పాండవుల విలాసం ఆజలపాతం

Wed,November 18, 2015 11:34 AM

మట్టిదిబ్బల తెలంగాణ కడుపులో పచ్చని ప్రకృతికన్య భద్రంగా ఒదిగింది!
తెలంగాణ దాస్యశృంఖాలలను తెంచుకోగానే ఆ కన్య మెల్లగా ఒళ్లు విరుచుకుంటోంది..
ప్రతి విరుపులోనూ మెరుపు.. పచ్చని అడవితో చీరకట్టుకొని.. లోయలతో జడల్లుకుంటూ.. దూకే జలపాతాలను పాపిటబిళ్లగా సవరించుకుంటూ.. గలగలపారే నదులను ఒడ్డాణాలుగా ట్టుకుంటూ..
చెరువులు.. కుంటలను గజ్టెలుగా కట్టుకుంటూ.. అహ్లాద వాతావరణాన్ని కుంకుమగా ద్దుకుంటూ.. ఈ ముగ్ధమోహన కన్య కాంతులీనుతున్నది! తెలంగాణ ఏక్ ఖోజ్.. అన్న సత్యాన్ని ఆవిష్కరిస్తున్నది! ఇన్ని రోజులు ఆంధ్రపాలకుల వివక్షకు చిన్నబుచ్చుకున్న మన ప్రకృతి బిడ్డ.. తెలంగాణతల్లి లెక్క ఇప్పుడు గదవ పైకెత్తి లోకాన్ని చూడనుంది... లోకం దృష్టినీ తనవైపు తిప్పుకోనుంది.. డిస్కవరీ తెలంగాణ అనే ఈ కొత్త కాలమ్‌తో!

పేరు: పాండవుల గుట్ట
వింత: ఏడు జలపాతాలు
ఆశ్చర్యం: ఏడు బావులు
ఆద్యంతం ఆహ్లాదం, రమణీయం
పూర్వం పాండవులే నిర్మించారని ప్రశస్తి!


పచ్చని చీరకట్టుతో అడవితల్లి! ఓ పక్క పక్షుల కిలకిలారావాలు! మరోపక్క జలజలపారే జలపాతపు హొయలు! కొండల్లో గంగమ్మ జాలువారుతుంటే కనువిందు చేసినట్లుంటుంది! ప్రకృతి తల్లి పురివిప్పి నాట్యమాడినట్లు కనిపిస్తుంది! ఇదంతా ఎక్కడో దూరతీరంలోని అరకు అందాలో.. ఉదక మండలంలోని సుందర దృశ్యాలో అనుకుంటే పొరపాటే! వాటిని తలదన్నే రీతిలో ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న పాండవులగుట్ట సోయగాలివి! ఈ గుట్టల్లో ఏడు బావులు, ఏడు జలపాతాలుచూపరులను విపరీతంగా ఆకట్టుకుంటాయి! ఈ జలపాతాల వెనుక పెద్ద కథే ఉంది! ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దు... దట్టమైన అటవీ ప్రాంతం. బయ్యారం మండల కేంద్రం నుంచి మిర్యాలపెంటకు మధ్య దూరం ఐదు కిలోమీటర్లు. ఇక్కడే ఈ పాండవులగుట్టలు కొలువుదీరాయి. ఇక్కడ నివసించే స్థానిక గిరిపువూతుల కథనం ప్రకారం.. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కొంతకాలం ఈ కొండలపైన నివాసమున్నట్లు ప్రచారంలో ఉంది. ఆ సమయంలోనే పాండవులు వారి అవసరాల కోసం ఈ కొండలపై బావులు నిర్మించినట్లు స్థానికులు పేర్కొంటారు. అయితే ఈ గుట్టలపై వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉన్న ఏడు బావులు చూపరులకు కనువిందు చేస్తుంటాయి. ఒక బావి నుంచి మరొకబావిలోకి నీరు జలపాతంలా పడుతుంటే పాలధారలు అమాంతం మీద పడిన అనుభూతి కలుగుతుంది. ఈ ఝరులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని రహస్యం. అసలు గుట్ట పైభాగంలో నీరు
ఎలా వస్తుందనేది సమాధానం దొరకని ప్రశ్న. మరొకటి ఏంటంటే జలపాతంలా ఏడుబావుల నుంచి కిందికి వచ్చిన నీరు కాల్వ రూపంలో కొంత దూరం ప్రవహించి హఠాత్తుగామాయమైపోతుండటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.

దీనికి ప్రచారంలో ఉన్న కథనం...
పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు ఈ ఏడు బావుల్లోంచి అవసరాల కోసం కొంతనీటిని ఉపయోగించుకొని మిగిలిన నీళ్లను పాతాళగంగలోకి మళ్లించారట! నీటి ఆనవాళ్లు కనిపిస్తే.. పాండవుల సమాచారం బయటికి తెలుస్తుందని అందుకే నీటిని పాతాళగంగలోకి మళ్లించారని గిరిజనులు చెప్తారు. అందుకే ఈ కొండలను పాండవుల గుట్టలుగా పిలుస్తున్నట్లూ చెప్తారు.

