నిర్మాణాల్లో పారదర్శక విధానం

Fri,October 18, 2019 03:03 AM

-దేశ ఉత్తమ విధానాల్లో మనదొకటి
-రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ టాప్
-రియల్ ఎస్టేట్ సంఘాల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానం దేశంలోని ఉత్తమ విధానాల్లో ఒకటని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం రాష్ట్రంలో ఇప్పటికే పారదర్శక విధానాన్ని తీసుకొచ్చామని, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌చేస్తూ మరింత పారదర్శకంగా ఉండే విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ సంఘాల ప్రతినిధులు గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక కాంప్లెక్స్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులకు తీసుకొచ్చిన ప్రక్రియను ఈ సందర్భంగా వారికి వివరించారు. ఈ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్న స్పందనను అడిగి తెలుసుకున్నారు. దీన్ని మరింత సులభతరం చేసేందుకు మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొంటూ.. బిల్డర్ల సంఘాల నుంచి ఒకరిద్దరు ప్రతినిధులు అధికారులతో కలిసి పనిచేయాలని సూచించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న విధానాలను పరిశీలించి తెలంగాణ విధానాన్ని అత్యుత్తమమైనదిగా మార్చేందుకు సూచనలు చేయాలన్నారు.

ఇప్పటికే అన్ని మున్సిపల్ విభాగాల్లో ఇ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నామని, దీంతో ఫైళ్ల అనుమతులు ఏ దశలో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుస్తుందని తెలిపారు. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా కొనసాగుతున్నదని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలే ఇందుకు కారణమని చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పటికే భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటుచేశామని, నిర్మాణ వ్యర్థాలను చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో వేస్తే చర్యలు తప్పవన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలు జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేయాలని కోరారు. కేటీఆర్‌ను కలిసినవారిలో క్రెడాయ్ తెలంగాణ, క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ తదితరులున్నారు.

364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles