గోదావరిలో ఘోరం పాపికొండల్లో పడవ మునక

Mon,September 16, 2019 03:01 AM

-8 మంది మృతి
-సుడిగుండం వల్లే ప్రమాదం
-లాంచీలో మొత్తం 73 మంది ప్రయాణికులు
-26 మంది సురక్షితం.. 39 మంది గల్లంతు
-పర్యాటకుల్లో 22 మంది హైదరాబాదీలు, 14 మంది వరంగల్‌వాసులు
-మృతుల్లో హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన మహిళ, వరంగల్‌కు చెందినవారు ఇద్దరు
-ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఆరా
-మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
-మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
-ప్రధాని మోదీ, గవర్నర్, ప్రముఖుల సంతాపం
-నీటిలో సుడిగుండం ఏర్పడటంవల్లే ప్రమాదం
-ఎనిమిది మృతదేహాలు వెలికితీత.. 26 మంది సురక్షితం
-బోటుకు అనుమతుల్లేవన్న ఏపీ మంత్రి అవంతి
-నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలతో సహాయక చర్యలు

గోదావరిలో ఘోరం జరిగింది. పాపికొండల పర్యటనలో పెనువిషాదం చోటుచేసుకున్నది. 73 మంది పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ఠ బోటు నీట మునిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో జలసమాధి అయింది. ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాం తంలో గండిపోచమ్మ గుడినుంచి పాపికొండలు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. రాత్రి వరకు ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి. లైఫ్‌జాకెట్లు వేసుకున్న 26 మందిని స్థానికులు సురక్షితంగా నది ఒడ్డుకు చేర్చారు. 39 మంది గల్లంతయ్యారు. సుడిగుండం ఏర్పడటంవల్లే ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. రెండు హెలికాప్టర్లు, ఎనిమిది బోట్లతోపాటు ఇతర సహాయక బృందాలు రాత్రి వేళలోనూ గాలింపుచర్యలు చేపడుతున్నాయి. లాంచీలో ప్రయాణిస్తున్న 73 మందిలో తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన 22 మంది, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 14 మందితోపాటు విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన పర్యాటకులు ఉన్నారు. వరంగల్ అర్బన్‌కు చెందిన ఇద్దరు, హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన మహిళ మృతిచెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. వరంగల్‌కు చెందిన మరో ఐదుగురు పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, ఏడుగురు గల్లంతయ్యారు.

హైదరాబాద్‌కు చెందిన 22 మందిలో 14 మంది సురక్షితంగా బయటపడగా, ఏడుగురు గల్లంతయ్యారు. పడవ మునక ఘటన బాధాకరమని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సానుభూతి తెలిపారు. ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆదివారం 5 లక్షలకుపైగా క్యూసెక్కుల వరదనీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న వేళ ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది.

boat-capsizes1
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, నమస్తే తెలంగాణ/ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పర్యాటక పడవ జలసమాధి అయింది. అప్పటివరకు ఆటపాటలతో సాగిన ప్రయాణం విషాదంతో ముగిసింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లిన కుటుంబాలకు కన్నీళ్లను మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు మందం సమీపంలో 73 మంది పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ఠ ప్రైవేటు బోటు గండిపోచమ్మ గుడినుంచి పాపికొండలు వెళ్తుండగా ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు గోదావరిలో బోల్తా పడింది. చిన్నారులతో కలిపి 64 మంది పర్యాటకులు, తొమ్మిదిమంది బోటు సిబ్బంది ఉన్నారు. రాత్రి వరకు ఎనిమిది మృతదేహాలు లభ్యమైనట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల్లో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన బస్కె రాజేందర్ (58), బస్కె అవినాశ్ (17), హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన జ్యోతి ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. లైఫ్ జాకెట్లు వేసుకున్న 26 మందిని తూటుగుంట గ్రామస్థులు మరో పడవ సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 39 మంది గల్లంతయ్యారు. కొందరికే లైఫ్ జాకెట్లు ఇచ్చారని ప్రయాణికులు ఆరోపించారు.

పర్యాటకుల్లో హైదరాబాద్‌కు చెందిన 22 మంది, వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన 14 మందితోపాటు వైజాగ్, రాజమండ్రికి చెందినవారు ఉన్నారు. కడిపికొండకు చెందిన ఐదుగురు సురక్షితంగా బయటపడగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇద్దరు మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందినవారిలో 14 మంది సురక్షితంగా బయటపడగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందారు. లాంచీ సుడిగుండంలో చిక్కుకున్న సమయంలో లాంచీ మొదటి అంతస్తునుంచి రెండో అంతస్తులోకి ఎక్కడానికి పర్యాటకులంతా ఒక్కసారిగా ప్రయత్నించడంతో పడవ బోల్తా పడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో బోటు ఇద్దరు డ్రైవర్లు నూకరాజు, తామరాజు చనిపోయినట్టు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారు. రెండు హెలికాప్టర్లతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తక్షణమే బోటు సర్వీసులన్నీ నిలిపివేయాలని అధికారులను ఆదేశాలు జారీచేశారు. రాయల్ వశిష్ఠ బోటుకు ఎలాంటి అనుమతుల్లేవని ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదం సంభవించిన ఆదివారం 5.13 లక్షల క్యూసెక్కుల వరదనీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ విచారం వ్యక్తంచేశారు. ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మునిగిపోయిన పడవను గుర్తించేందుకు ఉత్తరాఖండ్ నుంచి సైడ్ స్కాన్ సోనార్ పరికరాన్ని తీసుకొచ్చి ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.
boat-capsizes3

ఇంజినీర్స్ డే వేడుకల కోసం వెళ్లి విషాదంలో చిక్కారు

హైదరాబాద్ నుంచి వెళ్లిన 22 మందిలో ఏడుగురు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందినవారు ఉన్నారు. ఔట్‌సోర్సింగ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరంతా ఇంజినీర్స్ డే వేడుకలను పాపికొండల్లో జరుపుకొనేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకొన్నారు. ఏడుగురిలో నలుగురు సురక్షితంగా బయటపడారు. నీటిలో కొట్టుకుపోతున్న తమను తూటుకుంట గ్రామస్థులు ఒడ్డుకు చేర్చారని వారు నమస్తే తెలంగాణకు తెలిపారు. సెల్‌ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో ఆ గ్రామస్థులే కుటుంబసభ్యులకు సమాచారాన్ని చేరవేసినట్టు చెప్పారు. మరో ముగ్గురి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఇంజినీర్లలో మంచిర్యాల జిల్లా, రూరల్ మండలం నంనూర్‌కు చెందిన కారుకూరి రమ్య(23), కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మణ్ గల్లంతైనవారిలో ఉన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకు చెందిన ఎన్ కిరణ్‌కుమార్, సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపూర్ గ్రామానికి చెందిన గల్లా శివశంకర్ సురక్షితంగా బయటపడగా, హాలియాకు చెందిన సురభి రవీందర్, నల్లగొండకు చెందిన తరుణ్‌రెడ్డి గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చినవాళ్లు 22 నుంచి 26 మంది వరకు ఉన్నట్టు రంపచోడవరం ఇన్‌స్పెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. గోదావరి నీటి ఉధృతి పెరుగడం వల్ల సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని చెప్పారు.

అత్యంత లోతైన ప్రాంతంలో ప్రమాదం

దేవీపట్నం సమీపంలో లాంచీ మునిగిన ప్రదేశం గోదావరిలోనే అత్యంత లోతైన ప్రాంతమని అధికారులు చెప్తున్నారు. అక్కడ నది లోతు 250 అడుగులకుపైగా ఉండి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రమాద సమయంలో 5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్టు తెలిపారు. 2018 మే 16న పోలవరం మండలం వాడపల్లి వద్ద లాంచీ మునిగిన ఘటనలో 22 మంది మృతిచెందారు.

మృతుల కుటుంబాలకు మంత్రుల సానుభూతి

పాపికొండలు వద్ద గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాదంపై పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బోటు ప్రమాదంపై ఏపీ మంత్రులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకొనేలా సమన్వయం చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఏపీ మంత్రి కన్నబాబుతో మాట్లాడి బాధితులకు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఘటనపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బోటు ప్రమాదంపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినవారు ఉన్నారని తెలుసుకొన్న వెంటనే జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్‌తో ఎర్రబెల్లి ఫోన్‌లో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకొని పూర్తివివరాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చివరి వ్యక్తిని కాపాడేవరకు సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వరదల నేపథ్యంలో గోదావరి ప్రాంతంలోని పాపికొండలు, శ్రీశైలం బోట్ టూర్ బస్సులను తెలంగాణ పర్యాటక శాఖ రద్దు చేసింది.
boat-capsizes4

సుడిగుండమే గండమైందా!

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదానికి సుడిగుండమే కారణమైంది. ప్రమాదంపై బోటు యజమాని రమణ మాట్లాడుతూ.. కచులూరు వద్ద పెద్ద సుడిగుండం ఉన్నదని, దాన్ని దాటే సమయంలో డ్రైవర్లు సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని చెప్పారు. ప్రమాదానికి కారణమైన రాయల్ వశిష్ట బోటుకు ఎలాంటి అనుమతి లేనట్టు ఏపీ మంత్రి వెల్లడించారు. రాయల్ వశిష్ట బోటుకు అనుమతి ఎవరు ఇచ్చారో తెలియదని స్థానిక అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బరాజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు ఉంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో జలరవాణాను పూర్తిగా నిషేధిస్తామని, ప్రస్తుతం గోదావరిలో ప్రవా హం 5.13 లక్షల క్యూసెక్కులు ఉండటంతో ప్రయాణానికి ఎంతమాత్రం అనుకూలం కాదని చెప్తున్నారు. ప్రస్తుతం నీట మునిగిన బోటుకు అనుమతి ఎవరు ఇచ్చారో తెలియడం లేదన్నది పేర్కొంటున్నారు. అనుమతులు లేకుండానే పర్యాటకులను నీటిలోకి తీసుకెళ్లి వారి మృతికి బోటు యాజమాన్యమే కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కన్నీటిసంద్రంలో కడిపికొండ

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: పాపికొండల అందాలను తిలకించేందుకు వెళ్లిన వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసుల కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 13 మంది, జనగామ జిల్లా చెల్పూర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి ఒకరు శుక్రవారం రాత్రి కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. వీరంతా మాదిగ మహారాజుల పరపతి సంఘంలో సభ్యులు. ప్రమాదానికి గురైన జిల్లా వాసుల సమాచారం కోసం అక్కడి టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. అత్యవసర సేవల కోసం కాజీపేట తాసిల్దార్ బండి నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఆర్‌ఐ సురేశ్, వీఆర్వో జోసఫ్‌తో కూడిన రెవెన్యూ బృందాన్ని, ఐదు ఆంబులెన్సులను తూర్పు గోదావరి జిల్లాకు పంపుతున్నట్టు ప్రకటించారు. ప్రమాదంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ఆరూరి హుటాహుటిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు బయలుదేరారు. ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.
boat-capsizes13

లాంచీ ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా లో పాపికొండలు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో మరణించివారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల్లో తెలంగాణవాసులు ఉండటంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రధాని మోదీ విచారం

లాంచీ ప్రమాదం ఘటన తీవ్రంగా బాధించిందని ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి ప్రమాదంపై విచారం వ్యక్తంచేశారు. పడవ నీట మునిగి అందులో ప్రయాణిస్తున్నవారు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యసాహసాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. సంతాపం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ.. గల్లంతైనవారి ఆచూకీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. గల్లంతైనవారంతా ప్రాణాలతో బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు.

మృతులు:

వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన బస్కె రాజేందర్(58), బస్కె అవినాశ్ (17), హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన చింతామణి జ్యోతి(55), బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు (ఏపీకి చెందినవారు)
boat-capsizes5

సురక్షితంగా బయటపడిన తెలంగాణవాసులు

వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన బస్కె దశరథం, బస్కె వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేశ్, అరెపల్లి యాదగిరి, అక్బల్ సింగ్ (హైదరాబాద్), కోదండ అర్జున్, (హయత్‌నగర్), పాడి జననికుమార్ (హయత్‌నగర్), కిరణ్‌కుమార్ (హైదరాబాద్) నార్లపురం సురేశ్ (జగద్గిరిగుట్ట), చింతమనేని జానకిరామ్ (బోడుప్పల్), సొత్తేటి రాజేశ్ (సనత్‌నగర్), మజీరుద్దీన్ (హైదరాబాద్), మొయిన్ (హైదరాబాద్).
boat-capsizes7
boat-capsizes8

గల్లంతయినవారి వివరాలు:

వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన సీవీ వెంకటస్వామి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి (62), బస్కె రాజేంద్రప్రసాద్ (50), కొండూరి రాజ్‌కుమార్ (40),బస్కె ధర్మరాజు(42), గడ్దమీది సునీల్ (40), కొమ్ముల రవి (43), గొర్రె రాజేంద్రప్రసాద్(55), పవన్ (రామం తాపూర్), వసుంధర (రామంతా పూర్), సుశీల్ (రామంతాపూర్), ఈరన్ సాయికుమార్ (మాదాపూర్), తాలిబ్ పటేల్ (టోలిచౌకి), కోదండ విశాల్‌కుమార్ (హయత్‌నగర్), పాడె భరణి కుమార్ (హయత్‌నగర్), బొడ్డు లక్ష్మణ్, రమ్య (మంచిర్యాల).
boat-capsizes6
boat-capsizes12
boat-capsizes9
boat-capsizes10
boat-capsizes11

2389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles