ప్రభుత్వసంస్థల్ని రక్షిస్తున్నం

Mon,December 2, 2019 03:07 AM

-రాష్ట్రంలో కరంటు ఉత్పత్తి జెన్‌కో చేస్తున్నది
-కుబేరులు అడిగినా ఇవ్వలేదు
-ఆర్టీసీనీ కాపాడాలని చూసినం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జనహితలో ఆర్టీసీ కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆర్టీసీ రూపంలోనా.. ఇంకో రూపంలోనా.. రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలి. ఎవరో అమెరికా నుంచి వచ్చి ఎయిర్‌పోర్టులో దిగిండు. బస్సెక్కాలని పోతే.. బస్సు లేదు.. సమ్మె.. అంటే మన రాష్ర్టానికి ఏమైనా ఇజ్జత్ ఉంటదా? చీటికిమాటికి సమ్మెచేయడం ఎవ్వరికీ మంచిదికాదు. రిజల్ట్ ఏమీరాదు. ఏం జరుగాలో విచారించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో మొత్తం ప్రభుత్వసంస్థలు బంద్ పెట్టుండ్రి.. మొత్తం ప్రైవేటువాళ్లకు ఇవ్వండి అని చెప్తున్నరు.

నేను సీఎం అయిన తర్వాత కరంట్ లేదు. పక్కన ఏపీ వాళ్లు మోదీని పట్టుకొని దాదాగిరీ చేసి ఏడు మండలాలను గుంజుకున్నరు. చీప్‌గ కరంట్ వచ్చే సీలేరు ప్లాంటును కూడా తీసుకున్నరు. సరే ఏదైతే అదైంది.. వచ్చిందేదోవచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌కెల్లయితే మనం బయటపడ్డమని చెప్పి.. కరంట్ ఉత్పత్తి చేసుకున్నం. దేశంలో పెద్దపెద్ద కుబేరులు వచ్చి మా మీద పడ్డరు. మీకియ్యను.. మా జెన్‌కోనే ఉత్పత్తి చేస్తదని చెప్పిన. ఎందుకు ఇయ్యవంటే.. లాభమొస్తది.. నీవైతే జేబుల్లో వేసుకొని పీకుతవు. మా ప్రభుత్వసంస్థకు లాభమొస్తే మా ప్రజలకు తక్కువ చార్జీలకు ఇస్త, మా ఉద్యోగులకు జీతాలిచ్చుకుంట, మా పిల్లలకు ఉద్యోగాలిచ్చుకుంట.. నీకిస్తే నాకొచ్చేదేముంది? చెప్పిన. కేంద్రంతోటి కూడా ఒత్తిడి చేయించినరు. దేశమంతా ఒకదిక్కు ఉంటే నీవొక దిక్కు ఉంటవా? అంటే.. నీవేం చేసుకుంటవో చేసుకో అని చెప్పిన.

ఇట్ల ఆరువేల మెగావాట్ల కరంట్‌ను జెన్‌కో ఉత్పత్తి చేస్తున్నది. అక్కడ 25వేల మంది ఎన్‌ఎమ్మార్‌లకు మొన్న ఉద్యోగాలు క్రమబద్ధీకరించినం. బ్రహ్మాండంగా జీతాలు పెంచినం. ఐఏఎస్ అధికారులు కూడా కరంటోళ్ల మీద అసూయపడతరు. వాళ్లకు జిల్లా కలెక్టర్ కంటే జీతాలెక్కువ. డీఈకి చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ జీతం. వాళ్లు కష్టం చేస్తరు.. డబ్బులొస్తున్నయి.. పంచుకుంటున్నరు. క్రమబద్ధీకరణ ఉన్న దగ్గర అట్ల ఉంటది. ఇదే పద్ధతిలో ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే ప్రయత్నంచేస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆర్టీసీని కూడా కాపాడాలని చూసినం. అధికారులందరినీ పిలిచి చెప్పినం. డబ్బులిచ్చినం. ప్రభుత్వపరంగా ఏం చేయాలో అది చేసినం. మీకు కూడా కొంత జీతాలు పెంచినం. మొన్న 16% రిలీఫ్ ఇచ్చినం. దాంతోటే మొత్తం స్వర్గం అయిపోయిందని చెప్పంగానీ కొంతవరకు చేసినం. కానీ మీరు ఇంకో దిక్కుపోయి గందరగోళం చేసినరు. మరి నాకు కోపంరాదా? నేను అంతమంచిగ కూర్చోబెట్టుకొని, డబ్బులు తీసుకోమని చెప్పి, బాగుపడమని చెప్తే మీరు తగదనిపోయి పంచాయితీలు పెట్టుకున్నరు. పెద్ద లొల్లి అయింది. మొన్న గా గతి వచ్చింది.

ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్

ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నేనే పనిచేస్తా. ఆర్టీసీ బస్సులో 100% సురక్షితమైన ప్రయాణం. అందులో ఎలాంటి అనుమానం లేదు. చాలా కేర్‌ఫుల్‌గా నడుపుతాం. ఇది అందరి అభిప్రాయం. దీనిని ప్రచారం చేయాలి. బోర్డు రాసుడే కాదు.. చెప్పాలి. నెలలో ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని, డ్రైవర్, కండక్టర్‌తో మాట్లాడాలని టీఆర్‌ఎస్‌లో ఉన్న ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేకు, ఎంపీకి చెప్తా.. రెండునెలలకు ఒకసారైనా డీఎంతో మీటింగ్ పెట్టండి.. కార్మికులుండే సమయంలో మాట్లాడండి అని చెప్తా. ఎక్కడికక్కడ శక్తి సమకూర్చుకోవాలి. రేపే వారికి ఆదేశం ఇస్తా.

ఆర్టీసీని అతిగా ప్రేమించేది నేనే

మొత్తం రాష్ట్రంలో ఆర్టీసీని అతిగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే అది నేనే. సంస్థ మునిగిపోవాలని అనుకుంట లేను. హైదరాబాద్ సిటీలో 3800 బస్సులు నడుపతారా? ఇవ్వాళ నేను పరేడ్‌గ్రౌండ్ నుంచి పోతుంటే 25 బస్సులు నిలబడి ఉన్నయి. ఒక్కో బస్సుల ఇద్దరుముగ్గురు కంటే ఎక్కువలేరు. అంతగా ఎందుకు నడపాలి? ఉదయం, సాయంత్రం ఎక్కువ అవసరం ఉంటది. హైదరాబాద్‌లో కిలోమీటరుకు రూ.16నష్టం. ముంబైలో కూడా లేవు 3800 బస్సులు. అధికారులు లెక్క చెప్పితే నేనే ఆశ్చర్యపోయిన. హైదరాబాద్‌లో వచ్చే నష్టం ఇతర అన్ని జిల్లాల్లో ఇచ్చే నష్టంతో పోలిస్తే 58% ఎక్కువ. ఎల్లమ్మ కూడబెట్టుకవస్తే మల్లమ్మ మాయం చేసినట్లు! మీ దగ్గరే మునుగుతున్నది ఆర్టీసీ అని అప్పట్లో హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్లకు చెప్తే.. వాళ్లు ఒక సంవత్సరం రూ.330 కోట్లు ఇచ్చిర్రు.

మళ్ల సంవత్సరం రూ.480 కోట్లు ఇవ్వాలని పెట్టిర్రు. రూట్లు ఎక్కడ నడిపించాలి? ఎక్కడ నడిపించవద్దనేది కండక్టర్లు, డ్రైవర్లను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించండి. ఎట్ల లాభం రాదో నేను చూస్తా. సమ్మె సమయంలో నా దగ్గరికి మెదక్ టౌన్ నుంచి వచ్చిర్రు. ఆర్టీసీలో తాత్కాలిక సిబ్బంది బస్సులనిండ నింపుకొని వస్తరని చెప్పిండ్రు. ఆ పని మనం కూడా చెయ్యాలె. బస్సులు ఖాళీ పెట్టుకొని పోవడం నేరం. 70% ఓఆర్‌ను 80% చేయాలి. ఆ పట్టుపట్టాలి. అది మీతోనే సాధ్యమయితది. మనిషి కనపడితే వస్తావా అని అడగాలి. ఆటోలతో పోటీ పడుతలేరు మీరు. ప్రయాణికులను సంపాదించుకోవడంలో పోటీపడాలి.

1469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles