పునర్జీవం పూర్తి


Wed,September 11, 2019 03:45 AM

Credit for Sri Ram Sagar Project revival goes to cm KCR

-ఎస్సారెస్పీ ముంగిట కాళేశ్వర గంగ
-200 కి.మీ. ఎదురేగి గోదావరి చెంతకు
-వరదకాల్వ రూపంలో కొత్త జలాశయం
-నిత్యం ఒకటిన్నర టీఎంసీల నిల్వ
-ఇక సమీప చెరువులకు నీటి తరలింపు
-నెరవేరిన సీఎం కేసీఆర్ సంకల్పం
-గంగమ్మకు పూజలుచేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
-పట్టువస్ర్తాల సమర్పణ

నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పం నెరవేరింది. ఎస్సారెస్పీ పునర్జీవం పూర్తయింది. రెండొందల కిలోమీటర్ల దూరం ఎదురేగిన కాళేశ్వరం జలాలు.. మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గడపను ముద్దాడాయి. ఎస్సారెస్పీ కింద ఆయకట్టు రైతులు దీర్ఘకాలంగా సాగునీటికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్.. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రూ.1080 కోట్లతో చేపట్టిన పునర్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి ప్రత్యేకదృష్టితో పనులను వేగంగా పూర్తిచేయించారు. ముందుగా వీలైనన్ని జలాలను ఎస్సారెస్పీకి తరలించే ఏర్పాటుచేయాలని భావించారు. గత శనివారం రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్ నుంచి నాలుగు మోటర్ల ద్వారా ఎత్తిపోసిన జలాలు మూడురోజుల్లో ఎస్సారెస్పీలోని వరదకాల్వ జీరో పాయింట్ వద్ద గేట్ల వరకు చేరాయి. మంగళవారం వేకువజాముకు వరద కాల్వ 99వ కి.మీ నుంచి ఎస్సారెస్పీ జీరో పాయింట్ వరకు కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారింది.

ఎగువ నుంచి సుమారు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీలో నీటిమట్టం 33 టీఎంసీల వరకు చేరింది. ఇంకా ఇన్‌ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వరదకాల్వలో జీరో పాయింట్ వద్దకు చేరిన కాళేశ్వరం జలాలను అక్కడే నిలిపి ఉం చారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లోలను అంచనా వేస్తూ.. అవసరమైన సందర్భంలో జీరోపాయింట్ వద్ద వరద కాల్వ గేట్లను ఎత్తి ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం జలాలను వదలాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, పునర్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీని అవసరం అనుకున్నప్పుడల్లా కాళేశ్వరం జలాలతో నింపుకోవడం ఒక ప్రయోజనం కాగా.. వరద కాల్వ నుంచే చెరువులకు తరలించే మరో ప్రయోజనం కూడా ఉన్నది. ఇందుకోసం వరదకాల్వ వెంట గ్రావిటీ వైపు 45 తూముల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిలో కొన్నింటి నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతావాటి నిర్మాణాలను త్వరలో పూర్తిచేయనున్నారు. వరదకాల్వ రూపంలో ఒకటిన్నర టీఎంసీ సామర్థ్యం ఉన్న ఒక కొత్త జలాశయం సృష్టి జరిగినట్లయింది. ఎస్సారెస్పీ నుంచి ప్రధానకాల్వల తోపాటు, వరదకాల్వ ద్వారా కూడా రైతులకు సాగునీటి సౌకర్యం కలుగనున్నది.

200 కిలోమీటర్లు ఎదురేగి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ నుంచి 200 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కాళేశ్వరం జలాలు నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ వద్ద గోదారమ్మ చెంతకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు -1లోని మేడిగడ్డ బరాజ్ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఎత్తిపోసిన జలాలు అన్నారం బరాజ్‌కు, అక్కడి నుంచి సుందిల్ల బరాజ్‌కు చేరాయి. తర్వాత ఎల్లంపల్లికి చేరుకొని బొలివాడ నుంచి నందిమేడారం వద్ద భూగర్భంలోనే 14 కి.మీ. ప్రవహించి, గాయత్రి సర్జ్‌పూల్‌కు వచ్చాయి. అక్కడ బాహుబలి మోటర్లతో ఎత్తిపోసిన జలాలు 5 కి.మీ. గ్రావిటీ కెనాల్ ద్వారా 99వ కి.మీ. వద్ద వరదకాల్వలో కలిశాయి. అక్కడి నుంచి ఎస్సారెస్పీకి నీటిని తరలించడానికి పునర్జీవ పథకంలో భాగంగా మూడు పంప్‌హౌస్‌లను నిర్మించారు. 73వ కి.మీ. వద్ద రాంపూర్ సమీపంలో మొదటిపంప్‌హౌస్, రాజేశ్వర్‌రావుపేట 34వ కి.మీ. వద్ద రెండోపంప్‌హౌస్‌ను, ఎస్సారెస్పీలో వరదకాల్వ జీరో పాయింట్ వద్ద మూడోపంప్‌హౌస్‌ను నిర్మించారు.

ఈ మూడుపంప్‌హౌస్‌ల ద్వారా రోజుకు టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 60 టీఎంసీల నీటిని తరలించడం పునర్జీవ పథకం లక్ష్యం. మొదటి, రెండో పంప్‌హౌస్‌లలో నాలుగు మోటర్ల చొప్పున సిద్ధంచేసి అర టీఎంసీ నీటిని అందించేలా ఏర్పాట్లుచేయాలని గతేడాది సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో అధికారులు ఆ మేరకు రెండు పంప్‌హౌస్‌లను సిద్ధంచేశారు. వారంక్రితం గాయత్రి సర్జ్‌పూల్ నుంచి వరద కాల్వకు, అక్కడి నుంచి మొదటి పంప్‌హౌస్‌కు కాళేశ్వరం జలాలు చేరాయి. దీంతో మొదటి పంప్‌హౌస్‌లో నాలుగు మోటర్లకు వెట్న్ నిర్వహించారు. ఈ క్రమంలో మొదటి పంప్‌హౌస్ నుం చి రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌కు.. అక్కడి నుంచి ఎస్సారెస్పీకి జలాలు చేరాయి.

v-prashanth-reddy2

గోదారమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునర్జీవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పునర్జీవ పథకంతో ఎస్సారెస్పీకి తాకిన కాళేశ్వరం జలాలకు మంగళవారం ఎస్సారెస్పీ ఒడ్డున పంప్‌హౌస్ వద్ద ఆయన ప్రత్యేకపూజలు చేశారు. గోదారమ్మకు పసుపు కుంకుమతోపాటు, పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో తరలివచ్చిన రైతులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి పూర్వవైభవం తెచ్చిన సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవితకు రైతులందరం రుణపడి ఉంటామన్నారు. 200 కిలోమీటర్ల దూరం నుంచి కాళేశ్వరం జలాలు ఎదురెక్కి ఎస్సారెస్పీని తాకిన దృశ్యాన్ని చూస్తుంటే నోట మాటరావడం లేదని ఆయన తెలిపారు.

కండ్ల ముందు రీడిజైనింగ్ అద్భుతాలు

బహుళ ప్రాజెక్టుల సమాహారంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అద్భుతాలు కండ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూపొందించిన రీడిజైనింగ్‌తో బహుముఖ ప్రయోజనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటివరకు రెండుదిశలా విస్తరించిన కాళేశ్వరజలాలు త్వరలోనే మూడో దిశగానూ పరుగులు తీయనున్నాయి. ఓవైపు శ్రీరాజరాజేశ్వర జలాశయం ద్వారా లోయర్ మానేరుకు జీవం పోసిన కాళేశ్వర జలాలు.. మరోవైపు పునర్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికీ జలకళను సంతరింపజేయనున్నాయి. జూన్ 21న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్ నుంచి ప్రాణహితజలాలు సరస్వతి బరాజ్‌కు, ఆపై పార్వతి బరాజ్‌కు చేరుకున్నాయి.

ఈ జలాలను ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోయడం ద్వారా కాళేశ్వరంలోని లింక్-1ను విజయవంతంగా పూర్తిచేసిన అధికారులు.. అనంతరం గోదావరిలో ప్రవాహానికి అనుగుణంగా లింక్-2ను అందుబాటులోకి తెచ్చారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని నంది రిజర్వాయర్‌కు, ఆ తర్వాత నంది పుంపుహౌస్‌లోని భారీ మోటర్ల ద్వారా గాయత్రీ పంపుహౌస్‌కు, అక్కడినుంచి బాహుబలి మోటర్ల ద్వారా ఎస్సారెస్పీ వరదకాల్వలోకి పోశారు. ఈ క్రమంలో ఎగువ నుంచి చుక్క వరదనీరు రాకపోయినా శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయం తొలిసారి జలకళను సంతరించుకొన్నది. ఏకంగా 15 టీఎంసీలకుపైగా నీటినిల్వతో కళకళలాడింది. తదుపరి సాంకేతిక పరిశీలన కోసం అధికారులు ఆ జలాశయం నుంచి నీటిని లోయర్ మానేరుకు తరలించారు.

v-prashanth-reddy3

రెండో దిశకు విజయవంతంగా

శ్రీరాంసాగర్ జలాశయానికి గోదావరి జలాలను తరలించేందుకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని చేపట్టారు. కొన్నిరోజుల నుంచి రాంపూర్, రాజేశ్వరరావుపేట పంపుహౌస్‌ల్లోని మోటర్ల ద్వారా జలాల ఎత్తిపోత ప్రారంభించడంతో వరద కాల్వ జలకళను సంతరించుకొని రిజర్వాయర్‌లా మారింది. దీంతో కాళేశ్వరజలాలు శ్రీరాంసాగర్‌ను కూడా ముద్దాడుతున్నాయి.

మరికొన్ని నెలల్లో మల్లన్నసాగర్ దిశగా..

కాళేశ్వరజలాలు మరికొన్ని నెలల్లో మల్లన్నసాగర్ దిశగా పయనించనున్నాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి రంగనాయకసాగర్ మీదుగా మల్లన్నసాగర్ వైపు పరుగులు తీయనున్నాయి.

2092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles