గుణాత్మక పాలనకు త్రివిధానాలు

Thu,July 11, 2019 02:55 AM

-ప్రజల సమస్యలకు ఉపశమనం లభించేలా రూరల్ పాలసీ
-లంచాలు ఇచ్చే అవసరం లేకుండా రెవెన్యూ పాలసీ
-అవినీతికి ఆస్కారం లేకుండా అర్బన్ పాలసీ
-వీటిని పటిష్ఠంగా అమలుపర్చాలి: సీఎం కేసీఆర్
-నూతన మున్సిపల్ చట్టంపై కమిషనర్లకు శిక్షణ కార్యక్రమం
-ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో గుణాత్మక పాలన తీసుకురావాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు త్రివిధానాలు అనుసరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రూరల్ పాలసీ, తెలంగాణ అర్బన్ పాలసీ, తెలంగాణ రెవెన్యూ పాలసీ అనే మూడు విధానాలను పటిష్ఠంగా అమలుపరచడంద్వారా రాష్ట్రంలో గుణాత్మక పాలన అందించగలమని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలనుంచి ఉపశమనం లభించేరీతిలో రూరల్‌పాలసీ, లంచాలు ఇచ్చే అవసరం ఎంతమాత్రం రాకుండా ఉండేలా రెవెన్యూవిధానం, జీరోస్థాయికి అవినీతి చేరుకునేలా అర్బన్‌విధానం ఉండాలన్నారు. నూతన మున్సిపల్ చట్టంపై కమిషనర్లకు శిక్షణ నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు.

రూపుదిద్దుకుంటున్న నూతన పురపాలక చట్టం పురోగతిపై, అందులో చేర్చాల్సిన అంశాలపై, చట్టంలో ప్రజాప్రతినిధుల బాధ్యతలు ఎలా ఉండాలన్న అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సాధనలో స్థిరమైన ప్రయాణం చేశాం. అనుకున్నది సాధించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలుచేశాం. అన్నింటికన్నా పెద్ద సమస్యలైన మంచినీరు, సాగునీటి సమస్యలను అధిగమించాం. ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమంపట్ల దృష్టిసారించాం. ఈ నేపథ్యంలో కచ్చితంగా గ్రామాల పరిస్థితి బాగుపడాలి అనుకున్నాం. పటిష్ఠమైన చట్టం తెచ్చాం. గ్రామాల అభివృద్ధి కొనసాగుతున్నది. గ్రామాల్లో మూడునెలల్లో మార్పు చూడబోతున్నాం. అటు గ్రామీణ తెలంగాణలో ఎన్నికల్లో పోరాడి గెలిచాం. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి దీవించారు. అన్నిరకాల సంక్షేమం చేపట్టాం. ఇంకా వాళ్ల రుణం తీర్చుకోవడానికి గుణాత్మకమైన మార్పుతేవాలని ప్రభుత్వం సంకల్పించింది. చేతనైనంత మార్పు తెస్తాం.

ప్రతిపనికి ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి మేం శ్రీకారం చుడుతున్నాం. అవినీతిని అరికట్టేదిశగా తెలంగాణ నూతన పురపాలకచట్టం రావాలి. ఈసారి ప్రభుత్వంనుంచి ప్రజలు ఆశించేది ఉత్తమ విధానాలు, అభ్యాసాలు. ఉత్తమ విధానాలవల్ల ప్రజలు బాగుపడాలి. ప్రజలకు సేవచేసే ఉద్దేశంతోనే, ఆ స్ఫూర్తితోనే నూతన మున్సిపల్ చట్టం ఉండాలి. ప్రజల అవసరాలను తీర్చేలా, వారి బాగోగులు చూసుకునే రీతిలో, పట్టణాల అభివృద్ధి చక్కగా జరిగే పద్ధతిలో కఠినమైన మున్సిపల్ చట్టం రావాలి. చట్టం రూపకల్పన ఆషామాషీగా జరుగకూడదు అని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, పురపాలకశాఖ కమిషనర్ శ్రీదేవి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, పురపాలకశాఖ మాజీ అధికారి డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

2971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles