ కార్డు విత్‌డ్రా చేసుకునే కెపాసిటీని పెంచుతున్నాం.. వివరాలు చెప్పండంటూ ఫోన్‌లో అవతలి వ్యక్తి డెబిట్ కార్డు వివరాలు తీసుకున్నారు.. మీ సెల్‌ఫోన్‌కు ఒక నంబర్ వస్తుంది.. ఆ నంబర్ చెప్పండంటూ ఓటీపీ తీసుకొన్నాడు. తర్వాత అతని ఖాతాలో నుంచి రూ.70 వేలు కాజేశాడు. విత్‌డ్రా కెపాసిటీ పెరుగుతుందనే ఆశతో వ్యాపారి మోసపోయాడు.

5839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles