ఆర్టీసీపై వరాల వర్షం

Mon,December 2, 2019 03:27 AM

-సెప్టెంబర్ నెల వేతనం నేడు చెల్లింపు
-సమ్మెకాలానికి వేతనం ఒకే దఫాలో ఇస్తాం
-సమ్మెకాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో
-ఒకరికి ఎనిమిది రోజుల్లోగా ఉద్యోగం ఇవ్వాలి
-మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా
-వచ్చే బడ్జెట్‌లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం
-ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏండ్లకు పెంపు
-ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత
-పీఎఫ్ బకాయిలు, సీసీఎస్‌కు డబ్బులు చెల్లిస్తాం
-ఒక్క బస్సు కూడా ప్రైవేటుకు ఇచ్చేదిలేదు: సీఎం కేసీఆర్
-వెయ్యి కోట్ల లాభాల్లోకి సంస్థ ఎదగాలి
-ప్రగతిచక్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం
-మీ వెంట తానుంటానని ఉద్యోగులకు భరోసా
-బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని వ్యాఖ్య
-భోజనం పెట్టి.. బాగోగులు తెలుసుకున్న సీఎం
-అనంతరం జనహితలో కార్మికులతో భేటీ
-కార్మికుల చప్పట్లతో మార్మోగిన జనహిత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ ఉద్యోగులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాలవర్షం కురిపించారు. ఉద్యోగాలకు ఎలాంటి ఢోకాలేదంటూ భరోసానిచ్చారు. సెప్టెంబర్ వేతనాన్ని సోమవారం ఇస్తామని ప్రకటించారు. సమ్మెకాలానికి కూడా వేతనాలను తర్వాతి రోజుల్లో ఒకేదఫాలో ఇస్తామని తెలిపారు. సమ్మెకాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతోపాటు, ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రిటైర్మెంట్ వయస్సును 60 ఏండ్లకు పెంచుతామని చెప్పారు. మహిళలకు రాత్రి డ్యూటీలు రద్దుచేస్తున్నట్టు చెప్పిన సీఎం.. వారికి ప్రసూతి సెలవుతోపాటు చైల్డ్‌కేర్ లీవ్ ఇస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్ నుంచి ఆర్టీసీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ స్థితిగతులపై, దాని పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఆర్టీసీ డిపో నుంచి ఐదుగురు చొప్పున ఉద్యోగులతో జనహితలో సమావేశం అవుతానని ఇటీవల ప్రకటించిన సీఎం.. ఆ మేరకు ఆదివారం వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉద్యోగులను ప్రగతిభవన్‌కు పిలిపించి.. వారితోకలిసి భోజనంచేశారు.
CMKCR1
అంతకుముందు, భోజనం చేస్తున్న సమయంలో కార్మికుల వద్దకు వెళ్లి వారి కష్టాలు, ఇబ్బందులు విన్నారు. అప్పటికే ఆర్టీసీ క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులు ఇచ్చిన నివేదికలను అధ్యయనంచేసిన సీఎం.. భోజనం అనంతరం జనహితలో ఏర్పాటుచేసిన సమావేశంలో రెండుగంటలపాటు ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక జీతాలు పొందుతున్న ఆర్టీసీ తెలంగాణలోనే ఉన్నదని అంతా చెప్పుకోవాలని ఆకాంక్షించారు. మీ వెనుక తానుంటానంటూ భరోసానిచ్చారు. రెండేండ్లపాటు ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఉండవని చెప్పారు. ఆర్టీసీ రాత మార్చాలని, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. నాలుగు నెలల తర్వాత మరోసారి ఇక్కడే సమావేశమవుదామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ఐదేండ్లలో 5వేల కోట్లు ఇచ్చినం

నేను ఎన్కట రవాణామంత్రిగ మూడేండ్లు పనిచేసిన. నష్టంలో ఉన్న సంస్థను కష్టపడి రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చిన. తర్వాత ఉద్యమంలోకి పోయిన.. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం అయిన. మీరే గెలిపించినరు. నాకు ఆ పాత ప్రేమ కారిపోయింది కదా ఆర్టీసీ మీద.. డీఎంలు, ఆర్‌ఎంలను పిలిచి పొద్దుగాల మొదలుపెడితే సాయంత్రందాకా మీటింగుపెట్టి ఎట్లయినా సంస్థను కాపాడాలని చెప్పిన. నాకు ఇష్టమున్న సంస్థ అని చెప్పిన. డబ్బులిచ్చినం. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు అప్పటి ప్రభుత్వం ఐదేండ్లలో ఆర్టీసీకి రూ.732 కోట్లు ఇస్తే.. పోయిన ఐదేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.5వేల కోట్లిచ్చింది. ఇది లెక్క. అబద్ధాలు చెప్పేదికాదు. ప్రేమకొద్దీ.. సంస్థ మంచిగుండాలి, ముందుపడాలి, పెరుగాలని ఇచ్చినం.

మృతుల కుటుంబాల్లో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం

కొందరు కార్మికులు చనిపోయారు. చాలా బాధాకరం. అలా జరుగాల్సింది కాదు. మంత్రికి, ఎండీకి విజ్ఞప్తిచేస్తున్నా. ఎనిమిది రోజుల్లో వాళ్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. దరఖాస్తులు, దండాలు పెట్టుడూ.. లంచాలు.. ఇవన్నీ దరిద్రాలు ఉండద్దు. ఎనిమిదోనాడు ఫోన్‌చేసి ఏ డిపోవాళ్లను అడిగినా డ్యూటీ ఎక్కినట్లు చెప్పాలి. ప్రభుత్వపరంగా కుటుంబానికి రెండులక్షల ఎక్స్‌గ్రేషియా ఇద్దాం. సంస్థపరంగా ఏమివ్వగలరో చూద్దాం.

రోజుకు ఇంకొక్క కోటి సంపాదించలేరా?

ఆర్టీసీని బతికిద్దామా.. చంపుదామా? మనం అనుకుంటే లాభంలోకి తీసుకురాలేమా! రోజు కు పదిన్నరకోట్లు సంపాదిస్తరు.. ఇంకొక్క కోటి సంపాదిస్తే ఏడాదికి రూ.365 కోట్లు అదనంగా వస్తయి. పంచుకొని మనమే తింటం కదా! కరంట్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ జీతం వస్తది. తెలివి ఉంటే మనకు సాధ్యంకాదా? మీరు నావెంట ఉంటే వందశాతం అయితది. రాదన్న తెలంగాణ రాలేదా.. గట్టిగ మొండిపట్టు పడితే! చావుదాకా పోయినగానీ వదలిపెట్టలేదు. ఒక దశలో మీరూ చేయికలిపారు. అంత గొట్టుపని అయింది.. సంస్థను లాభాల బాట పట్టించడం కష్టమా? కష్టంచేసేవారి చేతిలోనే లక్ష్మి ఉంటది. మీకు జీతాలు తక్కువ ఉండుడేంది? క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఆరునెలల్లోనే సంస్థను మార్చుదాం. ఇక నేనే సూపర్‌వైజర్‌గా ఉంటా. ఈరోజు వచ్చిన వాళ్లతోనే మళ్లీ నాలుగు నెలల తర్వాత సమావేశం ఏర్పాటుచేస్తం. ఈ నాలుగు నెలల్లో ఏమన్న చేసినమా, చేయలేదా! ఇక చూపెడుదాం తమాషా. ఎలా సాధ్యంకాదో చూద్దాం. మీ వెంట సీఎం ఉన్నాక ఎందుకు మార్పురాదు? దాని కత ఏందో చూస్తాను. ఇండియాలో బెస్ట్ ఆర్టీసీ ఎక్కడుంది అంటే తెలంగాణ వైపు చూపాలి. అంతా కష్టపడి సంస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషిచేయాలి.
CMKCR2

మహిళా సిబ్బంది సంక్షేమకోసం కమిటీలు

మహిళా సిబ్బంది సంక్షేమానికి కార్పొరేట్ లెవల్, రీజియన్, డిపోలవారీగా కమిటీలు వేసుకుందం. మహిళా అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి. ఆర్టీసీ వెయ్యికోట్ల లాభంలో ఉన్నప్పుడు దావత్ చేసుకుందం. నేను కూడా ఆరోజు సీటీ (విజిల్) కొడుత. అది మనం సాధించిన విజయం కిందికి వస్తది! డిపో మేనేజర్లు కార్మికులతో వనభోజనాలకు వెళ్లాలి. సంతోషంగా కలిసి ఉండాలి. మీరు గొప్ప సైన్యం. సంఘటిత శక్తి. మీరు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యం బాగుంటేనే కదా పనిచేసేది. ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వైద్యసౌకర్యం కల్పించాలి. కావాలంటే రూ.100 కోట్లు ఎక్కువ ఇస్తాం. కార్మికుడు టెన్షన్‌లో లేకుండా సంతోషంగా పనిచేసే వాతావరణం నెలకొల్పండి. అందరు తార్నాక హాస్పిటల్‌కు రావాల్సిన అవసరం లేకుండా రీజినల్‌స్థాయిలో సౌకర్యం ఏర్పాటుచేయండి. దవాఖానలను ఎంపికచేయండి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పెడుతారా.. ఆలోచించండి. 10-15 రోజుల్లోనే స్కీమ్ తయారుచేయండి. నా పరంగా చేయాల్సినవి అన్ని చేస్తున్న. మనకు పోటీ ఎవరూలేరు. అలాగని సమ్మె చేస్తామంటే మంచిగ ఉండదు. జన్మలో సమ్మె చేయకూడదు. మనకు అన్నంపెట్టేవాళ్లు ప్రజలు. వాళ్లకు ఇబ్బంది రానివ్వొద్దు. సీఎం నుంచి కండక్టర్, అటెండర్‌దాకా ప్రజాసేవకులం. వారికి నష్టంచేయవద్దు. పండుగలప్పుడు, పరీక్షలున్నప్పుడు వారిని ఇబ్బందిపెట్టొద్దు. అది దుర్మార్గం.

కనీస టిక్కెట్టు పది రూపాయలు..

టికెట్ ధర పెరుగుతున్నది కదా.. బేస్ టిక్కెట్టు ధర రూ.8 అయితాంది.. చిల్లరలేదని ప్రజలు కండక్టర్లను తిడుతరు సార్.. దానిని పది రూపాయలు చేయండి అని అధికారులు అడిగిర్రు. మీరు మమ్ముల్ని ప్రజలతో తిట్టిపిచ్చేటట్టు ఉన్నరు కదా.. తిడితే తిట్టురు ఏం చేస్తాం.. పది చేయండి అని చెప్పా. ఆ పైసలు ఆర్టీసీకి వస్తున్నాయి కదా! ఇప్పటిదాకా యూనియన్ కల్చర్ ఉన్నది. మంచోచెడో జరిగింది. ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు వేసుకుంటున్నం. ప్రతి డిపోకు ఇద్దరు ఉంటరు. రాష్ట్రస్థాయిలో ఒక ఉద్యోగి ఉంటరు. చీటికిమాటికి సస్పెన్షన్లు, డిపో స్పేర్లు ఉండవు. ఇంక్రిమెంట్లు ఆపేయవద్దు. ఇంక సమస్యలు ఏం వస్తాయి! అందరం సంతోషంగా పనిచేస్తాం. మాకు ఇబ్బందులు లేవు అనే వాతావరణం వస్తే అయిపాయే.

ఐదువేల పర్మిట్లు ఇస్తే మీ గతేంది?

నేను ఓ ఐదు నిమిషాలు ఇటుగాకుండా అటు నిర్ణయం తీసుకుంటే మీది ఘోరమైన గతి ఉండేది. అట్లవద్దని.. మంత్రులు, ఉన్నతాధికారులను ఏం చేద్దాం? అని అడిగిన. మిమ్మల్ని కొట్టే హక్కులేదు.. చంపే హక్కులేదు. సింపుల్‌గ ఐదువేల పర్మిట్లు ఇస్తే సరిపాయె! మీరేమో యూనియన్ల పేరు పెట్టుకొని మేం గింతే నడుపుతం.. గంతే నడుపుతం.. ఇప్పుడే బంజేస్తం అన్నరు. కానీ ప్రైవేటోడు అట్లకాదు. మీరు 300 బస్సులు నడుపుతమంటే వాడు 400 నడుపుతడు. సంపాదించుకోవాలనే ఆర్తి ఉంటది కదా! వాని 5వేల బస్సులు మీ 8వేల బస్సుల సమానం తిప్పుతడు. మన బస్సు ముందే ప్రైవేటు బస్సు పెడుతరు. ఎవరు ఆపుతరు? అనుమతి తీసుకునే నడుపుతరు! ఇలా అయితే ఉంటదా ఆర్టీసీ? ప్రైవేటుకు ఇవ్వాలని కేంద్రం కానూన్ చేసింది. దేశం మొత్తం అమలుచేస్తున్నరు. నాకు మనసు ఒప్పుతలేదు. ఏం చేయాలి? నా జేబుల లేదు. ఫైనల్‌గా ప్రజలకు రవాణాసౌకర్యం ఉండాలికదా! సమ్మెలు ఏంటని ప్రజలు అడుగరా! ప్రభుత్వం అంటే ఎన్నో వింగ్స్ ఉంటయి. అందర్నీ చూడాలి. ఇల్లు నడుపుడు ఎట్లనో ప్రభుత్వం నడుపుడు గట్లనే ఉంటది. నేను మొండి ఎక్కువ. అందుకే అందరినీ పిలిచి మాట్లాడుదామని అనుకున్నా. ఆఫీసర్లను అడిగితే ఒక్క అవకాశం ఇవ్వండి.. ఇంకోసారి జరుగనివ్వం.. కార్మికులతో మాట్లాడుతం అన్నరు. ఎవరూ వద్దు నేనే మాట్లాడుతా అని ఈ కార్యక్రమం ఏర్పాటుచేసిన.

సిబ్బంది తల్లిదండ్రులకు బస్‌పాసులు

సిబ్బంది తల్లిదండ్రులకు కూడా బస్‌పాసులు ఇవ్వండి. గతంలో ఉన్నది. తిరిగి ఇవ్వండి. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్దగా జీతాల్లేవు. అందుకే ఇవన్నీ చేస్తున్నా. సంస్థ లాభాల్లోకి వచ్చే దాకా ప్రభుత్వపరంగా సపోర్ట్‌చేస్త. మీరు చేయాల్సిందల్లా సంస్థను లాభాల్లోకి తేవటమే. తార్నాక దవాఖానలో చాలినన్ని మందులు పెట్టండి. బయట కొనుక్కో అని తిప్పవద్దు. ఎండీలు, ఈడీలు వెంటనే సమీక్షించి.. అవసరమైన ముందులు ఉన్నయా లేవా! చూడండి. మందులు పెట్టండి. దీనిని కూడా డిమాండ్ చేయాల్నా? ఈ ముచ్చట మళ్లీ వినపడొద్దు. సంస్థలో 10వేల మంది ఉద్యోగులు పెరగాలి.

చీకటినుంచి వెలుగులదాకా రాష్ట్ర ప్రస్థానం

చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నం. సమస్యలు చాలా ఉండేవి. ఒక్కొక్కటీ చేసుకుంటూపోతున్నం. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లానుంచే 25 లక్షలమంది వలసపోయేవారు. కారుచీకటి. ఆదాయం, ఖర్చు లెక్కలేదు. ప్లాన్‌పై అవగాహన లేదు. పక్కరాష్ట్రమోళ్ల చికాకులు! కష్ట సమయంలో ప్రయాణం ప్రారంభించినం. అనేక నిద్రలేని రాత్రులు గడిపినం. భగవంతుడి దయవల్ల మంచి ఆదాయం వచ్చింది. పేదోళ్లను ఆదుకున్నం. ఉద్యోగస్థుల జీతాలు కొంత పెంచుకున్నం. భయంకరంగా ఉండిన కరంట్ సమస్యను తీర్చుకున్నం. మంచినీళ్ల సమస్య కూడా 99% పరిష్కరించుకున్నం. ఆడబిడ్డ బిందె పట్టుకుని రాష్ట్రంలో బజార్ల కనిపించని పరిస్థితి వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వాళ్లను ఆదుకున్నం. రైతులను కొంత ఆదుకున్నం. గతంల ముసలోళ్లు చూసెటోళ్లులేక చెర్లల్ల, బాయిలల్ల పడి చచ్చిపోయేటోళ్లు. వాళ్లకు మొన్నటిదాకా వెయ్యి, తర్వాత రెండువేల పింఛను ఇస్తున్నం. ఎవ్వరి అవసరం లేకుండా వాళ్ల బతుకు వాళ్లు బతుకుతున్నరు. అదో తృప్తి ఉన్నది.

పార్సిల్ సర్వీసులు ఎందుకు పెట్టలే?

పార్శిల్ సర్వీసులతో ప్రైవేటోడు అడ్డగోలు డబ్బులు సంపాయిస్తుండు. మరి మీరు ఎందుకు పెట్టరు? మనం రోజూ ప్రతి పల్లెకు పోతం. మనం పోని ఊరు ఉంటదా? గతంలోనే పార్సిల్ సర్వీసులు పెట్టండని చెప్తే పెట్టలేదు. కానీ పంచాయితీలు, జిందాబాద్‌లు, ముర్దాబాద్‌లు. ఎల్లయ్యకు ఎడ్లులేవు.. మల్లయ్యకు బండ్లులేవు.. వట్టిదే బొబ్బ. మొత్తం మీద మొన్న గొంతు కోసుకునేకాడికి వచ్చింది. ఎందుకీ పరిస్థితి?

జై కేసీఆర్..

-మార్మోగిన నినాదాలు సంబురాల్లో ఆర్టీసీ ఉద్యోగులు
-డిపోల వద్ద పండుగ వాతావరణం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలజల్లు కురిపించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సీఎంతో ఆత్మీయ సమావేశం అనంతరం ప్రగతిభవన్ నుంచి వెలుపలికి వచ్చిన ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలుచేశారు. తమ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని, సమ్మెచేసి ఇబ్బంది కలిగించినప్పటికీ తమపై వరాలు కురిపించారని హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. పటాకులు కాల్చి.. జై కేసీఆర్ అంటూ నినాదాలుచేశారు. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుంటూ స్వీట్లు తినిపించుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉద్యోగులను పిలిపించి మాట్లాడలేదని, కలిసి భోజనంచేసిన దాఖలు లేవని కార్మికులు అన్నారు. ఇక తమ ఉద్యోగాలకు భరోసా కలిగిందని, సీఎం కేసీఆర్ సూచించినట్టు క్రమశిక్షణతో పనిచేసి సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, యూనియన్లతో అవసరం లేదని.. తమ నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టంచేశారు.

నాటి అర్ధాయుష్షు రాక్షసులే..

ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్ళు ఉంటారని చెప్తూ.. రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించారు. యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు.. కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అన్నాడంట. అలా పుట్టిన వారే ఇప్పుడు మనుషులను పీక్కుతింటున్నారు. వారు మనలానే కనిపిస్తారు కానీ.. వారి ఆలోచనలు వేరేవిధంగా ఉంటాయి. అటువంటివారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరు అని ముఖ్యమంత్రి అనడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

మహిళా ఉద్యోగులకు..

-రాత్రి 8 గంటల్లోపు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు
-ప్రతి డిపోలో 20 రోజుల్లో ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్‌రూమ్స్, లంచ్‌రూమ్స్
-ప్రసూతి సెలవులతోపాటు, మూడునెలలపాటు చైల్డ్‌కేర్ లీవ్
-ఖాకీ డ్రెస్ నిబంధన తొలిగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫాం
-పురుష ఉద్యోగులు కూడా వేరే రంగు యూనిఫాం వేసుకునే అవకాశం
-మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ

lady-conductor
మహిళా ఉద్యోగుల్లో (మహిళా కండక్టర్లనుద్దేశించి) మన బిడ్డలను చూసుకోవాలి. వారికి రాత్రివేళల్లో డ్యూటీలు వేయవద్దు. రాత్రి 7.30-8 గంటకల్లా డ్యూటీ దిగేటట్టు పెట్టాలి. ఆర్టీసీని ఎవరో వచ్చి బాగుచేయరు. ఎవరికి వారే బాగుచేసుకోవాలి. సంస్థలో పనిచేస్తున్న అందరిలో మార్పురావాలి. డిపో మేనేజర్లది పెద్దపాత్ర. అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి. అందరిలో కమిట్‌మెంట్ రావాలి. నేను గ్యారంటీ ఇస్తున్న. ఒక్క కార్మికుడిని కూడా తీసివేయం. కలర్‌ైబ్లెండ్‌నెస్ ఉన్న వారిని కూడా తీసివేయం. నిష్పక్షపాతంగా డ్యూటీలు వేయాలి.

సెప్టెంబర్ వేతనం నేడు

మీరు ఇక్కడికి వచ్చారు.. సీఎం ఏం ఇచ్చారని తోటి కార్మికులు అడుగుతరు. మీరుపోయి చెప్పాలె. మీరు సమ్మెచేశారు. లక్షల జీతాల్లేవు. సర్వీస్ చివర ఉన్నవాళ్లకు కొంచెం మంచిజీతాలు, మిగిలినోళ్లందరికీ 20 వేలు, 30 వేలు ఉంటయి. సెప్టెంబర్ జీతాలు రేపు (సోమవారం) ఉదయం ఇస్తం. (చప్పట్లు, విజిల్స్). 55 రోజుల సమ్మె జీతం కూడా నేనే ఇప్పిస్త. (చప్పట్లు.. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు). ఇంట్ల ఎవరైన తప్పుచేస్తే ఇంటిపెద్దకే కదా బాధ! ఏదన్న చేసి మీ వాటా నింపుత. ఒకనెల వెనుకముందు వస్తయి. మీ రెండునెలల జీతం నా దగ్గర బ్యాంకుల ఉన్నట్లే. ఆ మొత్తం ఒకేసారి ఇచ్చే ఏర్పాటుచేస్తం. ఖర్చు పెట్టుకోకుండా కాపాడుకోండి. దేనికన్న ఉపయోగపడుతది. మీ ఇంక్రిమెంట్ కూడా పోదు. ఏం ఇచ్చారు ముఖ్యమంత్రి? అని అడిగితే.. ఇవన్నీ ఇచ్చారని మీరు చెప్పాలె. ఉన్నయి మీరు పోగొడితే.. మేం పట్టుకొచ్చినమని చెప్పాలె. వాళ్లకుకూడా ఇస్తున్నం. వాళ్లు కూడా బంతిల ఉన్నరు కదా!

పదవీ విరమణ 60 ఏండ్లకు పెంపు

కొత్త ఉద్దేశం, కొత్త ఉద్వేగంతో, ఫ్రెష్‌మైండ్‌తో పోవాలి. బాగుపడే ఆర్టీసీ.. బతికే ఆర్టీసీ.. భద్రత కూడుకున్న ఆర్టీసీ ఉండాలి. మనం బతకాలి.. ప్రజల్ని బతికివ్వాలి. పట్టుబడితే, జట్టుకడితే వందశాతం ఫలితం వస్తది. టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీ అని పిలవాలి. కార్మికులని పిలవొద్దు. అనుభవమున్న అధికారులు అవసరం పడుతరని ఎన్నికల్లో ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చాం. ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసును కూడా 58 ఏండ్లున్నది.. 60 ఏండ్లు చేసుకుందం. (ఈ సమయంలో ఉద్యోగులంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయడంతో.. సీఎం నవ్వుతూ..) జర్రంత సంతోషంకాంగానే పొంగిపోవుడు.. కేసీఆర్ బొమ్మ పెట్టి పాలుపోసుడు.. జర్ర ఎటమటం కాంగానే తిట్టుడు! మనం గొప్ప విజయం సాధించాలి. గొప్ప కార్యక్రమం చేయాలి. అనుకున్నకాడికి చేరాలి. మార్పును అంగీకరించే దిశలో ఉండాలి. తొందరగా ఉబ్బిపోవద్దు. కష్టం వస్తే కుంగిపోవద్దు. బెస్ట్ ఆర్టీసీ మనది. కష్టసుఖాల్లో ఒకే తరీఖన ఉండాలి. (నవ్వుతూ) నేను మాట్లాడితే సీఎం లెక్క అనిపిస్తలేదు కదా! ఉద్యమంలో ఉపన్యాసమే నాకు ఇష్టం ఉండే. ఇప్పుడు మాట్లాడుదామంటే వెనకముందు చూసుకోవాలి..ఎటన్న పోదామంటే పోలీసాయన పంచాయతీ.. ఎటుపడితే అటు పోరాదు.. బట్ట కొనుక్కొరాదు.. ఎంత గందరగోళం! బయటకి బాగానే కనపడుతది కానీ లోపల సక్కదనం ఉండదు. మీరు ఆత్మీయులు వచ్చిన్రని మాట్లాడుతున్న.

వెయ్యి కోట్ల లాభాల్లోకి వస్తే నా జన్మధన్యమైనట్లే

కార్మికులను స్పేర్ పెట్టుడు ఉండదు. టెన్షన్ లేదు. గంట ఎక్కువ పనిచేద్దాం. చెడిపోయిన 500-600 బస్సులను పార్సిల్ సర్వీసుకు పెట్టండి. అట్ల కూడా డబ్బులు వస్తాయి. కలర్‌ైబ్లెండ్ ఉద్యోగులను, ఆరోగ్యం బాగాలేనివాళ్లను అందులో పెట్టండి. కుటుంబంలాగా అందరం కలిసి పనిచేస్తే ఆర్టీసీ ఏడాది.. ఏడాదిన్నరలో వెయ్యి కోట్లకుపైగా లాభంలోకి వస్తది. ఏటా కార్మికునికి లక్ష బోనస్ వస్తది. ఆ ఆర్టీసీ కావాలి నాకు. మీరు అదిచేసి చూపించండి.. నా జన్మధన్యమైనట్లే. అద్భుతంగా.. అందరు నవ్వుకుంట పనిజరుగాలి. సంతోషంగా ఉండాలి. అదీ నాకు గొప్ప. అదీ గర్వం నాకు. అందరికన్న ముందు అధికారులు మారాలి. యాజమాన్యం- కార్మికులు అనే విభజన రేఖ చేరిపేయాలి. ఇక్రిశాట్ క్యాంటీన్‌లో ఆ సంస్థ ఎండీ నుంచి అటెండర్ దాకా అందరు ఒకే దగ్గర కూర్చొని తింటరు.

ఆ తర్వాత ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లి ఎవరి పని వారు చేసుకుంటరు. అటువంటి కల్చర్ ఆర్టీసీలో రావాలి. అందరూ ఒకే కుటుంబమనే భావన రావాలి. ఉజ్వలమైన.. బ్రహ్మాండమైన ఆర్టీసీ కావాలి. బ్రహ్మాండంగా సంపాదించాలి. పదిమంది మెచ్చే బతుకు బతకాలి కానీ.. పదిమంది తిట్టే బతుకు బతుకతరా? సచ్చినా సరే ఒక్క ప్రైవేటు బస్సుకు పర్మిషన్ ఇయ్యం. కానీ మీరు పనిచేయాలి. నా మాట మీరు పొడగొట్టొద్దు. పది రూపాయలు పోయినా మా ఆర్టీసీ బస్సు మాకు ఉన్నదని ప్రజలు చెప్పుకొనే పరిస్థితి తీసుకురావాలి. ప్రైవేటువారిని రానివ్వం. నాకు కావాల్సిందల్లా బ్రహ్మాండంగా బస్సు నడపాలి. మీరు సంపాదించాలి. నెలనెలకు మార్పు రావాలి. సర్‌ప్లస్‌కు రావాలి.

ఉద్యోగుల కోసం..

-ఆర్టీసీలో కార్మికులుండరు.. అంతా ఉద్యోగులే
-రెండేండ్లపాటు గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఉండవు
-ప్రతి డిపోలో ఇద్దరు ఉద్యోగులతో కార్మిక సంక్షేమబోర్డు
-తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం
-టికెట్ బాధ్యత ప్రయాణికుడిదే.. కండక్టర్లపై చర్యలుండవు
-యథావిధిగా ఇంక్రిమెంట్


కుటుంబాలకు..

-ఉద్యోగుల తల్లిదండ్రులకు హెల్త్ సర్వీసులు
-ప్రతి డిస్పెన్సరీలో ఉచితంగా మందుల పంపిణీ
-తల్లిదండ్రులకు ఉచిత బస్‌పాసులు.. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్
-ఉద్యోగుల గృహనిర్మాణ పథకానికి రూపకల్పన

4875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles