హేమాహేమీ హేమాచలం..!

Tue,November 17, 2015 10:26 AM

hemachalam01సింహ స్వామి మానవాకృత విగ్రహం ఇక్కడ ప్రత్యేకం. ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనర్సింహస్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. అర్ధచంద్రాకారంలో ఉన్న పర్వత శ్రేణులు, తలాపున గోదావరి పరవళ్లతో చల్లని పొదరిల్ల వలె అడవి మల్లెలు సువాసనలు వెదజల్లుతాయి. ఆ హేమాహేమీ హేమాచలం ఈ వారం డిస్కవరీ తెలంగాణ...

వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో హేమాచల క్షేత్రం ఉంటుంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం - భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. హేమాచల క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

స్థలపురాణం ఇది...

ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. కాగా దట్టమైన కీకారణ్యంలో శాతవాహన శకం రెండో శతాబ్దం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆశ్రిత జన రక్షకుడు భక్తుల కల్ప తరువు లక్ష్మీనర్సింహస్వామి హేమాచల క్షేత్రంపై స్వయంభూగా వెలిశాడట.

hemachalam02శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహాంతర భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట. మహారాజు 76 వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. స్వామి వారికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అను ఇద్దరు భార్యలు(దేవేరులు) ఉన్నారు. క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి, షిఖాంజనేయ స్వాములున్నారు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నార నర్సింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు.

తైలాభిషేకం స్వామికి ప్రీతికరం

మానవాకృతిలో అతి సున్నితంగా ఉండే ఇక్కడి లక్ష్మీనర్సింహ స్వామికి తైలాభిషేకం అతి ప్రీతికరమని అంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన లక్ష్మీనర్సింహస్వామికి దక్షిణ భారతదేశంలోనే మరే దేవాలయంలో ఇలా తైలాభిషేకం నిర్వహించరు. ఇచట స్వామికి నాభియందు దెబ్బతగలడం వల్ల అక్కడి నుంచి వచ్చే ద్రవానికి చందనం పెట్టి సంతానం లేనివారికి, కుజ, రాహు, కేతువు గ్రహ దోషముల నివారణకు ఈ చందనాన్ని ఇస్తారు.

hanuman
ప్రతి యేటా బ్రహోత్సవాలు

శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతీ యేటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నర్సింహస్వామి జయంతి, స్వామి వారి కల్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాక భలి(నాగబెల్లి), వసంతోత్సవం, నిర్వహిస్తారు.

రాణి రుద్రమ దేవి దర్శనం

మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించడమే కాక ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రం పై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

గుట్ట శిఖరం పై కాకతీయ రాజులు.. కొనేరు, అర్ధ మండపం, గుర్రపు శాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహ రచనలు చేసేవారని చెబుతున్నారు. గోదావరికి కేవలం కోసుపెట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి అవతలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొచ్చే శత్రు సైన్యాలను గుర్తించడానికి దర్పణం ద్వారా వీక్షించే వారని తెలుస్తుంది. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధ కాలంలో రక్షణ కోసం రాణి రుద్రమదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడి కోటలో విడిది చేసేవారట.

17వ శతాబ్దంలో గజనీమహ్మద్ రాక

కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వెయ్యి స్థంభాల గుడి, రామప్ప, కోటగుళ్ల లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధ చంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం.

సర్వరోగ నివారిణి ఇక్కడి జలం

చింతామణి జలపాతం (అక్కధార - చెల్లెధార) సర్వరోగనివారిణిగా చెబుతున్నారు. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి నమ్ముతారు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్రదర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రం పై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమి పై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయట.

కొండ మామిడి చెట్లు ప్రత్యేకం

హేమాచల క్షేత్రంలో కొండ మామిడి చెట్లు విరివిరిగా ఉన్నాయి. ఆకాశమంతా ఎత్తున్న మహా వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి. తెలంగాణ జిల్లాల్లో సహజంగానే ఓ నానుడి కూడా ఉంది. వర్షాకాలం ప్రారంభానికి ముందు మే నెల (వైశాఖ మాసం)లో మల్లూరు పౌర్ణమి బ్రహ్మోత్సవాలు వస్తాయి. అప్పటికి మామిడి పండ్లు సమృద్ధిగా దొరుకుతాయి. దీనికి తోడు అకాల వర్షాలు(ముందస్తు వర్షాలు) కురుస్తాయి. కనుకనే మల్లూరు పున్నమి, మడుగుళ్ల నీళ్లు, మామిడి పండ్లు అనే సామెత వచ్చింది. ఈ కొండ మామిడి పండ్లను స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

షిఖాంజనేయుడు ఫేమస్

రామబంటు ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్న షిఖాంజనేయుడి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయానికి పశ్చిమ భాగంలో కిలోమీటర్ దూరంలో ఈ షిఖాంజనేయ మహా విగ్రహం భక్తులను ఆశ్చర్యముఖులను చేస్తుంది. షిఖాంజనేయుడి పాదాలు, గోర్లు పొడవుగా ఉంటాయి. గంభీరమైన, భీకరమైన, తేజోవంతమైన రూపంతో ఆంజనేయ స్వామి విగ్రహం అతివీర భయంకరంగా ఉంటుంది. దీనికి తోడు ఆలయ ప్రాంగణంలో పంచముఖ ఆంజనేయుడు, ఎద్దు ముక్కు ఆంజనేయుడు, జలాంజనేయుడు రూపాల్లో దర్శనమిస్తాడు.

ఓరుగల్లు టూరిజం సర్క్యూట్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా త్వరలో ప్రారంభించనున్న ఓరుగల్లు టూరిజం సర్క్యూట్‌లో హేమాచల క్షేత్రం కూడా చేరనున్నది. హైదరాబాద్ నుంచి మొదలై నల్లగొండ జిల్లాలోని కొలనుపాక జైన దేవాలయం, సురేంద్రపురి, యాదగిరిగుట్ట, వరంగల్ జిల్లాలోని పెంబర్తి హస్తకళలు, కాజిపేట దర్గా, ఫాతిమా చర్చ్, వెయ్యి స్థంభాల గుడి, భద్రకాళి ఆలయం, వరంగల్ కోట, పాండవుల గుట్టలు, రామప్ప దేవాలయం, కోటగుళ్లు, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క - సారలమ్మ, ఏటూరు నాగారం అభయారణ్యాలు, మల్లూరు క్షేత్రం కలుపుకొని ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పునర్నిర్మాణంలో మల్లూరు క్షేత్రం

వరంగల్ జిల్లాలోని మారుమూల మంగపేట మండలం మల్లూరు సమీప గుట్టల్లో ఉన్న హేమాచల క్షేత్రం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఈ క్షేత్రాభివృద్దికి ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధాన ఆలయం ముందు రూ.60 లక్షలతో ప్లాట్‌ఫాం, ముఖ మండపం ఏర్పాటుకు అధికారులు నిధుల మంజూరి కోసం ప్రయత్నిస్తున్నారు. 2015లో జరుగనున్న గోదావరి పుష్కరాల్లో భాగంగా మల్లూరు గ్రామ సమీపాన గోదావరి నదిపై పుష్కర ఘాట్ నిర్మించడానికి అధికారులు ఇప్పటికే సర్వేలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి వస్తున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా మల్లూరు హేమాచల క్షేత్ర సమీపంలో పుష్కరఘాట్ నిర్మించాలని యోచిస్తున్నారు.

15356

More News

Featured Articles

Health Articles