మహిమాన్వితం.. శివగంగ ఆలయం

Fri,March 4, 2016 12:16 PM

పద్మాకారంలో ఆలయం. కింద గం గమ్మ.. మధ్యన రాజరాజేశ్వరి మాత..ఆ పైన త్రినేత్రుడు కొలువుదీరిన మహాద్భుతమైన చోటు. చుట్టూ పద్మరేకుల్లా చిన్నచిన్న శివాలయాలు.., రావి, వేప, మేడి చెట్లు అల్లుకొని త్రివృక్షమై బాసిల్లుతున్న ప్రాంతం..అదే మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం. కాకతీయుల కాలంలో నిర్మాణమైన ఈ ఆల యం దినదినాభివృద్ధి చెందుతూ..భక్తుల కొంగుబంగారమై అలలారుతోంది. ఈకోవెల 6తేదీ నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. -మహేశ్వరం

కాకతీయుల కాలంలో రాజరాజేశ్వరస్వామి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరం అని పేరు వచ్చింది. శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సందర్శకులను ఇట్టె కట్టిపడేస్తుంది. ఈ ఆలయ నిర్మాణం పద్మాకారంలో ఉంటుంది. దీనిచుట్టూ శ్రీహరిహరేశ్వరుడు, శ్రీమల్లీశ్వరుడు, శ్రీఅవిముక్తేశ్వరుడు, శ్రీఅఘోరేశ్వరుడు, శ్రీఅమరేశ్వరుడు, శ్రీఅమృతేశ్వరుడు, శ్రీగంగాధేశ్వరుడు, శ్రీఇష్టకామేశ్వరుడు, శ్రీముకేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీఏకాంబేశ్వరుడు, శ్రీమణికర్ణికేశ్వరుడు, శ్రీమహానందీశ్వరుడు, శ్రీఅమరావతీశ్వరుడు, శ్రీకాశీపతీశ్వరుడు, శ్రీమంగళగౌరీశ్వరుడు ఆలయాలు పదరేకుల్లా ఉంటాయి.

ఆలయంలోని అష్టాదశంగా (18 సంఖ్య వచ్చేలా) నిర్మించడం విశేషం. సహాజంగా శివుడి తలపై గంగ ఉంటుంది. ఇక్కడ మాత్రం గంగలోనే శివుడు ఉండడంతో ఆయన కింది భాగంలోనే రాజేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివగంగలో స్నానమాచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకం.

చరిత్రకు నిలువుటద్దం గడికోట
కాకతీయుల కాలం నాటి చరిత్రకు నిలువుటద్దంగా ఆలయం పక్కనే గడికోట నిర్మాణం నేటికీ నిలిచి ఉంది. కొంత శిథిలావస్థకు చేరినప్పటికీ కోటలోని కట్టడాలు నేటికి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గడికోట చుట్టూ ఆర్చ్‌లతో పాటు మధ్యలో ఉన్న కొలను ను అద్భుతంగా నిర్మించారు.

మహత్యం..త్రివృక్షం...:
ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర ఉంది. రావి, వేప, మేడి చెట్లు ఒకేచోట పెరగడంతో దీన్ని తివృక్ష చెట్టుగా పిలుస్తారు. పిల్లలు కానివారు ఈ చెట్లకు కొత్త కొబ్బరికాయ కట్టితే పిల్లలు పుడుతారని నమ్మకం. ఈవృక్షం కిందనే నాగేంద్రాలయం ఉంది.

శివగంగకు దారి ఇలా..:
ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలో మీటర్లు దూరంలో ఉంటుంది. ఫలక్‌నుమా, మిధాని, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ డిపోల నుంచి బస్సు సౌకర్యం ఉంది. జూబ్లీబస్ స్టేషన్ నుంచి మహేశ్వరానికి 253/ 90కె, చార్మినార్ నుంచి 253 ఎం, 253 కె, 253 టి, 253 హెచ్, సికింద్రాబాద్ నుంచి 8ఎ/ 253ఎం. జూబ్లీహిల్స్ నుంచి 253 ఎం, బస్సులు ఎక్కాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఔటర్‌రింగ్ రోడ్డు మీది నుంచి తుక్కుగూడ వరకు వచ్చి శ్రీశైలం రహదారి మీదుగా మహేశ్వరం గేట్ కమాన్ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చరిత్ర...
తానీషా నవాబుల వద్ద పని చేసిన అక్కన్న మాదన్నలు 1672లో వారి పర్యటనలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగాన 37 కిలో మీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. శంషాబాద్ మండలంలోని చిన గోల్కొండ, పెద్ద గోల్కొండ గ్రామాల మీదుగా అక్కన్న ,మాదన్నలు ఇక్కడికి చేరుకునేవారట.

మహేశ్వరం ఆలయంతో పాటు సమీపంలోనే కోదండరామస్వామి ఆలయం, శివగంగ పుష్కరిణి, విష్ణు భగవాన్, ఆంజనేయస్వామి ఆలయాలను సైతం అక్కన్న మాదన్నలు నిర్మించినట్లు ప్రతీతి . ఎనిమిదేళ్ల కాలంలో వీటి నిర్మాణం పూర్తయినట్లు చరిత్ర చెబుతోంది. 1677లో ఈ ఆలయం పునర్‌నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళ్లిన శివాజీ కూడా రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది. 1687లో ఔరంగజేబు దాడిలో గుడిని ధ్వంసమైనట్లు చెబుతుంటారు.

22270

More News

Featured Articles

Health Articles