శివగంగ.. పర్యాటకంగా!

Fri,December 11, 2015 01:21 PM

పల్లె.. పట్నం కలగలిపిన సరికొత్త ట్రావెల్ జోన్ మహేశ్వరం! ఆ మహేశ్వరంలో వెలసిన ఆకాశగంగ.. శివగంగ. ఐదు వందల అడుగుల పొడవు, రెండు వందల యాభై అడుగుల వెడల్పు జలాశయం.
హైదరాబాద్ సమీపంలోని ఈ నేల అబూహసన్ తానీషా కాలంలో పర్యాటకంగా విరాజిల్లింది. అక్కన్న, మాదన్నలు తిరుగాడిన.. ఛత్రపతి శివాజీ అడుగిడిన పుణ్యభూమి ఇది! ఆహ్లాదంతో పాటు.. అలనాటి చరిత్ర తెలుసుకునే భాగ్యం కలిగే పర్యాటక ప్రాంతం. ఈ రోజు మనమూ వెళ్దాం పదండి!

shiv-ganga


మహేశ్వరం హై కాస్ట్ రియల్ ఎస్టేట్‌కు పెట్టింది పేరు. బంగారం పండే నేలలుగా అందరికీ సుపరిచితం ఈ ప్రాంతం. ఒకవైపు పెంకుటిండ్లు ఉంటాయి. మరోవైపు హైక్లాస్ విల్లాలుంటాయి. పేదల పశువుల పాకల పక్కనే పట్నంవాసుల ఫామ్ హౌజ్‌లుంటాయి. స్పెషల్ ఎకనమికల్ జోన్లు ఒకవైపు.. ప్రత్యేకాదాయాన్నిచ్చే పండ్ల.. పూదోటలు మరోవైపు కనిపిస్తాయి. ఇంజినీరింగ్ కళాశాలలు.. అణుశక్తి తయారీ కేంద్రాలకు పెట్టింది పేరు. ఇలాంటి మహేశ్వరాన్ని చూసేందుకు విదేశీ బృందాలు కూడా వచ్చాయంటే అతిశయోక్తి కాదు. మనిషన్నాక మహేశ్వరంలో గజం స్థలం సంపాదించాలి అనుకొనే ఖరీదైన భూమి. పచ్చని పంటపొలాలు.. విశాలమైన రోడ్లు.. అన్నిటికంటే మించి పల్లె.. పట్నం కలగలిపిన ప్రాంతంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మహేశ్వరానికి గొప్ప చరిత్ర ఉన్నది. చరిత్ర లోతుల్లోకి వెళ్లి చూస్తే.. అబ్బుర పరిచే సన్నివేశాలెన్నో మన కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. మహేశ్వరంలోకి అడుగుపెట్టగానే ముందుగా చూడాల్సిన దృశ్యం శివగంగ!

జలగంగ..


ఆ ఊరిపేరు ఇప్పుడు మహేశ్వరం. ఒకప్పుడు మహంకాలి మహేశ్వరం. హైదరాబాద్‌కి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పేరులోనే మహేశ్వరుడున్న ఊరు అది. ఇప్పుడు ఆ ఊరు మాంఖాల్, మహేశ్వరంగా అనే రెండూళ్లుగా విడిపోయింది. శతాబ్దాల కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ ఏలుబడితో ప్రత్యక్ష.. పరోక్ష అనుబంధమున్న ప్రాంతమిది. పార్వతీ పరమేశ్వరులు కొలువున్న ఊరు. మహేశ్వరం అనగానే ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ వెంచర్లు మాత్రమే గుర్తొస్తాయి. మహేశ్వరం నడిబొడ్డున మడుగుగా కనిపిస్తున్న కోనేరు కనిపిస్తుంది. అదే అలనాటి రాజరాజేశ్వరుని కోనేరు శివగంగ! అయిదు వందల అడుగుల పొడవు, రెండు వందల యాభై అడుగుల వెడల్పు ఉన్న జలాశయం ఇది. గంగను జటలో పట్టిన శివుడు.. గంగనీటితో స్నానమాచరించిన చోటు. అంటే శివుడి తలభాగంలో కాకుండా గంగలోనే శివుడు వెలిశాడు ఇక్కడ. కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగి.. సౌందర్యోపాసకులను కట్టిపడేసే మహత్తుగలిగిన శివగంగ ఆలయం పద్మాకారంలో ఉంటుంది. గంగ మధ్యలోనున్న శివాలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు పద్మ రేకుల్లా ఉంటాయి. శివ పార్వతుల ఆలయాలతో పాటు మొత్తం 18 ఆలయాలు.. శివగంగకు నాలుగువైపులా 18 మెట్లు నిర్మించారు.

ఆధ్యాత్మిక కేంద్రం..


మహేశ్వరం పరిసర ప్రాంతాలు ఆ రోజుల్లో ఆధ్యాత్మిక శోభతో భాసిల్లినట్లు నేటికీ కొన్ని ఆధారాలున్నాయి. అక్కన్న మాదన్నల కాలంనాడే ఇక్కడ మరికొన్ని ఆలయాలు వెలసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. నేటి మహేశ్వరంలో ఏదో ఒక చోట శివలింగాలు బయల్పడటమే దీనికి నిదర్శనం. మహేశ్వరంలో అక్కన్న పూజించిన కోదండ రామాలయం, శివగంగ, విష్ణుగంగ అనే కోనేర్లు, వీరమ్మ కుంట అనే చెరువు, వారు కట్టించిన ఒక పెద్ద కోట ఉండేవి. పక్కనే ఉన్న ఫకీర్‌గూడలో హనుమాన్ దేవాలయాన్ని కూడా కట్టించారు. అక్కన్న మాదన్న, తానీషాల యుగం దక్షిణాదిన హిందూ, ముస్లీం సమైక్యతకు నిదర్శనమని ఈ కట్టడాలు.. ఇప్పుడు లభిస్తున్న ఆనవాళ్లు చెప్తున్నాయి. ఈ ప్రాంతమంతా మందిరాలు.. మఠాలతో విలసిల్లింది. ప్రజలు కూడా సుఖంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్న ఆ కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ సుందర కట్టడాలను చూసేందుకు వచ్చిన సందర్శకులకు శివగంగ తెలియని చరిత్రగానే మిగిలిపోయింది. కనీసం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకైనా శివగంగ గొప్పదనం గురించి ఇక్కడి వందల ఏళ్లనాటి సైనికుల కత్తుల ఖణఖణలు.. గుర్రాల గిట్టల చప్పుళ్లు.. శతఘ్నుల భీకర శబ్దాలు.. గుర్రాలపై తిరగాడిన అక్కన్న మాదన్నల వైభవం.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పర్యటన తెలియకుండానే ఉన్నది. ఇవన్నీ తెలిస్తేనే.. శివగంగ ప్రణవనాదాలతో వాతావరణం నిండిపోగా.. మనసు గుడి ఆహ్లాదకరంగా మారితే మహేశ్వరం మంచి పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది!

ఛత్రపతి రాక..


అబూహసన్ తానీష ఆహ్వానం మేరకు గోల్కొండ వచ్చిన మరాఠా మహావీరుడు ఛత్రపతి శివాజీ అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. గోల్కొండలో ఉన్న కాలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలాన్ని దర్శించుకునేందుకు శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ గ్రామాల మీదుగా బయలుదేరాడు. ఆయన పరిజనంతో మాంఖాల్ మహేశ్వరం, జిన్నాయిగూడ నరసింహస్వామి దేవాలయం కూడా దర్శించుకున్నాడు. జిన్నాయిగూడెంలో శివాజీ ఒక కోటను కూడా కట్టించుకున్నాడట. ఆ కోట అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. మరాఠా యోధుడు శివాజీనీ ఆహ్వానించడం.. గోల్కొండలో ఆయన చిత్రపటాన్ని ప్రతిష్టించడం.. సుల్తానుల రాజ్య విస్తరణను అణగదొక్కాలనే ప్రణాళిక వేయడంతో గోల్కొండ రాజ్యంపై ఔరంగాజేబు దాడిచేశాడు. దాంట్లో భాగంగానే గోల్కొండతో అనుబంధమున్న శివగంగపై కూడా దాడిచేసి గుడిని ధ్వంసం చేసి శివలింగాన్ని కోనేరులో దాచిపెట్టారని స్థానికులు అంటున్నారు. అప్పటి నుంచి ఆ ఊరు పేరుకే మహేశ్వరం. ఊళ్లో మహంకాళి గుడి ఉన్నది. మహేశ్వరుడు లేడు. గుడికి కొద్ది దూరంలో గడి.. గడిలో రాముడు లేని గుడి.. ఒక మూలన అమ్మవారి చిన్న గుడి.. ఆ పక్కనే గడిలో అలనాటి మసీదు.. ఇంకోపక్క గడిలో స్కూలు.. ఆ పక్కనే పంచాయతీ ఆఫీసు.. శతాబ్దాల నాటి చరిత్రకు మూగ సాక్షులుగా మారిపోయాయి! అయితే 1980 ప్రాంతంలో శంకర్‌ఖత్రీ అనే ఉపాధ్యాయుడు కొలనులో దాచిపెట్టిన శివలింగాన్ని తీసి పునఃప్రతిష్టించాడు. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మించాడు. శివగంగకు కొంత వైభవాన్ని తీసుకొచ్చాడని స్థానికులు చెప్తుంటారు!

ఎలా చేరుకోవాలి?


నిత్యం సందర్శకులను ఆహ్వానిస్తున్న శివగంగ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉంటుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఆదిబట్ల స్పేస్ సిటీ నుంచి కూడా ఔటర్ రింగ్‌రోడ్డు మీది నుంచి నేరుగా మహేశ్వరంలోని శివగంగకు చేరుకోవచ్చు. ఇక బస్సులో రావాలనుకునేవాళ్లు.. చార్మినార్ నుంచి 253M, 253T, 253K, 253H.. సికింద్రాబాద్ నుంచి 8A/253M, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి 253M బస్సుల్లో రావాలి!

గడికోట..


కాకతీయుల కాలంనాటి చరిత్రకు దర్పంగా ఆలయం పక్కనే గడికోట ఉన్నది. ఈ గడికోటలోనే శివాలయం.. విష్ణుగంగ. కోదండ రామస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ ఏకశిలా నిర్మాణాలే. విష్ణుగంగ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చుట్టూ ఆర్చీలు.. మధ్యలో కొలను అలనాటి అద్భుత కళా నిర్మాణానికి అద్దం పడుతుంది. కోదండ రామస్వామి దేవాలయం వెనుక అక్కన్న మాదన్నల కచేరీ కేంద్రం ఉండేదని స్థానికులు చెప్తున్నారు. ఇంతకూ ఈ శివగంగకు.. మహేశ్వరానికి అక్కన్న మాదన్నలతో సంబంధమేంటంటే.. నాలుగొందల సంవత్సరాల కింద 1658 నుంచి 1687 వరకు గోల్కొండను పాలించిన అబూహసన్ తానీషా కాలంలో ఇదే ఊరిలో ఆయన మంత్రులు అక్కన్న.. మాదన్నలు తిరుగాడేవాళ్లు. నిత్యం అక్కడి ప్రజలతో సహ సంబంధాలను కలిగి ఉండేవాళ్లు. ఇక అక్కన్న మాదన్నల తండ్రి భానూజీ పంతులు మహేశ్వరం పక్కన ఉన్న హన్మకొండలో ఉండేవారు. ఆ గ్రామంలో శిస్తులు వసూలు చేసే అధికారిగా ఆయన పనిచేశారు. భానూజీ పంతులే అక్కన్నపల్లి, మాదన్నపల్లి, భానుపురం అనే మూడు గ్రామాలను నిర్మించాడు. ఇప్పుడు అవి అకాన్‌పల్లి, మన్‌సాన్‌పల్లి, సుభాన్‌పల్లిగా వాడుకలో ఉన్నాయి. అక్కన్న, మాదన్నలు ఈ ప్రాంతంలో 108 దేవాలయాలు కట్టించారట. అందులో ఒకటి మాంఖాల్ మహేశ్వరంలోని రాజరాజ్వేరాలయం. ఇదేకాక మహంకాళి అమ్మవారికి ఇంకొక గుడి కూడా ఉండేది.

14254

More News

Featured Articles

Health Articles