హుజూర్‌నగర్ పోలింగ్ నేడు

Mon,October 21, 2019 03:36 AM

-ఏర్పాట్లన్నీ పూర్తి.. పటిష్ఠ పోలీస్ బందోబస్తు
-302 పోలింగ్ కేంద్రాలు, 2,36,842 మంది ఓటర్లు
-పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
-గెలుపుపై ధీమాగా టీఆర్‌ఎస్ శ్రేణులు
-ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఉత్తమ్
-ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు.. కేసు నమోదు
-పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు

హుజూర్‌నగర్/హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధంచేశారు. ఓటింగ్ కోసం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ సామగ్రితో సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేందుకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో 2,36,842 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 1,16,415 మంది, మహిళలు 1,20,427 మంది. వీరుకాక మరో 101 మంది సర్వీస్ ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలకుగాను అర్బన్‌లో 31, రూరల్‌లో 271 కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిలో 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, వాటిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వెబ్ క్యాస్టింగ్‌ను ఏర్పాటుచేశారు.

ఈ పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి రెండు విడుతలుగా శిక్షణ ఇచ్చారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో బందోబస్తు కోసం 2,350 మంది పోలీస్ సిబ్బందితోపాటు టీఎస్‌ఎస్పీ నుంచి 3 బలగాలను, 6 సెంట్రల్ ఫోర్స్ బలగాలను ప్రత్యేకంగా రప్పించారు. ఓటింగ్ యంత్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి 27 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉపఎన్నికల నిర్వహణకు 1,241 మంది సిబ్బంది పాల్గొంటుండగా, వీరిని ఆదివారం 27 రూట్లలో 94 బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్‌కు 302 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెటింగ్ యూనిట్లు 965, ఈవీఎంలు 372, వీవీ ప్యాట్లు 388 ఉపయోగిస్తున్నారు. ఉపఎన్నికల సిబ్బంది హుజూర్‌నగర్‌లోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్‌లో ఉన్న పోలింగ్ సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.

సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌వైపే

ప్రజల మద్దతుతో హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని టీఆర్‌ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఇక్కడ విజయం సాధించి ప్రతిపక్షాలకు మరోసారి చెంపపెట్టులా సమాధానం ఇవ్వాలని కార్యకర్తలు ఉవ్విళ్లూరుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో హుజూర్‌నగర్‌ను ముందుంచాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ ప్రజలకు మేలుఅని.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి మేలు అని ప్రచారంచేశారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించి టీఆర్‌ఎస్ ఇతర పార్టీల కంటే ముందున్నది. ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కలిసి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను సమన్వయంచేశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. హుజూర్‌నగర్‌లో ఒకరోజు రోడ్‌షో నిర్వహించారు.

టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు సలహాలు, సూచనలు అందించారు. పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములపై వివిధ సర్వేల నివేదికలను క్రోడీకరించి వాటిని పార్టీ శ్రేణులకు వివరించారు. 50 శాతానికి పైగా ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికే వస్తున్నాయంటూ అనేక సర్వేలు వెల్లడించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఐదున్నరేండ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న గిరిజనులకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించడానికి తండాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారితో మమేకమై టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. గతంలో కాంగ్రెస్‌కు ఓటు వేయడం ద్వారా నియోజకవర్గం ఏ విధంగా వెనుకబడింది, టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఎలాంటి లాభం ఉంటుందో స్పష్టంగా వివరించారు.

huzurnagar2

ఉత్తమ్‌పై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ఉంటున్నారని, ఆయనను అక్కడినుంచి వెంటనే పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులు ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఉండకూదడనే నిబంధన ఉన్నదని, ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా ఉత్తమ్ హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనే ఉంటున్నారని ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తమ్.. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో కోదాడ పట్టణంలోని ఇంటి నంబర్ 3-199లో ఉంటున్నట్టు పేర్కొన్నారని, కోదాడలోని 172 పోలింగ్ స్టేషన్‌లో ఉత్తమ్‌కు ఓటు ఉన్నదని ఫిర్యాదులో తెలిపారు. ఆయన మాత్రం అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ హుజూర్‌నగర్‌లో నివాసముంటున్నట్టు చెపుతున్నారని ఫిర్యాదులో వివరించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా హుజూర్‌నగర్‌లో ఆదివారం కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఉత్తమ్‌పై కేసు నమోదు

హుజూర్‌నగర్‌రూరల్: హుజూర్‌నగర్‌లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన ఉత్తమ్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నాలుగేండ్లుగా అభివృద్ధి ఏమి జరుగలేదన్నారు. ఎంపీ నిధులతో హుజూర్‌నగర్‌లో ఈఎస్‌ఐ దవాఖాన, మట్టపల్లి నుంచి హుజూర్‌నగర్‌వరకు నాలుగులైన్ల రోడ్డు, జగయ్యపేట నుంచి మిర్యాలగూడవరకు ప్యాసింజర్ రైలును తీసుకొస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. దీనిపై సమాచారం అందుకున్న ఎంసీసీ హజూర్‌నగర్ టీం అధికారి పెంటయ్య.. ఎస్సై అనిల్‌రెడ్డికి ఫిర్యాదుచేశారు. దీంతో ఉత్తమ్‌పై ఐపీసీ సెక్షన్ 188, 126 ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే

చంపుతానని బెదిరింపు.. కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే చంపుతానని బెదిరించిన ఘటన హుజూర్‌నగర్ మండలం గోపాలపురంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన పస్తం పెంటమ్మ అనే మహిళను ఆమె మరిది పస్తం కృష్ణ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే చంపుతానని బెదిరించాడు. ప్రతిసారి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నావంటూ నెట్టివేసాడు. దీంతో ఆమె చేతికి గాయమైనట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

huzurnagar3

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. 302 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇచ్చాం. ఓటింగ్ యంత్రాల్లో సమస్యలు తలెత్తితే బెల్ ఇంజినీర్లతో వెంటనే నివృత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించాం. గ్రామాల్లో ఎన్నికల సిబ్బందికి పార్టీల నాయకులు సహకరించాలి.
- కలెక్టర్ అమయ్‌కుమార్

విధులను సక్రమంగా నిర్వహించాలి

ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు రావు. సిబ్బంది పోలింగ్ ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుమతి లేని వారిని పోలింగ్ భూత్ వద్దకు అనుమతించొద్దు. 200 మీటర్లలోకి ఓటర్లను మినహాయించి మరెవ్వరినీ పంపొద్దు.
- ఎస్పీ భాస్కరన్

780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles