అయ్యన్నదేవుడి ఆధ్యాత్మిక కల్పనే.. ఐనవోలు!

Mon,December 19, 2016 04:59 PM

జనపదులకు..
జానపద జాతరలకు తెలంగాణ పల్లెలు కేంద్ర బిందువుల్లాంటివి. ఇక్కడ పుట్టమన్నుతో పూజలు చేస్తారు. పసుపు బండారిని దేవుడిగా కొలుస్తారు. పట్నాలు వేస్తారు.. బోనాలు ఎక్కిస్తారు. ఏదో ఒక ఊరిలో నిత్యకళ్యాణంగా ఇవి జరుగుతూనే ఉంటాయి.

వందలయేళ్ల నుంచి సంప్రదాయంగా వస్తున్న అలాంటి జానపద సంస్కృతికి ప్రధాన వేదికలాంటి గ్రామమే
ఐనవోలు. కాకతీయులు.. పశ్చిమ చాళుక్యులు.. ఢిల్లీ సుల్తానులతో అనుబంధమున్న ఐనవోలు గ్రామంలోకి అడుగుపెట్టగానే శత అష్టోత్తర స్తంభాలతో..కాకతీయ శిల్పకళా తోరణాలతో విశేషంగా ఆకర్షిస్తూ స్వాగతం పలుకుతుంది!

పుట్టమన్నుతో పూజించే మల్లన్నను మైలారుదేవుడిగా పేర్కొంటారు. కాకతీయులకు పూర్వం నుంచే
ఈ మైలారుదేవుళ్లు ఉన్నారట. ఒక చేతిలో ఖడ్గం.. మరొక చేతిలో త్రిశూలం..
కోరమీసంతో ఉండే ఆ దేవుడిని ఖండేల్‌రాయుడని కూడా అంటుంటారు.
తెలంగాణలోకెల్ల అతి ఆరాధ్యమైన ఖండేల్‌రాయుడిగా వందలయేళ్ల నుంచి ఐనవోలు మల్లన్న పూజలందుకుంటున్నాడు. ఆ దేవుడి పేరుమీదే ఐనవోలు గ్రామం ఏర్పడింది. గండాలు తీరితే గండదీపం పెడతాం..

కోరికలు తీరితే కోడెను కడతాం.. పంటలు పండితే పట్నాలు వేస్తాం.. పిల్లజెల్ల సల్లంగా వుంటే శేవలు తీస్తాం అంటూ చెల్లించే మొక్కులతో ఐనవోలు మార్మోగుతుంది!
JATARAఎక్కడ? : వరంగల్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో.
ప్రత్యేకత : చరిత్రాత్మక గ్రామం. పశ్చిమ చాళుక్యుల రాజ్యపాలనకు.. కాకతీయుల కళావైభవానికి దర్పణం పడుతూ చరిత్రకు చెక్కు చెదరని సాక్ష్యంగా దర్శనమిస్తోంది.
పేరెలా వచ్చింది? : కాకతీయుల పరిపాలనా కాలంలో అయ్యన్నదేవుడు అనే మంత్రి ఉండేవారు. ప్రతీ గ్రామాన్ని సందర్శించి రాజులకు.. ప్రజలకు వారధిగా పనిచేసేవారట. విశాలమైన ప్రాంతం.. ఆహ్లాదకర వాతావరణం.. చూడముచ్చటైన వృక్ష సంపద ఉండటంతో అయ్యన్నదేవుడికి నచ్చిందట. మైలార్‌దేవుడిగా కీర్తింపబడుతున్న ఖండేల్‌రాయుడికి అయ్యన్నదేవుడు ఆలయం నిర్మించాడు. అక్కడున్న శాసనాలే వీటి గురించి తెలుపుతూ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆయన ప్రత్యేకశ్రద్ధ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆధ్యాత్మికకేంద్రంగా తీర్చిద్దాడు. కాలక్రమేణా ఈ గ్రామం అయ్యన్నవోలుగా పిలుపునందుకుని.. తదనంతరం ఐనవోలుగా మారిందని స్థానికులు చెప్తున్నారు.

చాళుక్యుల నుంచే : అయితే పశ్చిమ చాళుక్యుల కాలంలోనే ఈ ప్రాంతాన్ని అయ్యన్నవోలుగా పిలిచేవారని కొందరంటుంటారు. చాళుక్యరాజైనఇరవబెండగ సత్య శ్రీయని కాలంలో (1077-1129) రాజ్యపాలన చేసి త్రిభువనామల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి కాలపు శాసనంలో అయ్యన్నవోలు ప్రస్తావన ఉందని చెప్తున్నారు. క్రీస్తుశకం 1369లో పద్మనాయక రాజైన అనపోత నాయకుడు ఐనవోలుకు వచ్చి మైలార్‌దేవుడికి ప్రత్యేక పూజలు చేసేవాడని.. ఫలితంగా అనేక యుద్ధాల్లో విజయాలు సాధించాడని శాసనాలు సూచిస్తున్నాయి. ఆ కాలం నుంచే మల్లన్న భక్తులకు కొంగుబంగారంగా మారాడు.

ఆధ్మాత్మిక శోభ : ఊర్లోకి ప్రవేశించగానే శిలలతో అబ్బురపరిచే అష్టోత్తర స్తంభాలు.. విశాల ఆలయ ప్రాంగణం.. రాతి ప్రాకారాలు దర్శనమిస్తాయి. ఇదే గ్రామీణ జనంతో ఐలోనిగా పిలువబడే ఐనవోలు క్షేత్రం. కాకతీయుల కాలంలో తొలుతగా ఆయుధాలను భద్రపరిచే కేంద్రంగా ఉపయోగించుకోవడానికి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలు స్తోంది. ఖిలా వరంగల్‌లోని కాకతీయ కళాతోరణాల్లాంటివి ఇక్కడమాత్రమే కనిపిస్తాయి. కళాసక్తిని సూచిస్తూ నృత్యమంఠపం విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక మల్లికార్జునుడి ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగుతుంటుంది.
JATARA1

దేవునిగుట్ట : మల్లికార్జుస్వామి ఆలయంతో పాటు గ్రామసమీపంలోని దేవునిగుట్ట, పెద్ద చెరువులు కాకతీయుల చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. దేవునిగుట్టపై అబ్బురపరిచే కట్టడాలు కూడా ఉన్నాయి. నంది విగ్రహం.. రాతితో నిర్మించిన గర్భాలయాలు.. చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు గ్రామ సమీపంలో చెరువు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. దీన్ని కూడా కాకతీయులే నిర్మించారట. దీని నిర్మాణానికి.. ఇప్పటి ఆధునిక పరిజ్ఞానానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. రాజుల దూరదృష్టి ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చనేది గ్రామస్థుల అభిప్రాయం.

సంతోషం వారసత్వం:
దేవాలయం పేరే ఊరుపేరుగా మారడం మా గ్రామ విశేషం. తరాల తరబడి మల్లికార్జునస్వామికి సేవలందించి సంతోషపడటమే వారసత్వంగా నిర్వహిస్తున్నాం. కాకతీయుల చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్న రాతి కట్టడాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వీలైనన్ని వసతులు కల్పిస్తున్నాం.
మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ

గ్రామస్థులుగా గర్విస్తున్నాం:
కాకతీయుల చరిత్రకు ఆనవాలుగా ఉన్న ఐనవోలు గ్రామస్థులమైనందుకు మేము గర్విస్తున్నాం. మా గ్రామాన్ని కాకతీయులు పరిపాలించిననాటి నుండే చరిత్ర ఉన్నది. చారిత్రక సంపదను పరిరక్షించేందుకు మేమంతా చైతన్యంతో కృషి చేస్తున్నాం. జాతర సమయంలో గ్రామం ఎంతో శోభాయమానంగా, భక్తులతో కిటకిటలాడుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.
-పల్లకొండ సురేష్, సర్పంచ్

JATARA2

జానపదుల జాతర :
ఈ ఊరి పేరు వచ్చిందే ఆలయం పేరుమీద. ఐనవోలు బ్రహ్మోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచాయి. ప్రతీ సంవత్సరం జనవరిలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జానపద జాతరగా పేరుగాంచిన ఐనవోలుకు వరంగల్ మూడు జిల్లాలతోపాటు కరీంనగర్.. నల్లగొండ.. ఖమ్మం.. రంగారెడ్డి.. హైదరాబాద్‌ల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. పట్నాలువేసి.. బోనాలు చేసి స్వామివారికి.. అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా జరిగే ఈ జాతరతో పాటుగా ఏడాదంతా దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.

మార్నేని వంశం:
ఐనవోలు దేవాలయ స్థలం మార్నేని వంశస్థులది. కాకతీయుల కాలం నుంచి ఐనవోలు నిర్వహణను మార్నేని వంశస్థులు చూసుకునేవాళ్లు. 1968కి ముందు జాతరలో షిడిరథం.. కుక్కల కొట్లాట.. చల్లకుండల నెత్తుట వంటి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇవి హింసాత్మకమని భావించిన ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీంతో 1969లో మార్నేని వంశస్థులు దేవాలయాన్ని స్వచ్ఛందంగా దేవాదాయశాఖకు అప్పగించారంటున్నారు. కాగా, ప్రతీ బ్రహోత్సవాల్లో రథం ఊరేగింపు కార్యక్రమాన్ని మార్నేని వంశస్థులే చూసుకుంటున్నారు.
JATARA3

12513

More News

Featured Articles

Health Articles