భక్తుల కాచే బడాపహాడ్

Fri,November 13, 2015 11:06 AM

peddagutta1

వర్ని మండలం జలాల్‌పూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న సయ్యద్ షాదుల్లా బాబా దర్గానే బడాపహాడ్‌గా పేరు పొందింది. దీన్నే పెద్దగుట్ట అని కూడా అంటారు. ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీగా నిలుస్తోంది. హిందూ ముస్లిములు ఈ దర్గాను ఎంతో భక్తిభావంతో సందర్శిస్తారు. ఈ దర్గా ఉర్సు ప్రారంభం కానుంది.


peddagutta1

మండలంలోని జలాల్‌పూర్ అటవీ ప్రాంతంలో వెలసిన సయ్యద్ షాదుల్లా బాబా దర్గా (బడాపహాడ్) మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం ఆలంగిరి ప్రభువు వద్ద సయ్యద్ షాదుల్లా మహారాష్ట్రలోని జాల్న ప్రాంతంలో తహసీల్దార్‌గా పని చేస్తుండేవారు. విధి నిర్వహణలో భాగంగా శిస్తు వసూలు చేసేవాడని పెద్దలు చెప్తుండేవారు. ఆ సమయంలో ఒక్కసారిగా కరువు ఏర్పడడంతో బాబా తాను వసూలు చేసిన శిస్తును ఆ ప్రాంత ప్రజలకు పంచిపెట్టాడు. ఒకరోజు వసూలైన శిస్తును తనకు అప్పగించాలని ఆలంగిరి ప్రభువు షాదుల్లాకు సూచించాడు. కొద్దిరోజుల అనంతరం ఇస్తానని ప్రభువుకు చెప్పిన షాదుల్లా ఆ ప్రాంతం నుంచి పారిపోయి లకా్ష్మపూర్ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నాడు. తన వద్ద ఉన్న గుర్రం, కుక్క, సైదవ్ మహరాజ్, మున్షిలను వెంట పెట్టుకు వచ్చాడు.
కొద్దిరోజలకు లక్ష్మీపూర్‌కు చెందిన గొల్ల సాయమ్మ అనే మహిళ పాలను అమ్మేందుకు అటుగా వెళ్తుండగా మార్గమధ్యలో బాబాతో పరిచయం ఏర్పడి వారికి రోజు పాలు, పెరుగు పెట్టేది. కొద్దిరోజుల తర్వాత షాదుల్లా బాబాను పట్టుకునేందుకు ఆలంగిరి సైనికులు వస్తుండడాన్ని తెలుసుకున్న షాదుల్లా అక్కడి నుంచి గొల్ల సాయమ్మ సహాయంతో బడాపహాడ్ కొండల్లోకి వెళ్లాడు. అక్కడే ఉంటూ కొండపైన ఉన్న బండరాయిపై నమాజ్ చేసేవాడు.
ఆలంగిరి ప్రభువులు బాబాను వెతుక్కుంటూ బడాపహాడ్ వెళ్లడంతో విషయాన్ని బాబాకు నమ్మిన బంటు బుగ్గ రామన్న చేరవేయడంతో బాబా తన వద్ద గుర్రాన్ని కొట్టే బెత్తెంతో గుర్రం, కుక్క, పిల్లి, సైదవ్ మహరాజ్, మున్షిలపై పెట్టడంతో వారు భూమిలో కి వెళ్లి సమాధి అయ్యారు. అనంతరం బాబా సైతం వారి నుంచి తప్పించుకునేందుకు సమాధి అయినట్లు మత పెద్దలు చెబుతుంటారు. బాబా సమాధి అయిన విషయం తెలుసుకున్న రామన్న సైతం సమాధి కావడంతో రామన్న సమాధి అయిన ప్రదేశంలో నీళ్లు ప్రవహిస్తుండేవి. అదే ప్రదేశాన్ని ఇప్పుడు రామన్న లొంక అని పిలుస్తుంటారు.

పశువుల కాపరి ద్వారా వెలుగులోకి...


peddagutta1

సుమారు 2 వందల ఏళ్లకు మునుపు సమీపంలోని పశువుల కాపరి కొండపైన పశువులను మేతకు తీసుకు వచ్చి బాబా సమాధి అయిన ప్రదేశంలో కొద్దిసేపు సేద తీరాడు. ఇంతలోనే నిద్రలోకి జారుకున్న పశువుల కాపరి నిద్రలో నుంచి తేరుకునే సరికి పశువులు కనిపించకుండాపోయాయి. ఆందోళన చెందిన కాపరి సమాధిని దేవుడిగా భావించి మొక్కడంతో కొద్దిసేపటికి పశువులు కనిపించాయి. దీంతో అప్పటి నుంచి బాబాను విశ్వసించిన ప్రజలు కోరిన కోర్కెలు తీరుతున్నాయని మొక్కులు తీర్చుకుంటున్నారు. బాబా రజ్జాఫ్ మాసంలో సమాధి అయినట్లు భావించి నాటి నుంచి ఉర్దూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఉర్సు నిర్వహిస్తున్నారు.

ఉర్సులో భాగంగా...


peddagutta1

ఈ నెల 30వ తేదీన గురువారం జలాల్‌పూర్ గ్రామంలోని ముజావర్ల ఇంటి నుంచి ఒంటె, గుర్రంపై గంధం చెక్కలతో తయారు చేసిన పౌడర్ (సంధాల్)ను అధికారికంగా జోహర్ నమాజ్ అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బడాపహాడ్‌కు తరలిస్తారు. మగ్రిబ్ నమాజ్‌కు ముందు సాయంత్రం 6.45 గంటలకు గంధాన్ని బాబాకు సమర్పిస్తారు. రెండో రోజు కవాలీ, అన్నదానం చేపడతారు. మూడోరోజు ఫజల్ నమాజ్ అనంతరం ఉదయం 5.30 ఖిలాఫత్ ఖురాన్, ఫతేహా పఠించి ప్రసాదం పంచిపెడతారు. భక్తుల కోసం వక్ఫ్‌బోర్డు విద్యుత్ దీపాలంకరణ, అన్నదానం, నిర్వహణ సౌకర్యాల కోసం రూ.7.50 లక్షలు మంజూరు చేసింది. ఈ ఉత్సవాలకు కుల మతాలకు అతీతంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రజలు ఉత్సవాల్లో పాల్గొంటారు.

ఎలా చేరుకోవచ్చు..?


peddagutta1

దర్గాకు జిల్లాకేంద్రం నుంచి, బోధన్ ప్రాంతం నుంచి ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయి. అయితే ఈ రెండు వైపుల నుంచి వచ్చే భక్తులు మొదట వర్ని మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. జిల్లాకేంద్రం నుంచి దర్గా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే దర్గా వరకు రవాణా సౌకర్యం ఉంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా దర్గాకు చేరుకోవచ్చు. వర్ని నుంచి దర్గా వరకు ఆర్టీసీ బస్సు టికెట్టు రూ.15 ఉండగా, ప్రైవేటు వాహనాల వారు రూ.20 తీసుకుంటారు.

ఉర్సు సందర్భంగా ప్రత్యేక బస్సులు...


ఉర్సు సందర్భంగా బడాపహాడ్‌కు ఆర్టీసీ వారు నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని కంధార్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఉంటాయి.

23809

More News

Featured Articles

Health Articles