రాజసాల పేట

Fri,November 13, 2015 10:32 AM

rajasalakota01
స్వాతంత్య్రం రాక పూర్వం ముఖ్యకేంద్రంగా వెలుగు వెలిగిన గ్రామం నేడు సాధారణ గ్రామ పంచాయతీగా మిగిలిపోయింది. సూమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోని అనాథగా మారింది.అదే మెదక్ జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేట. రాజులు పాలించిన కాలంలో 70 గ్రామాలను పరిపాలించే నియోజకవర్గంగా ఉండేది. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న ఈ ప్రాంతం సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమయ్యే దుస్థితికి చేరింది.అన్ని హంగులతో నిర్మించిన కోట , రాజసౌధం, పరిచారిక గహాలు, స్నానపుగదులు, అశ్వశాలలు... ఒకటేమిటి ఎన్నో కట్టడాలు ఆనవాళ్ళు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ చారిత్రక సంపదను కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత వుంది.


ఉనికి

మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట- హన్మకొండ రహదారిపై వున్న గ్రామం రాజగోపాల్‌పేట. ఇది నంగునూరు మండలంలోని గ్రామ పంచాయతీ.

చరిత్ర

14వ శతాబ్దం ప్రారంభం నుంచి 19వ శతాబ్దం చివరి వరకు దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు రాజగోపాల్‌పేట గ్రామాన్ని 70 గ్రామాలకు ముఖ్యకేంద్రంగా చేసుకొని రాజులు పాలన సాగించినట్లు తెలుస్తున్నది. తొలుత ఈ ప్రాంతం అశోకుని కాలంలో మౌర్యుల పాలనలో వుంది. తర్వాత నాలుగు శతాబ్దాల పాటు క్రీ.పూ.230 నుంచి క్రీ.శ 218 వరకు శాతవాహనులు పాలించిన దక్కన్ ప్రాంతంలో అంతర్భాగంగా మారింది. అనంతరం ఎనిమిదవ శతాబ్దంలో వేములవాడ ముఖ్యపట్టణంగా పరిపాలన సాగించిన చాళుక్యుల పాలనలో ఉందని అర్థమవుతున్నది. తొమ్మిదవ శతాబ్దంలో రాష్ట్ర కూటులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజధానిగా ఉండేది. తర్వాత11వ శతాబ్దంలో ఓరుగల్లు రాజధానిగా పాలించిన కాకతీయుల పాలనలోకి ఈప్రాంతం వచ్చినట్లు చరిత్ర చెబుతున్నది. క్రీ.శ 1309 వరకు మూడు శతాబ్దాల పాటు కాకతీయ వంశంలోని తొమ్మిది మంది రాజులు ఈప్రాంతాన్ని పరిపాలించారు. కాకతీయ రాజులు శైవ మతస్థులు అయినప్పటికీ వారి సామంత రాజులు వైష్ణవులవడంతో శైవ మతంతో సమానంగా వైష్ణవ మతం ఆదరణ పొందింది. దీనికి నిదర్శనంగా నంగునూరు మండలం లోని బద్దిపడగ, రాజగోపాల్‌పేట, నర్మేట,నంగునూరు గ్రామాలలో నిర్మించిన శివుని, రాముని గుళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

కాకతీయుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు తెలుగుభాషకు ప్రాముఖ్యంలేని వారి పాలనలో ఈ ప్రాంతం వుంది. క్రీ.శ. 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధికారి మాలిక్‌కాఫర్ దండయాత్రతో ఓరుగల్లు(కాకతీయుల పాలన) సామ్రాజ్యం పతనం అయింది.కాకతీయ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ప్రస్తుత కరీంనగర్ జిల్లాలోని ఎల్లందుల, మలంగూర్ కోటలు ముస్లిం పాలకులైన ఢిల్లీసుల్తానుల వశమయ్యాయి. ఎల్లందుల పరిధిలో ఉన్న నంగునూరు ప్రాంతం ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. 1309లో కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు మాలిక్ కాఫర్ చేతిలో ఓడిపోవడంతో అల్లావుద్దీన్ ఖిల్జీతో సంధి కుదుర్చుకుని సామాంతరాజుగా మారాడు. దీంతో ఈప్రాంతం సామంతరాజుల కింద వచ్చింది.1316లో ఖిల్జీ మరణించడంతో రెండవ ప్రతాపరుద్రుడు స్వతంత్రించి ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని ఎదిరించాడు.అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఢిల్లీ సుల్తాన్‌గా అధికారంలోకి వచ్చిన సుల్తాన్ ఘియాజుద్దీన్ 1321లో తన కుమారుడైన జునాఖాన్‌ను ఓరుగల్లుపై దాడికి పంపి పరాజయం పాలయ్యాడు.1323లో రెండవసారి దాడి చేసి రెండవ ప్రతాపరుద్రుని ఓడించి బందీగా పట్టుకున్నాడు. దీంతో కాకతీయుల సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోకి వెళ్లింది. వారి ప్రతినిధిగా సైన్యాధిపతులలో ఒకరైన మహబూబ్‌ఖాన్‌ను ఓరుగల్లులో నియమించుకొని పరిపాలన కొనసాగించారు.

1325లో ఘీయాజుద్దీన్ మరణించడంతో మహ్మద్‌బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్‌గా అధికారంలోకి వచ్చాడు.దక్షిణ భారతదేశాన్ని తుగ్లక్ 5 భాగాలుగా విభజించి వీటిని పాలించడానికి గవర్నరులను నియమించాడు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలను ఒక భాగంగా ఏర్పాటు చేసి దానికి షిభాహిసుల్తాన్‌ను గవర్నరుగా నియమించారు. దీంతో ఈయన బీదర్‌ను రాజధానిగా చేసుకొని ఈప్రాంతాన్ని పాలించాడని మనకు తెలుస్తోంది.తెలంగాణను పాలిస్తూ లక్ష టంకాలను కప్పంగా ఢిల్లీ సుల్తానులకు చెల్లించేవాడు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవడంతో ఢిల్లీ సుల్తాన్ ఇతన్ని దౌల్తాబాద్ వద్ద ఓడించి జైలు పాలు చేశాడు. అనంతరం బహమని సుల్తానులు అధికారంలోకి రావడంతో ఈప్రాంతం వారి ఆధీనంలోకి వచ్చింది.

ముఖ్యకేంద్రంగా...

బహమని సుల్తానుల పాలన కొనసాగుతున్న సమయంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి సిద్ధోహేమాద్రి సోమయాజి అనే వ్యక్తి ఈప్రాంతానికి వలస వచ్చాడు. నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేట పక్కగ్రామమైన పాలమాకుల శివారులో నివాసమేర్పర్చుకున్నాడు. అదే సమయంలో రాజ్యపాలన చేస్తున్న బహమని సుల్తానుల చక్రవర్తి వేట కోసం ఈప్రాంతానికి వచ్చాడు. అప్పుడు ఆ చక్రవర్తికి ఈ సోమయాజి సేవలందించాడని కథనం. సోమయాజి సేవలకు సంతప్తి చెందిన చక్రవర్తి బహుమానంగా దేశ్‌ముఖ్, దేశ్‌పాండే బిరుదులతోపాటు ఇక్కడి కొంత ప్రాంతాన్ని ఇనామ్‌గా (దానంగా) ఇచ్చినట్లు తెలుస్తున్నది. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాక , కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం రామవరం, బెజ్జంకి, శనిగరం తదితర 70 గ్రామాల అటవీప్రాంతం ఈ ఇనామ్‌లో భాగం. అనంతరం సోమయాజి కుమారుడు అసిద్ధో హేమాద్రి రాజగోపాలపురంను నిర్మించి, అక్కడ అన్ని హంగులతో కూడిన ఒక గడిని కట్టి నివాసమేర్పరుచుకున్నాడు. ఆరాజగోపాలపురం కేంద్రంగా ఈ70 గ్రామాలను పాలిస్తూ వీటిని ఇనామ్‌గా ఇచ్చిన ఆ బహమనీ సుల్తాన్‌కు విధేయులుగా ఉన్నారని చరిత్ర! ఆ రాజగోపాలపురమే నేటి రాజగోపాల్‌పేట.

కోట (గడి )నిర్మాణం

ఐదు ఎకరాల విస్తీర్ణంలో.. 1326 నుంచి 1330 వరకు ఈ కోట, తదితర నిర్మాణాలు జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. గడిలోపల రాణిసౌధం,పరిచారికా గహాలు, స్నానపుగదులు, అశ్వశాలలున్నాయి. ఈగడికి రెండు ప్రవేశద్వారాలను ఏర్పాటు చేశారు.నాలుగువైపులా ఎత్తైన రాతి కట్టడాలు గల బురుజులతో గడి ప్రాకారం నిర్మించారు. అప్పట్లో ఈప్రాంత దేశ్‌ముఖ్‌కు ఇరువురు భార్యలు వుండేవారని, వారు ఇరువురు ఒకరి ముఖం ఒకరు చూసుకునేందుకు ఇష్టపడకపోయేవారని స్థానిక కథనం.దీంతో గడి మధ్యలో బావి తవ్వించి దాని మధ్యలో గోడ నిర్మించారని చెబుతారు. ఈబావికి ఇరువైపులా నిలబడి ఒకరికొకరు కనబడకుండా నీళ్లు చేదుకునేవారట. దీంతో ఆబావి సవతుల బావిగా స్థిరపడింది నేటికీ! దేశ్‌ముఖ్‌లు సంపాదించిన ధనరాసులను ఇనుప బొక్కెన సహాయంతో ఈబావిలో దాచినట్లు ప్రచారంలో ఉంది. గడికి నాలుగు పక్కల బురుజులపై రక్షక భటులు కాపలా కాసేవారు. అంతేకాదు గోడ చుట్టూ మూడు మీటర్ల వెడల్పు అంతే లోతుతో కందకాలూ ఉన్నాయి. ఆకాలంలో రాజగోపాల్‌పేట గడి ఒక వెలుగు వెలిగిందని చెబుతుంటారు.

రాజగోపాల్‌పేట ఫిర్కా

మొఘలులకాలంలో పాలనాసౌలభ్యం కోసం రాష్ర్టాన్ని సుభాలుగా, సుభాలను జిల్లాలుగా, జిల్లాలను తాలుకాలుగా, తాలుకాలను ఫిర్కాలుగా విభజించారు. అప్పట్లో రాజగోపాల్‌పేటను ఒక ఫిర్కాగా చేశారు. ఈఫిర్కా కింద నంగునూరు మండలంలోని 20 గ్రామాలు చిన్నకోడూరు మండలంలోని రామునిపట్ల, ఇబ్రహీంనగర్, కస్తూరిపల్లి, మందపల్లి, సికింద్లాపూరు, చర్లఅంకిరెడ్డిపల్లి, మల్లారం, అనంతసాగర్, గోనెపల్లి గ్రామాలతోపాటు సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామాలూ వుండేవి. ఈసమయంలో (19వ శతాబ్దం చివరి భాగంలో )రాజగోపాల్‌పేట దొరలుగా పిలిచే దేశ్‌ముఖ్, దేశ్‌పాండేలు విడిపోయి ఫిర్కా పరిధిలోని వివిధ ప్రాంతాలలో నివాసమేర్పర్చుకున్నారు. దాదాపు 37 సంవత్సరాల పాటు అది వీరి ఆధీనంలో ఉంది.

చెరువుల నిర్మాణం

గోల్కొండ కుతుబ్‌షాహీల పాలనలో ప్రసిద్ధ పాలకుడైన గోల్కోండ తానీషా కొలువులో సూర్యప్రకాశ్‌రావు అనే వ్యక్తి మీరుజుమ్లాపధానమంత్రి)గా, మాదన్న సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవారు.వీరికి రాజగోపాల్‌పేట దేశ్‌ముఖ్‌లతో మంచి సంబంధాలుండేవి. ఆకాలంలో ఈకోట(గడి) పక్కనే ఒక పెద్ద చెరువు నిర్మాణం చేశారు. కోట నుంచి చెరువుకు సిలింధ్రం కూడా వుందని చెబుతుంటారు. దీంతో పాటు నంగునూరులోని పెద్ద చెరువు నిర్మాణం కూడా చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు

1952లో రాజగోపాల్‌పేట గ్రామం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు అయి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కెవి.నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొంది మొదటి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా రాజగోపాల్‌పేట ఫిర్కాలో ఎలాంటి మార్పు జరగలేదు.1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మండలాల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో రాజగోపాల్‌పేట ఫిర్కాలోని రామునిపట్ల, ఇబ్రహీంనగర్, కస్తూరిపల్లి, మందపల్లి, సికింద్లాపూరు, చర్లఅంకిరెడ్డిపల్లి, మల్లారం, అనంతసాగర్, గోనెపల్లి గ్రామాలు చిన్నకోడూరు మండలంలోకి, మిట్టపల్లి సిద్దిపేట మండలంలోకి మారాయి. మిగిలిన గ్రామాలతోపాటు రాజగోపాల్‌పేటను కలిపి నంగునూరు కేంద్రంగా మండలం ఏర్పడింది. అప్పటి నుంచి రాజగోపాల్‌పేట సాధారణ గ్రామపంచాయతీగా మారింది.

శిథిలావస్థలో ఆ సంపద

ఈప్రాంతంలో నిర్మించిన చారిత్రక కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థలోకి వెళుతున్నాయి. ఈచారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణకెంతైనా ఉంది. ఈ కట్టడాలకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు వెచ్చించి అభివద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించి ఆ దిశలో రాజగోపాల్‌పేటను అభివద్ధి చేయాలి!

5624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles