పల్లెల మురిపెం

Mon,September 16, 2019 02:46 AM

-పదోరోజుకు చేరిన 30 రోజుల ప్రణాళిక..
-ఊరూరా గ్రామసభలు, అభివృద్ధి కార్యక్రమాలు..
-ముమ్మరంగా శ్రమదానాలు, పాత ఇండ్ల కూల్చివేత
-పలుచోట్ల జరిమానాలు.. నిర్లక్ష్యంపైనా చర్యలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రగతి ప్రణాళికల అమలుతో పల్లెలు మురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛందంగా శ్రమదానం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు సైతం గ్రామాలకు తరలుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానాల్లో పాల్గొంటున్నారు. ఉన్నతాధికారుల పర్యటనలు పల్లెవాసుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇదే స్ఫూర్తితో వీధులను శుభ్రంచేసుకొంటూ, పాత ఇండ్లను కూల్చివేస్తూ, హరితహారం మొక్కలను సంరక్షిస్తూ, రోడ్లు బాగుచేసుకొంటూ గ్రామాలను అం దంగా తీర్చిదిద్దుకొంటున్నారు. మరోవైపు నిర్లక్ష్యంచేసే ప్రజాప్రతినిధులు, సిబ్బందిపై చర్యలు తప్పడంలేదు. అదే విధంగా మొక్కల పెంపకంపై కఠినవైఖరి అవలంబిస్తున్నా కొన్నిచోట్ల జీవాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
Palle-Pragathi
ఇలాంటిచోట్ల జరిమానాలు భారీగా విధిస్తున్నారు. 30 రోజుల ప్రణాళికలో పదోరోజైన ఆదివారం సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం జలాలపురంలో దాచేపల్లి వంశీయులు శ్మశానవాటిక నిర్మాణం కోసం సర్వేనంబర్5లో 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కొండాపూర్‌లో ఇంటి చుట్టూ మొక్కలు నాటినవారికి సర్పంచ్ రూ.200 చొప్పన ప్రోత్సాహం అందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు చొరువ తీసుకొంటున్నారు. చాలాప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేస్తున్నారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్లను వాడకుండా, పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నవారికి నోటీసులు జారీచేస్తున్నారు. కేవలం రెండు, మూడ్రోజుల్లో పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలు జారీచేస్తున్నారు. పల్లెప్రగతి ప్రణాళికలో చాలాగ్రామాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జనలు తగ్గినట్టు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాలరోడ్లు పరిశుభ్రంగా మారినట్టు చెప్తున్నారు. గ్రామాల్లో పిచ్చిమొక్కల తొలగింపుతో వీధులన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు అందంగా దర్శనమిస్తున్నాయి. గ్రామసభలు నిర్వహించి పాత ఇండ్లను కూల్చివేశారు.

ఇందూరు జిల్లాలో కలెక్టర్ శ్రమదానం

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బాపునగర్‌లో కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు పర్యటించారు. రోడ్లవెంట ఉన్న పిచ్చి మొక్కలను తొల గించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం డీ నాగారం గ్రామంలో జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండ లం రంగాయిపల్లిలో జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత శ్రమదానం చేశారు. గ్రామస్థులతో కలిసి పారపట్టి పిచ్చిమొక్కలను తొలగించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఐకేపీ, సెర్ప్ ఆధ్వర్యంలో రెండువేల మంది మహిళలు శ్రమదానం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మం డలం అప్పపల్లి, కొత్తరహపల్లి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పర్యటించి గ్రామసభలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపల్లిలో బ్లాక్ ప్లాంటేషన్‌లో గొర్రెలను మేపినందుకు ఒక్కోగొర్రెకు రూ.500 చొప్పున రూ.10వేల జరిమానా విధించారు. ఉట్నూరు పట్టణంలో మూడు మద్యం దుకాణాలు, ఓ హోటల్ అపరిశుభ్రంగా ఉండటంతో రూ.వె య్యి చొప్పున జరిమానా విధించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం నంద్యానాయక్ తండాలో పల్లెప్రణాళిక విధులను నిర్లక్ష్యంచేసిన వీఆర్వో, వీఆర్‌ఏను సస్పెండ్ చేశారు.

మొక్క ను మేసి.. బంధీగా మారింది

Palle-Pragathi11
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారంలో సాగర్ రహదారిపై డివైడర్ మధ్య లో నాటిన హరితహారం మొక్కను ఆదివారం ఉదయం ఓ మేక మేసింది. గమనించిన పంచాయతీ సిబ్బంది దాన్ని పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి కట్టేశారు. కారోబార్ శివ శరణం విషయాన్ని పంచాయతీ కార్యదర్శి సురేశ్‌రెడ్డికి వివరించారు. మేక ఎవరిదో తెలియక పోవడంతో మేక కోసం వచ్చిన వారికి రూ.500 జరిమానా వేసి విడిచిపెట్టాలని ఆయన సూచించారు.

విజయవంతంగా నిర్వహిస్తున్నాం

30 రోజుల ప్రణాళికను విజయవంతంగా నిర్వహిస్తు న్నాం. గ్రామసభ ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దనీ, ఎక్కడైనా ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని ప్లాస్టిక్ స్టోరేజీ యూనిట్‌లో వేయాలని కోరాం. పాలకవర్గ నిర్ణయాల్లో ప్రజలు భాగస్వాములవుతున్నారు.
- యుగేందర్‌రెడ్డి, సర్పంచ్, దుద్దనపల్లి, కరీంనగర్ జిల్లా

ప్రణాళికను ప్రజలు హర్షిస్తున్నారు

గ్రామాల్లో చేపడుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో చేపడుతున్న పనులు చూసి ప్రజలు సంబురపడుతున్నారు. గ్రామాలకు జనాభా ప్రతిపాదికన నిధులు వస్తుండడంతో మా ఊరికి రూ.2.40 లక్షల నిధులు మంజూరయ్యయి. ఈ నిధులతో ప్రస్తుతం కావాల్సిన పనులు చేపడతాం. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
- గుర్రాల రాజేందర్‌రెడ్డి, సర్పంచ్, సారంగాపూర్, జగిత్యాల

మంచి కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన ఊరిని మనమే బాగు చేసుకునే అవకాశం వచ్చింది. సర్పంచులకు చేతనైనంత పని చేసుకోవచ్చు. ఒకప్పుడు గ్రామంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవాలంటే నిబంధనలు అడ్డువచ్చేవి. ఇప్పుడు ప్రత్యేక అధికారులే గ్రామాల్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
- ఊరడి రాంరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు, రుద్రవరం, రాజన్నసిరిసిల్ల
Palle-Pragathi22
Palle-Pragathi33

1176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles