సంక్షేమబాట వీడం

Mon,September 16, 2019 03:09 AM

-ఆర్థికమాంద్యం ఉన్నా ఇచ్చినమాట నెరవేరుస్తాం.. పరిమితులకు లోబడే రుణాలు
-అభ్యుదయ పథాన తెలంగాణ.. దేశాభివృద్ధిలో రాష్ర్టానిది కీలకపాత్ర
-కేంద్రానికి మనం ఇస్తున్న పన్నులు 2.7 లక్షల కోట్లు.. తిరిగిచ్చింది 31 వేల కోట్లే
-54 లక్షల ఇండ్లకు మంచినీళ్లు వస్తున్నయి
-ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ప్రతి పైసాకు లెక్క
-రైతు రుణవిముక్తుడు కావాలి
-లేనిపోనివి చెప్పి ప్రజలను ఆగం చేయొద్దు
-అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంపై ఆర్థికమాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ సంక్షేమపథాన్ని వీడబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే ప్రభుత్వం రుణాలను తీసుకొంటున్నదని.. క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన సాధారణ చర్చకు ఆదివారం సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అంశాలవారీగా దీటుగా జవాబిచ్చారు. రైతులకంటే మించి తమకు ముఖ్యం ఎవరూ లేరని స్పష్టంచేశారు. రైతు సంక్షేమ పథకాలను, ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామన్నారు. గోదావరి, కృష్ణా అనుసంధానంపై ఎలాంటి అపోహలు వద్దని.. ప్రతిపక్ష నేతల సమక్షంలోనే ఒప్పందాలు పూర్తిచేద్దామని సీఎం తెలిపారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఎవరైనా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠినంగా అణచివేస్తుందని హెచ్చరించారు. లేనిపోనివి చెప్పి ప్రజలను ఆగం చెయ్యొద్దని విపక్షాలకు హితవు చెప్పారు.

సుమారు మూడున్నర గంటలపాటు ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్థికమాంద్యం మొదలుకుని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వరకు.. గత ప్రభుత్వాలు చేసిన అప్పుల నుంచి.. ప్రజలను మభ్యపెట్టిన విధానం వరకు వివరించారు. పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ నుంచి రూ.2.7లక్షల కోట్లు ఇస్తుంటే.. కేంద్రం రాష్ర్టానికి రూ.31వేల కోట్లు మాత్రమే ఇవ్వడాన్నికూడా సభకు వివరించారు. గత ప్రభుత్వాలు నదీజలాల విషయంలో చేసిన మోసాలను ఎండగట్టారు. రాష్ట్రంలో గతంలోని ఏడు ఇందిరమ్మ ఇండ్లకు సమానంగా.. ఒక డబుల్ బెడ్‌రూం నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. బడ్జెట్‌పై చర్చకు సీఎం అంశాలవారీగా ఇచ్చిన సమాధానం సమగ్రంగా ఆయన మాటల్లోనే.. పేపర్‌వాళ్లు అడిగితే ఆర్థికమాంద్యం కారణమన్నడు. ఇది ఎవరు దాచిపెట్టేదో.. మభ్యపెట్టేదో కాదు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో మేం భేషజాలకు పోలేదు. మేంకూడా రూ.1.80లక్షల కోట్లు.. రూ.1.94లక్షల కోట్లు పెట్టొచ్చు. కానీ మేం పెట్టలేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థికకార్యదర్శి రామకృష్ణారావు, జీఆర్ రెడ్డి వంటి మేధావులను సలహాదారులుగా పెట్టుకొని మొదటి బడ్జెట్ రూపకల్పన చేసుకొన్నం. ఎందరో ప్రగతి నిరోధకశక్తులు, రాజకీయ దుష్టశక్తులు అనేకరకాల ప్రయత్నాలు చేసి ప్రగతి జరగకుండా ఆపి ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెద్దామని చూసినరు. వాటన్నింటినీ అధిగమించి 21 శాతం పైబడి వృద్ధిరేటు సాధించినం. గడిచిన ఐదేండ్లు కూడా బ్రహ్మాండమైన వృద్ధి సాధించినం. ఏడాదిన్నర నుంచి తగ్గుదల ఉన్నది. 18 మాసాలుగా ఏ టర్మ్‌లో, త్రైమాసికంలో ఎంత తగ్గిందనే లెక్కలు కూడా ఇచ్చినం. చివరకు ఇప్పుడు కేవలం ఐదుశాతం వృద్ధిరేటు నమోదవుతున్నది. ఇది కొంచెం భయానక పరిస్థితి.
CMKCR1

దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర

మనదేశంలో చట్టాల ప్రకారం ఖజానాకు సంబంధించి 99.9 శాతం కేంద్రం ఆధీనంలో ఉంటది. కేంద్రం రాష్ట్రాల నుంచి వసూలుచేసే పన్నులు రూ.2.70 లక్షల కోట్ల పైచిలుకు. మనకొచ్చేది రూ.30-31 వేల కోట్లు మాత్రమే. అది కేంద్ర పథకాల రూపంలో వాళ్ల వాటా వచ్చింది. ఈ డబ్బులు తీస్కొనే దానిమీద.. ఇచ్చేదాని మీద ఒక విధానం ఉంటది.. తెలంగాణ పల్లెల్లో దాన్ని పతారా అంటం. పతారా ఉన్నోనికే సావుకారు అప్పుఇస్తడు. దివాలా తీసేటోన్కి ఎవరూ ఇయ్యరు.ఆ క్రమంలో దేశాన్ని సాదేటటువంటి ఆరేడు రాష్ర్టాల్లో మన తెలంగాణ ఒకటి. తెలంగాణ కాకముందు ఢిల్లీల మమ్మల్ని సవాలక్ష ప్రశ్నలు అడిగినరు. చెప్పలేక సచ్చిపోయినం. ఆరోజు ఏమైతే మేం వాదించినమో అవి నూటికి నూరుపాళ్లు రుజువై అద్భుతమైన ప్రగతితోటి పురోగమిస్తున్నది.

పరుగెత్తేవాళ్ల కాళ్లల్ల్ల కట్టె పెట్టకండి

విషయాన్ని అవగాహన చేసుకోవటంలో వేర్వేరు దృక్పథాలుంటయి. కాంగ్రెస్ మిత్రుల అవగాహన వేరేరకంగా ఉంటది. 1940 కాలంలోనే ఉంటం అంటే అదివాళ్ల విచక్షణ. మేం చేయగలిగిందేంలేదు. అంటెనేమో ఒకబాధ.. అనకపోతే మరోబాధ. అనకపోతే వాళ్లన్నది ఒప్పుకున్నట్లయితది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి రాష్ర్టాలకు ఈరోజు ఉన్నది 25%. రాష్ర్టాలకు రుణమివ్వడంలోనూ కేంద్రానికి కర్రపెత్తనమే. ఆ విధానం మార్చాల్సి ఉన్నది. అదేమాట నీతిఆయోగ్‌లో చెప్పిన. దేశంలో ఏ కార్నర్ పెరిగినా దేశం పెరిగినట్లే కదా.. ఆ సోయి మీకుండాలె. మీరుసోయి తప్పి పోతున్నరు. ఎవరికైతే ప్రుడెన్స్ ఉన్నదో వాళ్లను పనిచెయ్యనియ్యాలె. పరుగెత్తే కాళ్లల్ల కట్టె పెట్టకండి.. మీకు విజ్ఞతలేదని ప్రధానమంత్రిని కూర్చోబెట్టి ఆయన ముఖం మీదచెప్పిన. కానీ అక్కడ అదంతా అరణ్యరోదన. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎఫ్‌ఆర్‌బీఎంపై రికమండేషన్లు ఇచ్చారని చెప్పారు. రికమండేషన్లు ఇచ్చింది ఎన్కేసింగ్ కమిటీ. ఆయన ఇచ్చింది 40శాతం.. 21శాతమని అంటున్నరు అది ఫైనల్ కాలేదు. ఇప్పటికైతే 25% ఉన్నది. 21శాతం నిజమైతే అప్పుడు పెద్దముద్దాయి కేంద్రమే అయితది. ఎందుకంటే మన అప్పులు ఈరోజు 21% ఉంటే.. కేంద్రానికి ఉన్న అప్పులు 49 శాతం ఉన్నయి. మొట్టమొదట వాళ్ల కాళ్లు వాళ్లే నరికేసుకోవాలి.

చెప్పి చెప్పి నేనే తంగయితున్న

రూ.మూడు లక్షల కోట్లు.. రూ.ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిండ్రని అంటున్నరు. తెలంగాణ పల్లెల్లో ఒక సామెత ఉంటది. గుమ్మినిండ ఒడ్లు గుమ్మిల్ననే ఉండాలె.. గూటాలోలె పిల్లలుండాలె అన్నట్టు పిల్లలు లావు కావాలంటే గుమ్మిఖాళీ కావాలె. అది అట్లనే ఉండాలె.. ఇది ఇట్లనే ఉండాలంటే సాధ్యం కాదు. అభివృద్ధి రావాలంటే ఎక్కడి నుంచి వస్తది.. గాలిల నుంచి వస్తదా? ఈ రుణాలకు సంబంధించి గతంలోనే చెప్పిన. కానీ చెవిటోని ముందు శంఖమూదినట్లే ఉన్నది. చెప్పిచెప్పి నేనే తంగయితున్న. మేం అభ్యుదయ పథాన్ని ఎంచుకున్నం. మాది జపాన్, అమెరికా, చైనా, యూరోపియన్ ఎకానమీ విధానం. వాళ్లలాగే మేం కూడా ఉన్న పరిమితుల్లోనే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నం.

ప్రభుత్వానిది పూచీకత్తు మాత్రమే

పౌరసరఫరాల కార్పొరేషన్‌కు రూ.9వేల కోట్ల అప్పులకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. మార్క్‌ఫెడ్‌కు కూడా మూడు.. మూడున్నర వేల కోట్ల రుణానికి పూచీకత్తు ఇస్తం. వాళ్ల డబ్బులు వాళ్లే కట్టుకుంటరు. ప్రభుత్వం ఇయ్యదు. ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ర్టాలు దారుణంగా కూరుకుపోయి ఉంటే ఉదయ్ అని ఎలక్ట్రిసిటీలో ఒక పథకాన్ని తెచ్చింది. అందులోభాగంగా మన రాష్ట్రంలోని డిస్కంకు రూ.9వేల అప్పులు తీసుకొమ్మంటే తీసుకొన్నం. ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుకాదు. అయినా ప్రభుత్వఖాతాలోకే వస్తయి. మేం మొత్తమే ఉల్లిగడ్డ పొట్టు ఏస్కొని తింటమన్నట్టు మాట్లాడుతరు కానీ వీళ్ల (గత కాంగ్రెస్ సర్కారు) బాపతు రూ.75వేల కోట్ల అప్పులున్నయి. కొన్ని కట్టినం. ఇంకా రూ.69వేల కోట్లు ఉన్నయి. మిషన్ భగీరథకోసం తెచ్చి మంచినీళ్లిస్తున్నం తప్పా? అప్పులు తెచ్చి ఏంచేసినం.. భట్టి విక్రమార్కను కాదని మంత్రులు.. మేం కలిసి దావత్ తిన్నమా? మేం పెట్టుబడులు పెట్టినం. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే పునరుత్పత్తి పెరుగుతది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపడుతది. అప్పుల గురించి వీళ్లు బెంబేలెత్తే అవసరంలేదు. నిర్ణీత తేదీలోపు చెల్లిస్తున్నాం. ఎక్కడా డిఫాల్ట్ కావడం లేదు. ఏడాది గడిచేసరికి పెద్ద పని జరుగుతది. మేం పెట్టిన అప్పుల ఫలితాలు అద్భుతంగా కనిపిస్తవి. ఎఫ్‌ఆర్‌బీఎం కింద రూ.18-19 వేల కోట్లు ఇస్తే.. ఆర్బీఐ సమకూరుస్తది. ఎక్కడపడితె అక్కడ కిరాణా దుకాన్ల తెచ్చినట్లు ఉండదు. ఈనెల మాకు రూ.2 వేల కోట్లు కావాలని ఆర్బీఐని అడిగితే తెలంగాణ బాండ్లు ఫైర్‌లాగా అమ్ముడుపోతాయి. మన బాండ్లను బ్యాంకర్లు అట్ల అడుగుతరు. ప్రభుత్వాలకు 5-7-8 సంవత్సరాలకు మించి ఇవ్వరు. మనవి 15-20 ఏండ్ల బాండ్లు పోయినయి. ఒకటైతే 25 ఏండ్ల బాండ్ కూడా పోయింది. 25 ఏండ్లకు అప్పులు తిరిగి ఇస్తమన్నా అమ్ముడుపోయింది.

హామీ ఒక్కటైనా నెరవేర్చారా?

కాంగ్రెస్ హయాంలో మతకల్లోలాలు, కర్ఫ్యూలు మూడుపూవులు ఆరుకాయలుగ వర్ధిల్లినయి. చేనేత కార్మికులు ఆత్మహత్యల పాలైనరు. పాలమూరు జిల్లాల బొంబాయి బస్సులొచ్చినయి. రైతులు పురుగు మందుతాగి సచ్చినరు. అడవులన్నీ నాశనమై కడప స్మగ్లర్లు భయంకరంగా తయారైనరు. మీరు ప్రాజెక్టులుకట్టి పారించి పచ్చగచేస్తే మేమొచ్చి ఎండగొడుతున్నమా? మేం ఏ చేసినమో.. అంతా చెప్త.. దాన్ని కూడా ఓ కథ పెట్టి మాట్లాడటం కరెక్టు కాదు. 2009 జూన్ 1 నుంచి రాష్ట్ర ప్రజలందరికీ నిరంతరాయంగా కరంట్ సరఫరాచేస్తమని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పినరు. కానీ చెయ్యలేదు. రైతులకు 9 గంటల ఉచిత కరంట్ ఇస్తమన్నరు. ఇయ్యలేదు. నేనే రాజీవ్ రహదారిమీద ధర్నాలో బైఠాయించిన. శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో అందరికీ పక్కాఇండ్లేమో కానీ, వాళ్ల నాయకుల జేబులు మాత్రం పక్కా అయిపోయినయి. తండాలను గ్రామపంచాయతీలు చేస్తమని ఆ ముచ్చట కూడా ఎత్తలేదు. ఇయ్యాల మేం మూడు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినం. మేం చెప్పింది చెప్పినట్లు ఒకరవ్వ వెనకా ముందు చేస్తున్నం.

నిరుద్యోగులను ఎన్నాళ్లు మభ్యపెడతరు?

రాష్ట్రమొస్తే ఉద్యోగాలొస్తయనుకున్నం అన్నరు. మొత్తమే రాలేదా? 1,44,384 ఉద్యోగాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందులో 1,17,714 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. మిగిలిన వాటికి ప్రాసెస్ జరుగుతున్నది. 50-52వేల కొత్త ఉద్యోగాలు మంజూరీ ఇచ్చినం. దాని మీద కూడా ఈ గొప్ప వ్యక్తులే కేసులు వేసేది. కింద మంట పెట్టాలి, పైన చెయ్యి పెట్టాలి. అందుకే ప్రజలు వారిని తిప్పికొట్టారు. ఐటీ రంగంలో, పారిశ్రామిక రంగంలో లక్షలాది మందికి వచ్చినయి. ఈ రోజు పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నయి. కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు, రెండు దశాబ్దాల పాటు టీడీపీ అధికారంలో ఉండి ఇంటికో ఉద్యోగం ఎందుకియ్యలేదు? నకిలీ ధర్నాలు, రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగులను ఎన్ని రోజులు మభ్య పెడుతరు?

మాపార్టీ వాళ్లపై కూడా కేసులు

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం పెట్టిన మొక్కలు 35లక్షలు. మేం హరితహారం కింద 175 కోట్ల మొక్కలు పెట్టినం. నా నియోజకవర్గంలో అడవిని పునరుద్ధరించాం. వచ్చేఏడు అందులోకి పోవాలంటే భయమైతది. అందరు ఎమ్మెల్యేలకు మనవి చేస్తున్నా.. నర్సరీలోని మొక్కలు పెట్టండి.. పల్లెప్రగతిలో పాల్గొనండి.. కరంటు బాధ తీరిపోయింది.. మంచినీళ్ల బాధ తీరిపోయింది. సాగునీళ్ల బాధ కూడా తీరబోతుంది. పచ్చదనం కూడా పెరిగితే ఉపాధి అవకాశాలు ఉండే తెలంగాణ తయారు అయితది. అసెంబ్లీ సమావేశాలు అయ్యాక అన్ని జిల్లాలకు పోయి గిరిజనుల పోడుభూముల వ్యవహారాన్ని పరిష్కరిస్తా. వందశాతం వాళ్లకు నష్టం రాకుండా హక్కులు ఇస్తాం. వారికి కూడా రైతుబంధు, రైతుబీమా ఇస్తాం. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే తమ్ముడు మంచివ్యక్తి. చెడ్డవ్యక్తి కాదు.. పెద్ద మెజార్టీతో జెడ్పీటీసీగా గెలిపించారు. గిరిజనుల భూముల మీదికి వస్తే ఆయన అడ్డంపోయినాడు.. దానికి ఆయనమీద కేసు పెట్టారు.. వనమా వెంకటేశ్వర్‌రావు సీనియర్ సభ్యులు.. ఆయన దౌర్జన్యంచేసే వ్యక్తి కాదు.. ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తాం. చట్టాన్ని రహస్యంగా చేయం.. అందరితో పంచుకుందాం..

నీళ్లకు ఊర్లేందీ?

కాంగ్రెస్ పార్టీ ఏ రోటికాడ ఆ పాట పాడుతది. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మా మంథని నీళ్లు అన్నరు. ఎక్కడన్న ప్రపంచంల మంథని నీళ్లు, బాన్సువాడ నీళ్లు, సిద్దిపేట నీళ్లు ఉంటయా? పైన ఉన్న మహారాష్ట్ర కూడా అట్లనుకుంటె ఎట్ల? బాధ్యత కలిగిన శాసనసభ్యుడు అట్ల అనుకుంటరా? మంత్రిగా కూడా పనిచేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చి ఎస్సారెస్పీ కింద పంటలు పండిస్తుంటే మా జహీరాబాద్ నీళ్లని కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తది. ఎస్సారెస్పీ నుంచి మంచినీళ్ల కోసమని ఎల్‌ఎండీకి నీళ్లు తెస్తే అక్కడ బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలో మా బాల్కొండ నీళ్లని ధర్నా చేస్తరు. ఇదెక్కడి సంస్కృతి? గిన్నేండ్ల పార్టీ ఇంతచీప్‌గా మాట్లాడతరా?

జగన్మోహన్‌రెడ్డికి నిజాయితీ ఉంది

ఉభయ రాష్ట్రాల రైతాంగం ప్రయోజనంకోరి విశాల ధ్రుక్పథంతో కాళేశ్వరం ప్రాజెక్టును విజయవంతంగా నిర్మించుకున్న అనుభవం నుంచి చెప్తున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో నిజాయితీ ఉన్నది. తెలంగాణ శాసనసభ వేదికగా ఈ విషయాన్ని చెప్తున్నా. ప్రజలకు ఉపయోగపడేరీతిలో ఏపీకి తెలంగాణ సహకారం ఉంటుంది. ఆంధ్ర, రాయలసీమల్లోని కరువునేలలు తడవాలి, అక్కడి ప్రజల దాహార్తి కూడా తీరాలి. ఈ రోజు స్పష్టంగా చెపుతున్న.. ఇటీవల ఆంధ్ర సీఎం వచ్చారు.. మేం ఇద్దరం సమావేశమయ్యాం.. తెలంగాణ వచ్చాక మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాం.. మీరు కూడా బాగుపడండి అని చెప్పినాం. పేపర్లలో వచ్చిం ది. బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవు.. తెలుగురాష్ట్రాల్లో ఉన్న రైతులు బాగుపడాలి. మేము కూడా సహకరిస్తాం. మాకు ఆ ధర్మం ఉంది.

కాళేశ్వరం ట్రైలర్ నడుస్తున్నది

ఆ రోజు కృష్ణా డెల్టా ఎండిపోతుంటే.. ప్రతిభాభారతి స్పీకర్‌గా ఉన్న సమయంలో 40 నిమిషాలు మాట్లాడిన.. చంద్రబాబు చేసేది తప్పు.. కృష్ణా డెల్టా ప్రజలను మోసంచేస్తున్నారు. మా తెలంగాణ ప్రజలను ఎట్లాగూ ముంచుతున్నరని ఆనాడే చెప్పిన.. జూరాల ప్రాజెక్టును గులాబీజెండా ఎగిరేదాకా నింపలేదు. కర్ణాటకకు మేం వచ్చాక పరిహారం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా దీనికి అతీతంకాదు.. ఆయన కూడా మోసమే చేశాడు. ఎస్సెల్బీసీకి ఇప్పుడేంగతి ఉన్నది.. దాన్ని కొంచబోయి సొరంగంలో సొర్రగొట్టారు. ఇయ్యాల్టికీ తవ్వుతూ ఉన్నరు. ఇంకా రెండేండ్లయితదో మూడేండ్లయితదో తెలియదు. దాన్ని వెనుకకు తీయరాదు.. ముందుకుపోరాదు. తెలంగాణ ప్రాజెక్టులన్నింటినీ ఇలానే చేశారు. ఎక్కడ ప్రాణహిత.. ఎక్కడ తమ్మిడిహట్టి.. ఎక్కడ చేవెళ్ల .. మన మునిమనవళ్లు కూడా చూడరు. అక్కడ నీళ్లు లేనేలేవని చెప్పిన.

అందుకే తెలంగాణ వచ్చాక అనేకరకాలుగా స్టడీచేశాం. సీడబ్ల్యూసీతో చర్చించాం. లైడార్ సర్వేలు, ఫిజికల్‌సర్వేలు చేశాం. లోకేశ్‌రెడ్డి అని పాలమూరు పిల్లగాడు కూడా నాతోపాటు ఉండేవాడు. నేను ఐదుసార్లు, అప్పుడు ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు 20సార్లు మహారాష్ట్ర వెళ్లాం. అక్కడి ముఖ్యమంత్రిని కలిసి ఒప్పందాలు చేసుకున్నం. మీరు బతుకండి.. మమ్మల్ని బతికించండి అన్న నినాదం మాదని చెప్పాం. ఆ మేరకు ఒప్పందంలో కూడా అనేక పరస్పర ఉపయోకరమైన అంశాలు చేర్చాం. చనకా-కొరట పనులు 70 శాతం పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రారంభాన్ని నేను సోకులకు పెట్టలేదు.. మహారాష్ట్ర, ఏపీ ముఖ్యమంత్రులను రప్పించి ముగ్గురం కలిసి ప్రారంభించాం. దేశంలో ముగ్గురు సీఎంలు కలిసి ప్రారంభించిన ప్రాజెక్టు కాళేశ్వరం. నీటియుద్ధాలు జరిగే ప్రస్తుత రోజుల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఏ విధంగా చేశారని దేశమంతా ఆశ్చర్యపోయింది. ఒక 400 కేవీ సబ్‌స్టేషన్ కట్టాలంటే నాలుగు నుంచి ఆరేండ్లు పట్టేది. అలాంటివి అహోరాత్రాలు కష్టపడి.. ఆగమేఘాలమీద 400 కేవీ సబ్‌స్టేషన్లు 14 కట్టాం. ఒక్కపంపు 3,140 క్యూసెక్కులు పోస్తది.

ఒకమోటరు నడవటానికి 139 మెగావాట్ల పవర్ కావాలి. కాంగ్రెస్ సభ్యులకు (భట్టిని ఉద్దేశించి) పరువు పోగోట్టుకోవద్దని చెప్పండి. కాళేశ్వరంలో 42 పంపులు పనిచేయాలి. సర్వేల మీద ఆధారపడి బరాజ్ లెవల్ ఫిక్స్ అయింది మేం టెస్ట్ చేస్తున్నాం. కట్టిన బరాజ్ కట్టినట్టు రియాక్ట్ అవుతున్నదా?. బరాజ్ మేడిగడ్డలో ఉంటది.. పంప్‌హౌస్ కాళేశ్వరం దగ్గర ఉంటది. 24 కిలోమీటర్ల దూరంలో లెవల్ సరిపోతుందా? మోటర్ పనిచేస్తదా? 400 కేవీ సబ్‌స్టేషన్ ఎట్లా పనిచేస్తుంది? అందులో బిగించిన ట్రాన్స్‌ఫార్మర్లు ఎట్లా పనిచేస్తున్నయ్? ఇదొక బిగ్‌ప్రాసెస్. స్విచ్ వేయగానే ఆన్‌కావు. 15 నుంచి 20 నిమిషాల టైం తీసుకుంటది. మోటర్ ఆన్‌అయితే ఆరు మాసాల దాక స్విచ్ ఆఫ్ చేయకుండా నీళ్లు పోస్తది. కొత్త ప్రాజెక్టు కట్టినప్పుడు ఊజింగ్ వస్తుంది. అదంతా గ్రౌటింగ్ చేయాలె. అరెస్ట్ చేయాలె. అట్లనే ఎస్సారెస్పీలో వచ్చింది.

సింగూరులో వచ్చింది. 15 టీఎంసీలు నింపిన తర్వాత ప్రొటోకాల్ ఉంటది. డ్యామ్ సేఫ్టీ కమిటీ ఉంటది. వాళ్లు ఖాళీచేసి, మొత్తం టెస్టింగ్ చేసి చేయాల్సిన పనులు చేసిన తర్వాతనే ఫుల్‌కెపాసిటీ నీళ్లు నింపుతరు. ఇవన్నీ ఎవరికీ తెల్వయి. ఒక్కఎకరం పారలేదని భట్టి విక్రమార్క అంటరు. గంత పెద్ద ప్రాజెక్టు, 400 టీఎంసీలు తీసుకునేది, తెలంగాణ చరిత్రలోనే మొదటిది, రెండున్నరేండ్లలోనే అయిపోయి, పారుతదా? మీ సాక్షిగా 40 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతయి. ఒక్కోసారి శ్రీరాంసాగర్ సర్‌ప్లస్ అయ్యే నీళ్లువస్తే, మేడిగడ్డ దగ్గర మోటర్ ముట్టం. ఎందుకంటే ఎస్సారెస్పీ నుంచే మిడ్‌మానేరుకు లింక్ ఉంది. ఎల్‌ఎండీకి లింక్ ఉంది. మిడ్‌మానేరు నుంచే మల్లన్నసాగర్ దాకా లింక్ ఉంది. ఇటే నడుపుకుంటాం. రెండు పంపుహౌస్‌లు నడుస్తయి. ఎల్లంపల్లిని ముట్టం. మీద నుంచి నీళ్లు వస్తే అది స్ట్రాటజీ. గోదావరిలో నీళ్లు ఎదురు నడిచినయ్. మేడిగడ్డ బరాజ్ నుంచి శ్రీరాంసాగర్ వరకు 200 కిలోమీటర్ల పైచిలుకు, నీళ్లు ఉల్టా నడిచి, ఈరోజు వరద కాల్వను ఒక వనరుగా వాడుకుని ఒక రిజర్వాయర్‌గా చేసినం. శ్రీరాంసాగర్ ఆయకట్టుకు ఢోకాలేదిక. మిడ్‌మానేరు పాయింట్‌కు నీళ్లు వచ్చినయంటే, పాత ఎస్సారెస్పీ ఆయకట్టు, కొత్త ఆయకట్టు కలిపి 25 లక్షల ఎకరాల్లో రెండుపంటలు సుభిక్షంగా పండుతయ్. ఇది శిలాక్షరం. ఇది అసెంబ్లీ రికార్డులో ఉండాలని చెప్తున్నం. ఈ రోజు చాలా గర్వంగా మనవి చేస్తున్న. వంద కిలోమీటర్ల గోదావరి సజీవంగా ఉంది.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ట్యాంక్‌బండ్‌లో పెట్టే రెగెట్టా పోటీలు గోదావరిలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 140 కిలోమీటర్ల గోదావరి సజీవంగా ఉంటే ఎన్ని చేపలు రావాలి. దుమ్ముగూడెం బరాజ్ ప్రతిపాదన ఉంది. మొన్న కాంగ్రెస్ మిత్రులు తమ్మిడిహట్టి దగ్గరికి నాటుపడవల పోయి మోటు మాటలన్నీ మాట్లాడినరు. అతి దుర్మార్గంగా, అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతరు. అందుకే శనివారం సభలో కొంచెం కోపంవచ్చి పరుష పదజాలం వాడిన. అనేకమైన బాధ కలిగి కొంత పరుషంగ మాట్లాడిన.. ఆతర్వాత నాకే బాధ కలిగింది. అట్ల మాట్లాడి ఉండాల్సి కాదనుకున్న. విక్రమార్క అభ్యంతరం చెప్పినరు... ఆయనతో నేను ఏకీభవిస్తున్న. కృష్ణా, గోదావరి అనుసంధానం గురించి ప్రయత్నం చేస్తున్నాం. దుమ్ముగూడెం దగ్గర బరాజ్ ప్రతిపాదన చేస్తున్నాం. ఖమ్మం జిల్లా ప్రయోజనాలను కాపాడాలని బరాజ్ దగ్గర 35-40 టీఎంసీలు నీరు నిలిచే పరిస్థితి ఉన్నది. త్వరలో ఖమ్మం జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలందరం కూర్చుందాం. భట్టి విక్రమార్కను ఆహ్వానిస్తాను. ముంపులేకుండా 60 కిలోమీటర్లు సజీవ గోదావరి ఉండేలా ప్రతిపాదన చేసుకుందాం.
CMKCR2

తప్పించుకునే అలవాటు మాకు లేదు : భట్టితో సీఎం ఆసక్తికర సంభాషణ

భట్టి: సీఎంకు దళితుల అభ్యున్నతికి ఖర్చు పెట్టాలని ఆలోచన ఉండటాన్ని స్వాగతిస్తున్న. ఈ ప్రభుత్వం సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులను ఏమాత్రం మళ్లించలేదని సీఎం చెప్తున్నా.. నాకు కొన్ని సందేహాలున్నయి. ఎందుకంటే ఎల్వోపీ అయిన తర్వాత సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖరాసి.. మీరు నోడల్ అధికారిగా ఉన్నందున సబ్‌ప్లాన్ నిధులను ఏ శాఖలో ఎంత ఖర్చు పెడుతున్నరు? ఎంత మళ్లింపు జరుగుతుంది? అనే వివరాలు ఇయ్యాలని కోరిన. 8 నెలలు గడిచినా సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా చేయకుండా ఉంటే మాకు సమాచారం వచ్చేది. కానీ సమాచారం ఇవ్వనందున మాకు సందేహాలున్నయి.

ముఖ్యమంత్రి: ఈ విషయంలో నేను కచ్చితంగా భట్టితో ఏకీభవిస్తున్నా. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉందని ఏదో పొడి పొడి మాటలు చెప్పి తప్పించుకునే అలవాటు మాకు లేదు. ఆయన లేఖరాసినా ముఖ్యకార్యదర్శి ఇవ్వకపోవడం తప్పు. శాసనసభ్యులు ఎవరు అడిగినా సమాచారం ఇయ్యాలి. అయినా ఇవ్వలేదంటే అది కచ్చితంగా అధికారి తప్పే. దానిని కరెక్టు చేస్త. వాదోపవాదోలు పక్కనపెడితే దళితులు పైకి రావాలి. అందుకు నిర్మాణాత్మక మార్గాలు పడాలి. గిరిజనుల పట్ల కూడా ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఐ ప్రామిసింగ్ యూ. మీకు ఆ లెక్కలు ఇయ్యమని చెప్త. మళ్లింపు అనే ఆలోచన కూడా అధికారులకు రాకుండా ఉండేందుకు ఇంకా కొన్ని సూచనలు చేయండి.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ప్రతి పైసాకు లెక్క

సబ్‌ప్లాన్ నిధులు మళ్లించారని భట్టి విక్రమార్క నిందారోపణచేశారు. గతంలో సబ్‌ప్లాన్‌కు సంబంధించి వెచ్చించిన నిధుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో పెట్టి అందరు సభ్యులకు ఇచ్చినం. ఎవరి నియోజకవర్గంలో వాళ్లు పరిశీలించి లోపాలుంటే చెప్పమన్నం అందరూ మంచిగనే ఉన్నదని చెప్పినరు. ఎస్సీ జనాభా 15.45 శాతం ఉంటే.. 15.91 శాతం ఖర్చుపెట్టినం. ఎస్టీ జనాభా 9.08 శాతం ఉంటే.. 9.32 శాతం ఖర్చు పెట్టినం. అయినా కూడా ముఖ్యమంత్రిగ నాకు పూర్తిస్థాయి తృప్తిలేదు. సబ్‌ప్లాన్ నిధులు మళ్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నం. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను రూ.10 లక్షలనుంచి రూ.25 లక్షలు చేసినం. పైలట్ ట్రైనింగ్ వచ్చినా, క్రీడాకారులుగా వచ్చినా స్థోమతలేకుంటే ప్రోత్సాహకాలు ఇస్తున్నం. దళితులను ఆదుకునే విషయంలో తెలంగాణ ఛాంపియన్ కావాలి అని శాసనసభాపక్ష సమావేశంలో చెప్పిన. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది.

వైద్యారోగ్యంలో అభివృద్ధి

వంద పడకల దవాఖానలకు 50 పడకల మందులే వస్తున్నాయని అన్నరు. అది వాస్తవం కాదు. గతంలో మందుల కొనుగోలుకు రూ.146 కోట్ల బడ్జెట్ కేటాయింపు ఉండేది. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.440 కోట్లు ఖర్చు పెడుతుంది. కనీవినీ ఎరుగని పద్ధతుల్లో బాగుపరిచినం. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు 40 డయాలసిస్ కేంద్రాలు, 12 క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు, మందుల కొనుగోలుకు రూ.440 కోట్లు కేటాయించినం, కేసీఆర్ కిట్స్ ఒక అద్భుతం చేస్తున్నది. బస్తీ దవాఖానాలు పెట్టినం. ఈ మధ్య డెంగీ వచ్చిందంటే ఆరోగ్య, పురపాలక శాఖ మంత్రులతో పాటు నగర మంత్రి కూడా తిరిగి ఇంకా బస్తీ దవఖానలు పెట్టాలని కోరారు. తప్పకుండా వాటి సంఖ్య పెంచుతం. కంటివెలుగులో దాదాపు 40 లక్షల మందికి కండ్లజోళ్లు అందించినం. అయినా భయంకరమైన కసి ఉన్న కొన్ని పేపర్లు ఆపరేషన్లు అయి వాళ్లకు కళ్లుపోయినట్లే రాశారు. అందుకే ఇది బంద్ పెట్టినం. పారిశుధ్యంపై పురపాలక, గ్రామాణాభివృద్ధి శాఖ మంత్రులు బాగా పనిచేయాలి. 30 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నం. గురుకుల పాఠశాలలు మండలానికి మూడు పెడతమన్నం.

ఏడు ఇందిరమ్మ ఇండ్లు మా ఒక్కఇల్లుకు సమానం

కాంగ్రెసోళ్లు ఇండ్లో ఇండ్లని మొత్తుకుంటున్నరు. 20 లక్షల ఇండ్లు కావాలని భట్టి విక్రమార్క అన్నరు. 20 కాకపోతే 30 లక్షల ఇండ్లు కడతం. కాంగ్రెస్ కట్టిన ఏడు ఇండ్లు ఇయ్యాల మేం కడుతున్న ఒక డబుల్ బెడ్‌రూంకు సమానం. రెండులక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు కడుతున్నమంటే 14 లక్షల ఇండ్లకు సమానం. మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గం సూర్యాపేటకు 40 ఇండ్ల ప్రారంభోత్సవానికి పోతే ఒక ముస్లిం సోదరుడు కాళ్లు పట్టుకొని వదుల్తలేడు. ఏదో అడుగుతడునుకుంటే.. సార్ ఈ ఇల్లు నాదే, నా జన్మల కూడా ఇట్లాంటి ఇంట్ల ఉంటనుకోలేదని అని అన్నడు. అంతకుముందు ఇండ్లు కావాలంటే నలుగురు పైరవీకారులను పట్టుకోవాలె, ఆఫీసుకు పోవాలె, దరఖాస్తు చేసుకోవాలె, ఇప్పుడు నాకు తెల్వదు కూడా తెల్వదుసార్. లాటరీ తీసిండ్రు, నాకొచ్చిందన్నడు. ఇయ్యాల సర్టిఫికెట్ ఇస్తే ఇంట్లకొచ్చిన అని చెప్పిండు. శభాష్ జగదీశ్‌రెడ్డి అని పొగిడి వచ్చిన.

చిత్తశుద్ధితో మైనార్టీల సంక్షేమం

ఐదేండ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి రూ.3,994 కోట్లు ఖర్చుపెట్టినం. అక్బరుద్దీన్ ఒవైసీ మొన్నచెప్తే.. ఎస్సీ ఎస్టీ వారికి సమాంతరంగా మైనార్టీల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారా? లేదా? అని అధికారులను అడిగిన. ఖర్చవుతున్నదనే చెప్పిన్రు. ఎక్కడైనా ఏదైనా ఒక సమస్య వస్తే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తా. మైనార్టీ సంక్షేమానికి నిధులు పెంచుకుంటూ పోదాం.

ఆర్థిక మాంద్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన

ఆర్థిక మాంద్యం అనేది దేశవ్యాప్తంగా ఉన్నదని తెలిసిందే. దాని ప్రభావం ఏయే రంగాల మీద ఉన్నదనేది కూడా స్పష్టంగా చెప్పాం. బీజేపీకే చెందిన సుబ్రహ్మణ్యస్వామి సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అన్నివిషయాలు చెప్తున్నరు. మూడేండ్లదాకా తేరుకోదని టాటా మోటర్స్‌కు చెందిన బషేర్, పవన్ గోయెంక, ఆనంద్ మహేంద్ర వంటివారు చెప్పినరు. జహీరాబాద్‌లో మహేంద్ర ట్రాక్టర్ల కంపెనీ ఉన్నది. ఏడాదికి అక్కడ 1.5 లక్షల ట్రాక్టర్లు ఉత్పత్తిచేస్తరు. మంచి ఉద్యోగాలు వచ్చి పిల్లలు బతుకుతున్నరు. మొన్న ఆయన సడన్‌గ ఏం చెప్పిండంటే.. కంపెనీ విస్తరణకు రూ.1150 కోట్లు పెడదమనుకొన్నం కానీ ఇప్పుడు ఉపసంహరించుకున్నం అని చెప్పిన్రు.

1586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles