పల్లె పల్లెనా ప్రగతి సంబురం

Sun,September 15, 2019 03:21 AM

-పాలనాధికారుల పల్లెబాట
-వీధుల్లో కలియతిరిగిన కలెక్టర్లు, అధికారులు
-మెజార్టీ పంచాయతీల్లో మురుగు కాల్వలు శుభ్రం
-శ్రమదానాల కోసం ఒక్కటవుతున్న పల్లెలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పల్లెల్లో ప్రగతి సంబురం నెలకొన్నది. గ్రామ పంచాయతీల్లో ప్రగతి ప్రణాళిక దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం తొమ్మిదోరోజు గ్రామసీమల అభివృద్ధికి పల్లెలన్నీ కదిలాయి. మెజారిటీ పంచాయతీల్లో మురుగు కాల్వలన్నీ శుభ్రమయ్యాయి. శ్రమదానాలతో ముళ్లపొదలు తొలగిపోతున్నాయి. శనివారం అసెంబ్లీ ఉండటంతో.. ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లలేకపోయారు. దీంతో జిల్లా కలెక్టర్లు వీధుల బాటపట్టారు. రాజన్న సిరిసిల్లలో మహిళలు ఇండ్ల ముందు ముగ్గులు వేసి అధికారులకు స్వాగతం పలికారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలించి హరితహారం మొక్కలు నాటారు. నిజామాబాద్ కలెక్టర్ రామ్మోహన్‌రావు జిల్లాకేంద్రంలోని వీధుల్లో పరిసరాల పరిశుభ్రత పనులను పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆర్టీసీ డిపో ఆవరణలో కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అధికారులతో కలిసి శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. మెదక్ జిల్లాలో కలెక్టర్ ధర్మారెడ్డి వీధుల్లో పర్యటించి, మురుగునీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

pp4
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు వాంకిడి మండలం బెండార గ్రామంలో పనులను పరిశీలించి, గ్రామాభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు. హరితహారం మొక్కలను నాటారు. మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం ముత్యంపేటలో పర్యటించిన కలెక్టర్ భారతి హోళికెరి.. హరితహారం మొక్కలను పశువులు మేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులను సైతం హెచ్చరించారు. అనంతరం మందమర్రి మండలం అందుగులలో మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మోహన్‌గూడలో జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ శ్రమదానం నిర్వహించారు. నారాయణపేట జిల్లా మరికల్‌లో కలెక్టర్ వెంకట్రావు చెత్త, ముళ్లపొదలను తొలగించారు. జిల్లాలో 30 రోజుల ప్రణాళికను నిర్లక్ష్యం చేసిన నలుగురు వీఆర్వోలను సస్పెండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల ముల్కనూర్‌లో పర్యటించిన కలెక్టర్ శివ లింగయ్య.. పరిశుభత్ర పనులను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మునగాల మండలంలో 30 రోజుల ప్రణాళిక అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శికి నోటీసులిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 30 రోజుల ప్రణాళిక అమలుపై కలెక్టర్ అనితా రామచంద్రన్ సమీక్షించారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రతలో ప్రతి ఒక్కరిని భాగస్వాములనుచేయాలని పిలుపునిచ్చారు.

pp5

మురుగు తొలగి మెరుగులు

పల్లె ప్రగతిలో భాగంగా చాలాగ్రామాల్లో కంపు కొట్టే మురుగు కాల్వలన్నీ శుభ్రంగా మారుతున్నాయి. మురుగు తొలగిపోయి మెరుగులు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేస్తుండటం, పల్లె ప్రగతి ప్రణాళిక అమలుతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తమ గ్రామాల్లో శ్రమదానం చేస్తున్నాయి. కొన్నిచోట్ల దెబ్బతిన్న కాల్వలకు పంచాయతీ సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. రోడ్లపైకి నీటిని వదిలే ఇండ్ల యజమానులకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. మరోవైపు పల్లె ప్రగతి నివేదికలను రాష్ట్రస్థాయిలో అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

pp3

ములుగులో పరిశుభ్రత వెలుగులు

-3,642 ప్రాంతాల్లో పిచ్చిమొక్కల తొలగింపు
-272 పాడుబడిన బావుల పూడ్చివేత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పల్లె ప్రగతి కార్యక్రమంతో ములుగు జిల్లాలో వెలుగులు నిండుతున్నాయి. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అధికారులతో కలిసి పరిసరాలను శుభ్రం చేసుకుంటున్నారు. జిల్లాలోని 9 మండలాల్లో ఉన్న 174 గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. అధికారులతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి గ్రామాల్లోనే బస చేస్తున్నారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్‌తో కలిసి నారాయణరెడ్డి శనివారం 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లి జూకారంలో నిర్వహించిన శ్రమదానంలో పాల్గొన్నారు. పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇందులోభాగంగా అన్ని గ్రామాల ప్రజలు నిత్యం రెండుగంటలు శ్రమదానం చేస్తున్నారు. జిల్లాలో 4,528 ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మలను గుర్తించిన అధికారు లు.. ప్రజలతో కలిసి ఇప్పటివరకు 3,642 ప్రాంతాల్లో వాటిని తొలగించారు. జిల్లాలో 906 శిథిలాలను గుర్తించి 722 శిథిలాలను తొలగించగా, 340 పాడుబడిన బావులకుగాను 272 బావులను పూడ్చివేశారు.

pp2
జిల్లాలో 108 పనికిరాని బోరు బావులను గుర్తించి.. వాటి లో 78 పూడ్చివేశారు. 633 పల్లపు ప్రాంతాలను గుర్తించి.. 471 ప్రాంతాలను చదునుచేశారు. హరితహారంలో భాగంగా 174 గ్రామాల్లో నర్సరీలను నిర్వహిస్తున్నారు. హరితహారంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 27,89, 033 మొక్కలను నాటారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దవాఖానలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఇలా 886 ప్రభుత్వ స్థలాలను గుర్తించిన అధికారులు.. వీటిలో 465 స్థలాలను శుభ్రపరిచారు. మొత్తం 22 మార్కెట్ ప్రాంతాలకుగాను 13 స్థలాలను శుభ్రంచేశారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామాల కోసం 121 స్థలాలను గుర్తించి.. ఇప్పటివరకు 12 చోట్ల నిర్మించారు. జిల్లాలో 121 చోట్ల డంపింగ్ యార్డుల కోసం స్థలాలను గుర్తించి, 26 చోట్ల నిర్మాణాలు చేపట్టారు. పవర్ వీక్‌లో భాగంగా 1,999 సమస్యలు గుర్తించిన అధికారులు.. వాటిలో 243 సమస్యలను పరిష్కరించారు. వంగిన స్తంభాలు, వేలాడే తీగలను సరిచేశారు. తుప్పుపట్టినవాటిని మార్చారు.
pp

p-pragathi

1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles