ఒకప్పటి ఓంకార పట్టణమే కోహీర్ దక్కన్

Mon,December 5, 2016 05:04 PM

KHOHEER
మీ ఊరి గురించి మీరు రాసుకోవడం ఒక అదృష్టం. అలాంటి అవకాశం మేమిస్తున్నాం. మీ ఊరికి ఎన్నో విశేషాలు ఉండొచ్చు. చరిత్రకు ఆనవాళ్లుగా.. శిథిలాలై పడివున్న మట్టిగోడలకూ ఓ నేపథ్యం ఉండొచ్చు. ఆ విశేషాలు మన ఊరి కథ రూపంలో బతుకమ్మకు రాయండి. అద్భుతమైన కళాసంపద, అంతకు మించిన ప్రకృతి సోయగం.. చారిత్రక నేపథ్యం, దాన్ని మించిన ఆధ్యాత్మిక వైభవం.. కోహీర్ దక్కన్ సొంతం. ఎన్నో రాజవంశీయుల ఏలికలో తన ప్రాభవాన్ని చాటుకుంది. ప్రత్యేకతను నిలుపుకొంది. క్రీస్తుపూర్వం ఓంకార పట్టణంగా వెలసి, అనంతరం కోవూరు పట్టణంగా పిలువబడి, అందరి నోళ్లనూ తీపిచేసి, నేడు కోహీర్‌గా ప్రశస్తికెక్కిన మా ఊరి కథ.. ఎప్పటికీ ఒడవని ముచ్చటే..

* * *
ఊరు: కోహీర్ దక్కన్ (ఓంకార పట్టణం)
జిల్లా : సంగారెడ్డి
మండలం : కోహీర్
మొత్తం జనాభా :15,075
పురుషులు : 7,446
స్త్రీలు : 7,629
అక్షరాస్యత : 40%
కుటుంబాలు : 3,082
KHOHEER3నేడు కోహీర్‌గా పిలుస్తున్న మా ఊరు ఒకనాడు ఓంకార పట్టణంగా విలసిల్లింది. ఈనేలపై కొలువైన ఓంకారేశ్వరుడి పేరు మీదనే.. ఊరిపేరు ప్రసిద్ధికెక్కినట్టు చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 3700 సంవత్సరంలో కపిల వంశీయుడైన శ్రీ సుదర్శన చక్రవర్తి దండకారణ్య రాజ్యాన్ని ఓంకార పట్టణం రాజధానిగా పాలన సాగించాడట. అనేక తరాలు మారిన పిదప.. ఈ పట్టణం కాకతీయుల స్వాధీనంలోకి వెళ్లింది. వారి పాలనలో అద్భుత శిల్పకళా సంపదతో, ముఖ్య పట్టణంగా విలసిల్లినట్టు ఇక్కడ వెలువడిన శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఓంకారేశ్వర ఆలయం సమీపంలో ఉన్న వీరగల్లు విగ్రహం.. కాకతీయుల పాలనకు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ దొరికిన మరిన్ని శిలాసంపదల్ని పరిశీలిస్తే.. జైనమతం కూడా ప్రాచుర్యంలో ఉన్నట్టు అవగతమవుతుంది.

కోహీర్‌గా మారిన ఓంకారపట్టణం


క్రీ.శ 1323లో ప్రతాపరుద్రుని ఓడించిన ఢిల్లీ సుల్తానులు ఈ ఓంకార పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. అనంతరం హైదరాబాద్ పాలకుడు మహ్మద్ కులీ కుతుబ్‌షా, బీదర్ రాజు అలీబరీర్‌ను ఓడించి.. ఈ ప్రాంతాన్ని జయించాడు. చాలా ఏళ్లపాటు ముస్లిం రాజుల ఏలుబడిలో కొనసాగిన ఓంకార పట్టణం.. కోవూరుగా పేరు మార్చుకుంది. అనంతరం బ్రిటీష్‌వారి కాలంలో కోహీర్ దక్కన్‌గా స్థిరపడిపోయింది. అయితే ఈ పేరు మార్పుపై ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడికి వలసవచ్చిన మౌలానా మొయిజొద్దిన్.. శీతాకాలంలో ఆకులపై పడిన మంచుబిందువులు సూర్యరశ్మికి మెరవడం చూసి.. ఏ కొహర్ కిత్నా అచ్చా హై అని మురిసిపోయాడట. పారశీక భాషలో కొహర్ అంటే తుషారమని అర్థం. ఆ కొహరే, కోహీరుగా మారిందని చెబుతారు.

KHOHEER4 వారణాసి పుణ్యక్షేత్రం కేంద్రంగా, దేశంలో విధురనగరం, ధర్మపురి క్షేత్రం, ఏకశిలానగరం, శ్రీశైలం, కాదంబరి, విజ్ఞానశాఖ క్షేత్రాలు ఏర్పడినాయి. వాటితో అనుసంధానం ఉన్న దివ్యక్షేత్రమే ఇక్కడి ఓంకారేశ్వర ఆలయం. క్రీస్తు పూర్వం నుంచి ఇక్కడ ఓంకారేశ్వరుడు భక్తులతో పూజలందుకొంటున్నాడు. రాణి రుద్రమదేవి బీదర్‌కోటను జయించాక, ఈ స్వామిని దర్శించుకుని వెళ్లిందని చరిత్రకారులు చెబుతారు. పూర్తిగా శిథిలమైన ఆ ఆలయాన్ని.. ఇప్పుడు నూతనంగా నిర్మించారు. ఓంకారేశ్వర పీఠాధిపతి శ్రీ ప్రతాప దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ప్రతిఏటా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

మసీదుగా మందిరం..!


కోహీరు పట్టణంలో ఒక పెద్దకోట, చుట్టూ రక్షణగా పెద్ద కందకం, నాలుగు సింహ ద్వారాలు ఉండేవి. శత్రుమూకల దాడితో, ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ రాళ్లను తీసుకెళ్లి బీదర్‌రాజు అలీబదీర్.. తనరాజ్యంలో భవనాలను కట్టించుకున్నాడు. ప్రతాపరుద్రుడు నిర్మించిన ఎక్కలదేవి ఆలయాన్ని.. కాలక్రమంలో వచ్చిన ముస్లిం రాజులు మసీదుగా మార్చినట్టు గ్రామస్తులు చెబుతుంటారు. ఆ ప్రాంగణంలో కాకతీయుల కాలం నాటి శిలావైభవం స్పష్టంగా కనిపిస్తుంది.

దీని గోపురం నీడ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతిరెడ్డిపల్లిలో కనిపించేదని చెబుతారు. అక్కడే ఉన్న ఎక్కలదేవి కుంటలో ఎప్పుడూ నీరుండేదట. పశువులకు సుస్తి చేసినపుడు ఆ నీటిలో మునిగించి తీసుకొస్తే బాగవుతుందని నమ్మేవాళ్లు. చిన్నపిల్లలు సోమిడి అనే వ్యాధితో బాధపడుతుంటే.. ఆదివారం అమావాస్యరోజున ఆ నీటిలో మునకేయిస్తే నయమవుతుందని విశ్వసించేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ కుంట కనుమరుగైంది.

మహమ్మదీయుల రాక..


దేవగిరి రాజులు బలహీనపడటంతో మహ్మదీయులు మెల్లగా ఓంకార పట్టణంలోనికి ప్రవేశించారు. ఊరు చివర అనుచరులతో కలిసి నివాసం ఏర్పర్చుకున్న మౌలానా మొయిజుద్దీన్ మరణించాక, ఆయన గుర్తుగా అక్కడ మౌలానా మొయిజుద్దీన్ దర్గా ఏర్పడింది. ఇక్కడ ఏటా ఉర్సు నిర్వహిస్తారు. నిజాం అనుచరుడు సిద్ధిఖ్‌హిలాల్ చేసిన విధ్వంసానికి గుర్తుగా.. నాటి పాలకుడు సదాశివరెడ్డి ఈ దర్గా సమీపంలో నిర్మించిన గాయ్‌గుమ్మజ్‌ను చూడొచ్చు.

ఆ కాలంలోనే బడి, పొగబండి..


కోహీర్ దక్కన్ మీదుగా 1920లోనే రైలు కూత పెట్టింది. బీదర్- వికారాబాద్ మధ్య రైలు మార్గాన్ని బ్రిటీషువారు వేశారు. ఎక్కువగా గూడ్సు రైళ్లకోసమే ఈ లైన్‌ను ఉపయోగించేవారట. కాలక్రమంలో అనేక ఎక్స్‌ప్రెస్‌రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఈ మార్గం ద్వారా వెళ్లడం ప్రారంభించాయి. 1952లో ఈ పరగణాలో ఉన్నత పాఠశాల ఏర్పడింది. హోంశాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్, మాజీ ఎంపీ ఎం.బాగారెడ్డి, కర్ణాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు తదితర ప్రముఖులు ఇక్కడ విద్య అభ్యసించారు.

ఎర్రమన్ను వెరీ స్పెషల్...


కోహీరు మన్ను కోహీనూరు వజ్రమంత దృఢమైందని అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఇక్కడి మట్టికి అంతటి జిగి.. పకృతి వరంగా అబ్బినదే. ఇక్కడ పండించే అల్లం కూడా నేటికీ కోహీర్ అల్లంగానే మార్కెట్‌లో ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడి ఎర్ర జామపండుకున్న టేస్టు మరెక్కడా దొరకదు. కోహీర్ జామపండుగా ప్రపంచమంతా అది సుపరిచితమే!

మరుగున పడిన కోహీర్


మా చరిత్ర ప్రపంచానికి చెప్పేందుకి ప్రతాప దక్షిణామూర్తిగారి ఆశీస్సులతో ఓంకారీశ్వరీయం పుస్తకం రాశాను. చిన్నప్పట్నుంచి చారిత్రక కట్టడాల్ని, శిల్పకళావైభవాన్ని చూస్తూ పెరిగాను. అందుకే మా ఊరి చరిత్రపై నాకెంతో మక్కువ.
జి. విజయకుమార్ రెడ్డి, సాహితీవేత్త

మా ఊరికి మూలం


కోహీర్ దక్కన్‌గా ప్రసిద్ధికెక్కిన మా ఊరికి చాలా చరిత్ర ఉందని, మా పెద్దల ద్వారా తెలుసుకున్నాం. ఆ చరిత్రకు సాక్ష్యంగా అద్భుతమైన శిల్ప సంపద ఇక్కడ ఉంది. మరెన్నో కట్టడాలు ఇక్కడ బయటపడుతున్నాయి.

మంజీరాకు ప్రతిరూపం నారింజ..


జిల్లావ్యాప్తంగా పరవళ్లు తొక్కే మంజీరా నదికి ప్రతిరూపమైన నారింజవాగు.. కోహీర్ పరిసరాల్లోనే పుట్టడం విశేషం. బిలాల్‌పూర్‌లో వెలిసిన మునేశ్వరుడి పాదాల దగ్గర పుట్టిన నారింజవాగు, కోహీర్ చుట్టూ అర్ధచంద్రాకారంలో ప్రవహించి.. అనంతరం కర్ణాటకలోకి ప్రవేసించి మంజీరాలో కలుస్తుంది. హిందూమత సహనం, క్రైస్తవసోదర ప్రేమ, ఇస్లాం సామాజిక ఐక్యత.. కలగలిసి గంగ జమునా తెహజీబ్‌కు అద్దంపడుతూ ముందుకు సాగుతున్న .. మా కోహీర్ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. బక్క బాబూరావు, సాహితీవేత్త


7292

More News

Featured Articles

Health Articles