ఆకాశవాణి మాజీ న్యూస్‌రీడర్‌ వెంకటరామయ్య మృతి

Tue,January 14, 2020 02:36 AM

- సీఎం కేసీఆర్‌, ప్రముఖుల సంతాపం
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రముఖ నవలా రచయిత, ప్రయోక్త, రేడియో రాంబాబుగా ప్రసిద్ధి చెందిన అకాశవాణి మాజీ న్యూస్‌రీడర్‌ డీ వెంకటరామయ్య (78) సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతిచెందారు. ఉన్నతవిద్యను అభ్యసించడానికి విదేశాలకు మంగళవారం వెళ్లనున్న మనుమడితో కలిసి కూకట్‌పల్లిలోని పీవీఆర్‌మాల్‌లో సినిమా చూడటానికి వెళ్లిన వెంకటరామయ్య బయటికివచ్చిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు దవాఖానకు తరలించగా.. వైద్యులు పరిశీలించి మృతిచెందారని తెలిపారు. వెంకటరామయ్యకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు ఈఎస్‌ఐ శ్మశానవాటికలో జరుగుతాయి. వెంకటరామయ్య మంచి రచయిత.. పంతులమ్మ సినిమాకు మాటలు రాశారు.


సీఎం కేసీఆర్‌ తీవ్రసంతాపం

డీ వెంకటరామయ్య మృతికి సీఎం కేసీఆర్‌ తీవ్రసంతాపం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ అకాశవాణి కేంద్రంలో వివిధ విభాగాల్లో ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పలువురి సంతాపాలు

అకాశవాణి మాజీ న్యూస్‌రీడర్‌ డీ వెంకటరామయ్య మృతికి తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ, ఏపీ అంతర్రాష్ట్ర సంబంధాలు, మీడియా వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్‌ సంతాపం తెలిపారు. సీఎం సీపీఆర్వో వనం జ్వాలానరసింహారావు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి రాజమౌళిచారి, కార్యవర్గం సంతాపం తెలిపింది. వెంకట్రామయ్య నివసించే శేరిలింగంపల్లి పరిధి వివేకానందనగర్‌లోని ఈనాడుకాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షడు శ్రీనివాసరెడ్డి, ప్రతినిధులు భుజంగరావు, వెంకటేశ్వరరావు, కనకయ్య, రాధాకృష్ణ తదితరులు సంతాపం తెలిపారు.

974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles