పంటల కొనుగోళ్లు ప్రారంభం

Mon,October 21, 2019 03:16 AM

-వరి ధాన్యం కొనుగోలుకు 2,584 కేంద్రాలు
-పెసర్లకు 14, సోయాబీన్‌కు 7 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌లో పండించిన వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలు సర్వం సిద్ధం చేశాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో వానకాలం సీజన్లో ప్రధానంగా వరి, పత్తి, మక్కజొన్న, సోయాబీన్, కందులు, పెసర్లు, మినుములు పెద్ద ఎత్తున మార్కెట్‌కు రానున్నాయి. దీనిని ముందుగానే అంచనావేసిన వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలు వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాయి. పంటలకు మద్దతు ధర పొందేలా తీసుకోవాల్సిన చర్యలపై మార్కెటింగ్‌శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొస్తున్నారు. పండిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాలశాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,584 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది.

జోరుగా పెసర్లు, సోయాబీన్ కొనుగోళ్లు

ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లో పెసర్లు, సోయాబీన్ కొనుగోళ్లు వారంరోజులుగా జోరుగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెసర్లకు క్విటాల్‌కు రూ.7050, సోయాబీన్ రూ.3,710 మద్దతు ధరగా నిర్ణయించింది. పెసర్లు 10,378 టన్నులు, సోయాబీన్ 58,608 టన్నులు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పెసర్ల కొనుగోలుకు 14, సోయాబీన్ కొనుగోలుకు 7 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 5,160 మంది రైతుల నుంచి రూ.33.63 కోట్ల విలువైన 4,769 మెట్రిక్ టన్నుల పెసర్లు, 69 మంది రైతుల నుంచి రూ.0.42 కోట్ల విలువైన 113 మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలు జరిగినట్టు మార్కెటింగ్ అధికారులు వెల్లడించారు.

msp

ప్రతి పంటకూ మద్దతు ధర

-పొరుగు రాష్ట్రాల ధాన్యంపై నిఘా
-మద్దతు ధరల వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. అదేసమయంలో రైతులు నాణ్యమైన సరుకును మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లో మార్కెటింగ్‌శాఖ అధికారులతో కలిసి నిరంజన్‌రెడ్డి మద్దతు ధరల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోని మార్కెట్లకు రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తున్నట్టు ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతినిధులు, మిల్లర్లు తక్కువ తూకాలు వేయడం వంటివి చేయొద్దని, అక్రమాలు జరిగినట్టు తేలితే కేంద్రాన్ని రద్దుచేసి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం తేమశాతంలో మార్పునకు అవకాశం ఉన్నందున.. మిల్లర్లు, ఐకేపీ బృందాలు ముందే పరిశీలించి, దశలవారీగా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆయన సూచించారు.

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడంతో దళారుల జాడ కనుమరుగైందన్నారు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 223 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వవైభవం కల్పించేందుకు కాళేశ్వరం నీటిని తెస్తున్నామన్నారు. రూ. 100 కోట్లతో జాకోరా, చందూర్ ఎత్తిపోతలకు అనుమతులు మంజూరయ్యాయని వెల్లడించారు. పోచారంలో నిర్వహించిన బోనాల పండుగలో పాల్గొన్నారు.
s-p-s-reddy2

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles