ఊరూరా ఉత్సాహంగా..

Mon,September 16, 2019 02:32 AM

-విజయవంతంగా 30 రోజుల ప్రణాళిక అమలు
-పల్లెల్లో ముమ్మరంగా శ్రమదానాలు
-పరిశుభ్రతకు నెలవుగా మారుతున్న పల్లెలు
-ఊరిని బాగు చేసుకునేందుకు ముందుకొస్తున్న దాతలు

గ్రామాలను అభివృద్ధిబాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఊరూరా ఉత్సాహం గా సాగుతున్నది. ఈ నెల 6న ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల్లోనే ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో సత్ఫలితాలొస్తున్నాయి. దీంతో గ్రామాల్లో తిష్ఠవేసిన సమస్యలు తొలగుతూ పల్లెలు పరిశుభ్రతకు నెలవుగా మారుతున్నాయి. ఆదివారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు శ్రమదానం చేయగా, ఊరిని బాగు చేసుకొనేందుకు గ్రామస్థులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.
-నమస్తే తెలంగాణ నెట్‌వర్క్
30-day-action-plan2
గ్రామాలను స్వచ్ఛతకు నిలయాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 30 రోజుల ప్రగతి ప్రణాళికకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో మహిళలు భారీ ర్యాలీ తీశారు. రోడ్ల వెంట ఉన్న చెత్తను ఊడ్చి, పిచ్చిమొక్కలను తొలగించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మల్లారంలో ఆదివారం కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, డీపీవో రవీందర్‌తోకలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా తట్టతో చెత్తను ట్రాక్టర్‌లో ఎత్తిపోశారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లిలో జెడ్పీటీసీ గుగులోతు కళావతి, సర్పంచ్, స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం కోనాపూర్లో మహిళాసంఘాల ఆధ్వర్యంలో రోడ్లు ఊడ్చి శ్రమదానం చేశారు.

స్వచ్ఛత వైపు సబ్బండవర్గాలు

సీఎం పిలుపుతో గ్రామాల్లో సబ్బండవర్గాల ప్రజలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా అప్పర్‌పల్లి, కొత్తరహపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ట్రైనీ కలెక్టర్ హేమంత్, జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావ్, ఎంపీపీ మల్లికార్జున్, సర్పంచ్ బాపూరావ్, ఎంపీడీవో రమేశ్ పాల్గొని గ్రామాభివృద్ధి కోసం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. జైనూర్ మండలం భూసిమెట్టలో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రియాంక చౌహాన్ ఆధ్వర్యంలో గ్రామ శివారులో వర్మీకంపోస్టు తయారీకి స్థలాన్ని పరిశీలించి, పిచ్చిమొక్కలను తొలగించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి పునరావాస కాలనీలో కలెక్టర్ భారతి హోళికేరి పర్యటించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బధ్యాతండాలో కలెక్టర్ ఆర్వీకర్ణన్ గ్రామస్థులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నేలకొండపల్లి మండలం బొదులబండ పంచాయతీలో ఇంచార్జి డీపీవో, అసిస్టెంట్ కలెక్టర్ హనుమంత్‌కొడింబా పాల్గొన్నారు. కొణిజర్ల మండలం విక్రమ్‌నగర్‌లో అసిస్టెంట్ కలెక్టర్, డీఎంహెచ్‌వో డాక్టర్ కళావతిబాయి తదితరులు అవగాహన కల్పించారు.
30-day-action-plan3

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ముమ్మరంగా..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నది. మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్‌లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ 30 రోజుల ప్రణాళిక పనులను పరిశీలించారు. దేవరకద్ర మండలం నార్లోనికుంటలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరులో జెడ్పీ సీఈవో యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ పాల్గొని శ్రమదానం చేశారు. జోగుళాంబగద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడులో జెడ్పీచైర్‌పర్సన్ సరిత మొక్కలు నాటారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో మొక్కలు నాటేందుకు సర్పంచ్ గుంతలు తీశారు. వనపర్తి జిల్లా అప్పాయిపల్లిలో జరుగుతున్న పనులను జెడ్పీచైర్మన్ లోకనాథ్‌రెడ్డి పరిశీలించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో సుమారు 2 వేల మంది మహిళలు పారిశుద్ధ్య పనులు చేశారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

30రోజుల ప్రణాళికలో భాగంగా పలు జిల్లాల్లో కలెక్టర్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండారెంజల్‌లో కలెక్టర్ సత్యనారాయణ గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామ శివారులో వైకుంఠదామం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్రగతి ప్రణాళిక పనులను పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి చిలుపూర్ మండలం రాజవరంలో పర్యటించి విద్యుత్ పనులను పరిశీలించారు. మహబుబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారంలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పర్యటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం, ఘనపురం మండలం చెల్పూర్‌లో గ్రామస్థులు శ్రమదానం చేశారు.
30-day-action-plan4

జోరుగా శ్రమదానం

అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థుల సహకారంతో గ్రామాల్లో శ్రమదానాలు చేస్తున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మం డలం రంగాయపల్లిలో జెడ్పీచైర్మన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ శ్రమదానంలో పాల్గొన్నారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడులో రాష్ట్ర సివిల్‌సైప్లె కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి చెత్తాచెదారాన్ని తొలగించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం దేవరఫస్లాబాద్, నంద్యానాయక్ తండాల్లో కలెక్టర్ మస్రత్ ఖానమ్ అయేషా పర్యటించి గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్యపనుల్లో పాల్గొన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించిన దౌల్తాబాద్ మండలం నంద్యనాయక్‌తండా వీఏవో, వీఆర్వోలను సస్పెండ్ చేయాలని తాసిల్దార్ వెంకటేశ్‌ను కలెక్టర్ ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలులో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు ఫలిస్తున్నాయి. కలెక్టర్‌తో సహా జిల్లా అధికారులు ఒకరోజు పల్లెనిద్ర మరుసటి రోజు చేపడుతున్న మెగా శ్రమదానంతో ప్రజల్లో మార్పు కనిపిస్తు న్నది. ఈక్రమంలో రోజువారి కార్యక్రమాల తోపాటు పల్లెనిద్రకు శ్రీకారంచుట్టారు. ఈ నెల 12న సాయంత్రం అధికారులంతా తమకు కేటాయించిన గ్రామానికి వెళ్లి పల్లెనిద్ర చేసి, మరుసటి రోజు ఉదయం మెగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో సర్పంచులు, ప్రజాప్రతినిధులు శ్రమదానం చేస్తున్నారు. కలెక్టర్ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తు ప్రజల్లో స్ఫూర్తినింపుతున్నారు. తాను పల్లెనిద్ర చేసిన కంది మండలం చెర్లగూడెంను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కలెక్టర్ చర్యలపట్ల జిల్లాప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.

పల్లెరుణం తీర్చుకొనేందుకు..

image
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కేశవపురం గ్రామం సర్పంచ్ జనార్దన్

సీఎం దత్తత గ్రామంలో జోరుగా

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం జోరుగా సాగుతున్నది. సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామస్థులు శ్రమదానం చేసి పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగిస్తున్నారు.
- మర్కూక్

నిర్లక్ష్యానికి జరిమానా

-ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపకుంట్లలో చెట్టును నరికిన ఓ వ్యక్తికి పంచాయతీ పాలకవర్గం రూ.వెయ్యి జరిమానా విధించింది. గ్రామానికి చెందిన ఆంగోతు సురేశ్ ప్రభుత్వ పాఠశాలలోని చెట్లు విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని చెట్టునే నరికేశాడు. గ్రామస్థులు సర్పంచ్ ధారా శ్యాంకు ఫిర్యాదుచేయడంతో అతడికి జరిమానా విధించారు.
-మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రాజీవ్‌నగర్‌లో వెంకటేశ్వర క్షౌరశాల నిర్వాహకుడు రోడ్డుపై వ్యర్థాలు వేసినందుకు అధికారులు రూ.500 జరిమానా విధించారు. జైపూర్ మండలం రసూల్‌పల్లిలో రోడ్డుపైన చెత్త వేసిన కోయల్కారి శంకరమ్మ, బండి స్వర్ణాకర్, మూల కనుకయ్య అనే దుకాణాదారులకు ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమానా విధించారు.
-రాజన్న సిరిసిల్ల జిల్లా గైదిగుట్టతండా గ్రామంలో వ్యవసాయాధికారి అనూ ష అధికారులతో కలిసి తిరుగుతూ గ్రామంలోని ఇండ్ల ఎదుట అపరి శుభ్రంగా ఉన్నవారికి రూ.500 జరిమానా విధించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

మీ ఊరు బాగుండాలని లేదా?

-కాంగ్రెస్ వార్డు సభ్యుడిపై కలెక్టర్ భారతి హోళికేరి ఆగ్రహం
ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయాలని మంచి కార్యక్రమం చేస్తుంటే అడ్డుపడుతున్నారు.. మీ ఊరు బాగుపడాలని మీకు లేదా? అంటూ మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి ఓ కాంగ్రెస్ వార్డుసభ్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి పునరావాస కాలనీలో కలెక్టర్ పర్యటిస్తున్న సమయంలో కాంగ్రెస్ వార్డుసభ్యుడు గెల్లు మల్లేశ్ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
30-day-action-plan5
30-day-action-plan6

1060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles