స్త్రీనిధి రుణలక్ష్యం 2,900 కోట్లు


Wed,August 14, 2019 01:48 AM

2900 crore Loan For Stree Nidhi

-గతేడాది కంటే రూ.580 కోట్లు ఎక్కువ
-గ్రామీణప్రాంతాలకు రూ.2,600 కోట్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని మహిళా స్వశక్తి సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఈ ఏడాది కూడా స్త్రీనిధి రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈ ఏడాది రూ. 2,900 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించారు. గత వార్షిక రుణ లక్ష్యం (రూ.2,320 కోట్ల) కంటే ఇది రూ.580 కోట్లు ఎక్కువ. మహిళా సంఘాల సభ్యులను వ్యాపారరంగంలో మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది వార్షిక రుణ లక్ష్యాన్ని పెంచినట్టు స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. ఈసారి స్త్రీనిధి రుణాలను ఎక్కువగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో మంజూరు చేయనున్నారు. మొత్తం రుణాల్లో గ్రామీణ మహిళా సంఘాల సభ్యులకు రూ.2,600 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు రూ.300 కోట్లు ఇవ్వనున్నారు. అవసరమైతే గ్రామీణప్రాంతాల రుణ లక్ష్యాన్ని స్వల్పంగా కుదించి పట్టణ ప్రాంతాలకు మరికొంత పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశమైన అధికారులు.. రుణాలివ్వడంలో ఇబ్బందులకు గురిచేయరాదని సూచించారు. స్రీనిధి రుణ వాయిదాల చెల్లింపులు 99 శాతం మేరకు సక్రమంగా జరుగుతుండటంతో బ్యాంకర్లు కూడా సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4.5 లక్షల మహిళా సంఘాలు ఉండగా.. గతేడాది స్త్రీనిధి కింద 2.04 లక్షల మహిళా సంఘాలకు రూ.2,320 కోట్ల రుణాలను ఇచ్చారు. కుటీర పరిశ్రమలను, వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ఈ రుణాలను మంజూరుచేస్తున్నారు.

మహిళల బాధలు తీర్చిన ప్రభుత్వం

మహిళా స్వశక్తి సంఘాల ఆర్థికాభ్యున్నతి కోసం వడ్డీలేని రుణాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఆ సంఘాలకు, సభ్యులకు స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని నాలుగేండ్ల క్రితమే గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో స్వశక్తి సంఘాలకు గ్రూపులవారీగా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు, సభ్యులుగా ఉన్న మహిళలకు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలిస్తున్నారు. దీంతో వారి అప్పుల బాధలు తీరుతున్నాయి. ఈ రుణాలను తీసుకున్న మహిళలు నిర్దేశిత వడ్డీతో బ్యాంకులకు నెలవారీ వాయిదాలు చెల్లించాలి. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించే సంఘాలు, సభ్యులకే వడ్డీ రాయితీని వర్తింపజేస్తుండటంతో రుణగ్రహీతలు సక్రమంగా వాయిదాలు చెల్లిస్తున్నారు. ఈ వాయిదాలన్నీ చెల్లించిన తర్వాత సదరు రుణానికి ప్రభుత్వం చెల్లించే మొత్తం వడ్డీని బ్యాంకులు ఆయా రుణగ్రహీతల ఖాతాలకు బదిలీ చేస్తున్నాయి.

వ్యాపార రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నాం..

సొంతంగా వ్యాపారం చేస్తున్న మహిళలను స్త్రీనిధి రుణాలతో ప్రోత్సహిస్తున్నాం. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో మన రాష్ట్ర మహిళలే ముందున్నారు. ఏటా 99 శాతం వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నారు. మిగిలిన ఒక్క శాతం కూడా చెల్లిస్తున్నప్పటికీ నిర్ణీత గడువులోగా బ్యాంకుల్లో జమ చేయడంలేదు. ఈసారి రూ.2900 కోట్ల రుణాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించి మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తాం.
- విద్యాసాగర్‌రెడ్డి, స్త్రీనిధి ఎండీ

2033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles