కొల్లేరును మించిన కొలను

Tue,November 17, 2015 10:33 AM

పక్షుల కిలకిలారావాలు.. ఎత్తైన చెట్లు.. పరుగులు తీసే జింక పిల్లలు.. పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు.. ఖండాంతరాల నుంచి వలసవచ్చి విడిది చేసే పక్షులు.. జలపాతాన్ని మరిపించే ఆనకట్ట.. అందులో ఈదుతూ కేరింతలు కొట్టే బుడతలు.. ఇలా ఎంత చెప్పినా తరగని అందం ఆ ప్రాంతం సొంతం! మనం ఇప్పటి వరకు పులికాట్, కొల్లేరు సరస్సుల గురించి విన్నాం.. అక్కడికి దేశ, విదేశాల నుంచి పక్షులు వేసవిలో వలసవస్తాయని చదువుకున్నాం. మనకు తెలియని కఠోర నిజం సీమాంధ్రుల పాలనలో సమాధి అయింది. అదేంటంటే.. తెలంగాణలోనూ ఓ కొల్లేరు లాంటి సరస్సు ఉంది.. అక్కడికీ దేశ, విదేశాల నుంచి పక్షులు వలసవస్తాయి. అదే పోచారం ఆనకట్ట తీర ప్రాంతం. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం అభయారణ్యం, ఆనకట్ట, విదేశీ పక్షుల సోయగాలను చూసి తీరాల్సిందే!
నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కన్నా ముందు పోచారం ఆనకట్టను నిజాంనవాబు నిర్మించారు.

kolleru1916లో గాంధారి, భీమేశ్వరవాగులపై పోచారం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాడు. అతి పెద్ద రాతికట్టడమిది. మీర్ నవాబ్ అలీ జంగ్ సారథ్యంలో ప్రారంభైన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. రెండు మండలాలను సస్యశ్యామలం చేస్తుందీ పోచారం ప్రాజెక్టు. నిజాం నవాబు విడిది చేసేందుకు వీలుగా 1918లో ఇక్కడ ఓ గెస్ట్‌హౌస్‌ను సైతం నిర్మించారు. ఆ గెస్ట్‌హౌస్ పైనుంచి జలజవ్వని అందాలను తిలకించడం ఓ మధురానుభూతి. వర్షాకాలంలో పోచారం డ్యాం అలుగు పారుతుంటే కుంటాలను మరపించేలా జలధారాలు పడ్తుంటాయి. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తారు.

విదేశీ పక్షుల విడిది...

పోచారంప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వ్యాపించే వదల్‌పర్తి, మాలపాటి గ్రామాలకు సైబీరియా నుంచి పక్షులు పెద్ద సంఖ్యలో వలసవస్తాయి. సైబీరియా దేశంలో అక్టోబర్ నెలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. అక్కడ నీరు గడ్డకట్టుకు పోతుంది. దీంతో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో అక్కడ నివసించే పెయింటెడ్ స్టార్క్ అనే జాతికి చెందిన పక్షులు పెద్ద సంఖ్యలో పోచారం డ్యామ్ వద్దకు తరలివస్తాయి. ఆ మాటకొస్తే మెదక్ జిల్లాలోని మంజీరనది తీరప్రాంతమంతా కూడా ఈ పక్షులకు విడది కేంద్రమే! అక్టోబర్ నుంచి మే వరకు అవి ఇక్కడే ఉంటాయి. ఆ సమయంలో గుడ్లు పెట్టి సంతతిని ఉత్పత్తి చేసుకొని మే నెలలో తిరిగి సైబీరియా వెళ్లిపోతుంటాయి.

పొడుగాటి మెడతో కింది నుంచి మెల్లిగా ఎగిరే ఈ జాతి పక్షులను చూడడం నిజంగా ఓ మధురానుభూతి. వీటితో పాటు రామేశ్వరం, నేలపట్టు తదితర ప్రాంతాల నుంచి వివిధ జాతులకు చెందిన పక్షులు వలసవస్తాయి. పోచారం ప్రాజెక్టుకు ప్రధాన జలవనరులుగా ఉన్న భీమేశ్వరవాగు, గాంధారి వాగుతో పాటు చుట్టూ 30 గొలుసుకట్టు చెరువులు ఉండడంతో తాగునీటికి కొరత ఉండదనే భరోసాతోనే ఇక్కడికి దేశ, విదేశాల నుంచి పక్షులు వస్తాయని స్థానికులు చెబుతున్నారు.

అభయారణ్యం..

చెంగుచెంగున గెంతే లేడిపిల్లలు.. ఒయ్యారి నడకల మయూరాలు .. దాడి చేసేందుకు సిద్ధం అన్నట్లు మిడిగుడ్లేసుకొని చూసే అడవి పందులు, మెల్లగా కదలాడే ఉడుములు, సాంబార్లు, కుందేళ్లు ఇలాంటి ఎన్నో వన్యప్రాణులను ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. 1952లో ప్రారంభమైందీ పోచారం అభయారణ్యం. ఇది నిజామాబాద్ జిల్లాలో 55 శాతం, మెదక్ జిల్లాలో 45 శాతం మేర విస్తరించి ఉంది. 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో వన్యప్రాణులను అత్యంత సమీపం నుంచి చూడొచ్చు. 62 ఎకరాల విస్తీర్ణంలో కంచెను ఏర్పాటు చేసి జింక పిల్లల పునరుత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు.

ఇక్కడ కష్ణజింకలు, మచ్చల జింకలు, సాంబార్‌లు కనిపిస్తాయి. జూన్‌మాసంలో తొలకరికి ముందు ఈ అభయారణ్యాన్ని దర్శిస్తే అద్భుతమైన దశ్యాలు కనిపిస్తాయి. తొలకరికి ముందస్తుగా కురిసే వర్షం వల్ల వచ్చే భూమి పరిమళాన్ని ఆస్వాదిస్తూ మయూరాలు పురివిప్పి నాట్యమాడుతాయి. ఆ దశ్యాలు కనువిందు చేస్తాయి.

ఎలా వెళ్లాలంటే..

హైదరాబాద్ నుంచి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అభయారణ్యం. హైదరాబాద్ నుంచి మెదక్ పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి బాన్సువాడ వెళ్లే రూట్‌లో పోచారం అభయారణ్యం, డ్యాం, వలసపక్షుల వదల్‌పర్తికి చేరుకోవచ్చు. తూప్రాన్, మెదక్ మీదుగా కూడా పోచారం చేరుకోవచ్చు. విడిది చేసేందుకు అతిథిగహాలు లేవు. నిజాంకాలంలో నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు శిథిలావస్థకు చేరాయి. వాటికి మరమ్మతులు చేస్తే పర్యాటకంగా మరింత అభివద్ధి చెందే అవకాశం ఉంది. ఇలాంటి అద్భుతాన్ని మన తలాపున పెట్టుకొని ఎక్కడో ఉన్న కొల్లేరు అందాలను వెదుక్కుంటూ వెళ్లాం! ఇకనైనా మన ప్రభుత్వం మన ఈ చెరువు మీదికి దష్టి మళ్లించి కొల్లేరును మించిన కొలనుగా వద్ధిచేయాలని, చేస్తుందనీ ఆశిద్దాం!

13435

More News

Featured Articles

Health Articles