మేడరాజుల.. నంది మేడారం!

Sun,January 8, 2017 03:41 PM

మేడారం అనగానే.. సమ్మక్క సారలమ్మల క్షేత్రమే గుర్తొస్తుంది. మేడారం చూసినప్పుడల్లా.. గుర్తొచ్చే మరో గ్రామం నందిమేడారం. కాకతీయ సామంతులైన మేడరాజుల పాలనకు సాక్ష్యంగా ఈ ఊరు నిలిచి వుంది. పొలవాస కేంద్రంగా సాగిన మేడరాజుల పాలనలో ఇది ఓ వెలుగు వెలిగిందంటారు. చరిత్రకు నిలువుటద్దంగా.. నందులకు కేంద్రంగా నిలుస్తున్న నందిమేడారం.. ఎన్నో విశేషాలను తలపించే పల్లెటూరు!

ఎక్కడ ఉంది?


పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిధిలో. మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరం ఉండగా.. జిల్లా కేంద్రానికి 22 కిలో మీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది.

ప్రత్యేకత ఏంటి?


కాకతీయుల కాలం నాటి 360 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు. ఊరు మధ్యన బృహత్‌నంది విగ్రహం.. బురుజు.. చెరువు అంచున త్రికూటాలయం..అమరేశ్వరస్వామి దేవాలయం.. ఏళ్లనాటి నాగకన్య విగ్రహం నందిమేడారం చారిత్రిక నేపథ్యాన్ని కళ్లకు కడుతూ.. ఆనవాళ్లుగా నిలిచున్నాయి. కాకతీయులకు సామంతులుగా మేడరాజులు పొలాస (జగిత్యాల) నుంచి నంది మేడారం మీదుగా నర్సంపేట తాలూకా దాక పాలించినట్లు గ్రామస్తులు చెబుతుంటారు.

శ్రమైక జీవుల చెరువు


గ్రామంలోని రెండు గుట్టలను కలుపుతూ సుమారు రెండు కిలో మీటర్ల పొడువు కట్టతో 360 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయుల కాలం నాడు నిర్మించిన చెరువు, నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇది సుమారు 500 ఎకరాల భూములకు పైగా రెండు పంటలకు సాగు నీరు అందించడంతో పాటు చుట్టూ పది గ్రామాల ప్రజల తాగునీటికి ప్రధాన వనరుగా ఉన్నది. ఈ చెరువు ఆధారంగా 350 మంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఇలా వందలాది ఏళ్ల చరిత్ర గల నంది మేడారం పెద్ద చెరువు ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో కీలకంగా మారింది. ప్రస్తుతం దీనిని రిజర్వాయర్‌గా మార్చి మొదట ఎల్లంపల్లి నీటిని ఇక్కడికి.. ఇక్కడి నుంచి పైకి ఎత్తిపోస్తున్నారు.

Nandimedaram

కాకతీయుల కళావైభవం


గ్రామంలోని చెరువు కట్టపై తూర్పు చివరిభాగంలో నాటి త్రికూటాలయం కాకతీయుల కళావైభవానికి తార్కాణం. పర్యవేక్షణ కరువై తూర్పు.. దక్షిణ గర్భగృహాలు.. ఉత్తరాన ఉన్న ప్రవేశ మండపం, కూలిపోయిన పడమటి గర్భగృహం.. ప్రధాన మండపం నేటికీ చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచి ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. 16 స్తంభాలతో కూడిన విశాల మండపం చుట్టూ పిట్టగోడ ఇక్కడ ప్రత్యేకం. ఈ త్రికూటాలయం కళారీతిలో వేయి స్తంభాల గుడిని తలపింపజేస్తున్నది.

వేయిస్తంభాల గుడి పోలిక


కాకతీయుల పరిపాలనా చిహ్నంగా శతాబ్దాల క్రితం చెక్కించిన భారీ రాతి నంది విగ్రహం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. దీని ముందు కాకతీయుల కాలం నాటి శిథిల ఆలయాన్నీ చూడవచ్చు. ఇక్కడే ఉన్న శిలాస్తంభం, నాగినిప్రతిమ, గణపతి, సప్తమాతృకలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక నందివిగ్రహమైతే అచ్చంగా హన్మకొండ వేయిస్తంభాల గుడి ముందరి నంది విగ్రహాన్ని పోలి ఉంటుంది. పరిమాణంలోనూ దాదాపు సమానంగా ఉంటుంది. హన్మకొండంలోని విగ్రహం 8 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు ఉండగా.. నంది మేడారంలోని విగ్రహం ఏడున్నర అడుగుల పొడవు, 5.8 అడుగుల ఎత్తు ఉందని పరిశీలకులు అంటారు.

కన్య రూపంలో నాగదేవత


చెరువు కట్ట అంచున అమరేశ్వర స్వామి ఆలయం వద్ద పురాతన నాగకన్య విగ్రహం ఉంది. ఈ నాగదేవత కన్య రూపంలో దర్శనమివ్వడం విశేషం. శిల్పం పైభాగంలో స్త్రీ రూపంలో.. నాభి నుంచి దిగువకు సర్ప రూపంలో ఉండి తలపై అనేక పడగలు కనిపిస్తాయి. సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు పుడతారని ప్రజలు విశ్వసిస్తారు. చెరువు కట్టపై అమరేశ్వర స్వామి ఆలయం.. నందిమేడారంతో పాటు వివిధ గ్రామాల భక్తులతో పూజకు నోచుకుంటున్నది.

పది ఊర్లు కనిపించే బురుజు


త్రికూటాలయం వెనుక భాగాన బురుజు నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నది. ప్రత్యేక మెట్ల మీదుగా పైకెక్కి చూస్తే చుట్టూ పది గ్రామాలు కనిపిస్తాయి. కొన్ని మైళ్ల దూరం వరకూ రహదారిపై వచ్చే వాహనాలు కనిపిస్తాయి. మేడరాజుల కాలంలో శత్రువుల రాకను పసిగట్టేందుకు ఈ బురుజును నిర్మించినట్లు చరిత్రకారులు చెప్పారు. ఇలా నంది మేడారం చారిత్రికంగానేగాక.. పాడిపంటలతో తులతూగుతూ తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించింది.
Amareshwara-Temple

పర్యటక కేంద్రమైతే:


నంది మేడారానికి అనేక సంవత్సరాల చరిత్ర ఉంది. గత పాలకులు ఏనాడు గ్రామాన్ని పట్టించుకొలేదు. దీంతో చారిత్రక సంపద మట్టిలో కలిసిపోయింది. సర్కార్ ప్రత్యేక చోరవ తీసుకొని మేడారాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. భవిష్యత్ తరాలకు నంది మేడారం చరిత్ర తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలి.
గజవెళ్లి ప్రభాకర్, పూజారి

వందల ఏళ్ల చరిత్ర:


నంది మేడారంలో కాకతీయుల కాలం నాటి (క్రీ.శ 1175) శిలా శాసనాలు ఉన్నాయి. మా ఊరు చారిత్రక గ్రామంగా గుర్తించబడింది. సుమారు 941 ఏళ్ల కిందటిట త్రికూటాలయం, అమరేశ్వరాలయం, భారి నంది విగ్రహాలు ఇప్పటికి చెక్కు చెదరలేదు. కాకతీయుల కాలం నాటి పెద్ద చెరువు ఉంది. ఇంత పెద్ద చరిత్ర ఉన్నప్పటికి గత పాలకులు దృష్టి పెట్టలేదు.
-మగ్గిడి మల్లయ్య, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు

నంది మేడారంలోని నంది విగ్రహం ఏడున్నర అడుగుల పొడవు, 5.8 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఈ నందివిగ్రహం అచ్చంగాహన్మకొండ వేయిస్తంభాల గుడి ముందరి నంది విగ్రహాన్ని పోలి ఉంటుంది.
Nandi

ఊరు: నంది మేడారం
మండలం: ధర్మారం
జిల్లా: పెద్దపల్లి
గ్రామం కోడ్: 572018
పిన్‌కోడ్: 505416
జనాభా: 6235 (2011 జనాభా లెక్కల ప్రకారం)
పురుషులు: 3064
స్త్రీలు: 3171
ఇండ్లు: 1603
అక్షరాస్యత: 46శాతం
ప్రధాన వృత్తి: వ్యవసాయం
వ్యవసాయ భూముల విస్తీర్ణం: 4442 ఎకరాలు
చెరువు విస్తీర్ణం: 360ఎకరాలు
తూర్పు: బొట్ల వనపర్తి
పడమర: ధర్మారం
దక్షిణం: కటికెనపల్లి
ఉత్తరం: సాయంపేట

16306

More News

Featured Articles

Health Articles