పట్టించుకోని పాలకులు
ఇక్కడి జలపాతాల సుందర దృశ్యాలు కళ్లను కట్టిపడేస్తున్నా పాలకులు వీటిపై దృష్టి సారించలేదు. పట్టించుకునే నాథుడే లేక ఆ గుట్టలు బాహ్య ప్రపంచానికి తెలియలేదు.పాండవుల గుట్టపై ఏడుబావుల ద్వారా ప్రవహిస్తున్న నీరు సమీపంలోని మిర్యాలపెంట చెరువులోకి మళ్లిస్తే గిరిజనుల గొంతు తడిపినట్లవుతుంది. సుమారు 40 గిరిజనక్షిగామాలకు సాగు, తాగునీటికి కొదవ ఉండదు. నిరంతరం జాలువారుతున్న నీటిని చెరువులోకి కాల్వల ద్వారా రప్పిస్తే వేసవిలో కూడా ఇక్కడి గ్రామాలకు దాహం తీరుతుంది. వర్షాకాలంలో ఏడు బావుల ద్వారా వచ్చే నీరు వేల క్యూసెక్కుల్లో ఉంటుంది. ఆ నీటిని స్టోర్‌చేసి సాగు, తాగుకు సమీప గ్రామాలు యోగించుకోవచ్చు.మిర్యాలపెంట, లక్ష్మీపురం, నర్సాపురం, ఇసుకమేది, బోటితండా, సాంబతండా, చింతలతండాలతోపాటు మరిన్ని గ్రామాలకు మంచినీటి సమస్య తీరుతుంది. కానీ ప్రభుత్వం ఇంత వరకు పట్టించుకోలేదు. ఇక్కడి గిరిపువూతులు కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అధికారులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు.

పర్యాటక కేంద్రంగా మార్చగలిగితే..
పాండవులగుట్టలోని ఏడుబావుల జలపాతాల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే.. దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా గుర్తింపు వస్తుంది. ఐదువందల మీటర్లపొడవున్న ఈ ఏడుబావుల జలపాతాలు చూడటానికి కన్నుల పండువగా కనిపిస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తే విదేశీయులు సైతం ఔరా అనకతప్పదు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా రూపుదిద్దుకునే అవకాశం లేకపోలేదు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ పర్యాటకంపై చూపిన నిర్లక్ష్యం ఇక్కడ తేటతెల్లమవుతుంది. తెలంగాణలో ఇలాంటి ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నా వాటిని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో ఇక్కడి గిరిజనులు పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారు. జలపాతాలనీరును సమీప గ్రామాల సాగు, తాగునీరుకు ఉపయోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అడవి జంతువులకు స్థావరం
పాండవుల గుట్ట అడవి జంతువులకు నిలయం. పెద్ద పులులు, చిరుతలు, దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు తదితర అడవి జీవులు ఇక్కడ నివసించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పాండవులగుట్టల్లో పెద్దపెద్ద గుహలు, సొరంగాలు, లోయలు ఉన్నాయి. పైగా దట్టమైన అడవి కావడంతో అడవి జంతువులకు ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది. వరంగల్ - ఖమ్మం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతానికి ఈ గుట్టలే కేంద్రబిందువుగా ఉన్నాయి. ఎత్తైన గుట్టలు, దట్టమైన అడవితో మనిషి దూరని విధంగా అల్లుకుపోయి ఉంటాయి. ఈ జలపాతాల సుందర దృశ్యాలు చూడాలంటే సాహసోపేతమైన ప్రయాణం చేయాల్సిందే! గుట్టలను ఎక్కుతూ బండరాళ్ల అంచున చేతి సపోర్టుతో ఎక్కాల్సి ఉంటుంది. ఒకవేళ అదుపుతప్పితే ప్రమాదమే!

ఒకప్పుడు మావోయిస్టులకు కీలక స్థావరం
2000 సంవత్సరానికి ముందు మావోయిస్టులు, జనశక్తి, ఇతర నక్సల్స్ గ్రూపులు పాండవుల గుట్టపై కార్యకలాపాలు నిర్వహించేవి. పోలీసుల బూట్ల చప్పుళ్లు, మావోయిస్టుల కవాతులతో పాండువుల గుట్ట ప్రతిధ్వనించేది. దీంతో సమీప గిరిజన గ్రామాలపై పోలీసులు కన్నేసేవారు. మావోయిస్టులకు సమాచారం, సామగ్రి, వసతి, కార్యకలాపాలు పక్క గ్రామాల నుంచే జరుగుతున్నాయనే నెపంతో గిరిజనులను వేధించేవారు. రానురాను మావోయిస్టులు పాండవుల గుట్టను పూర్తిగా వదిలేశారు. పోలీసుల కవాతులు కూడానిలిచిపోయాయి. ఇప్పుడంతా ప్రశాంత వాతావరణం నెలకొని ఆహ్లాదకరమైన ప్రకృతి, రమణీయమైన దృశ్యాలే కనువిందు చేస్తున్నాయి.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే దేశంలోనే అత్యంత గుర్తింపు లభిస్తుంది. జలపాతాలు చూపరులను ఆకర్షిస్తాయి. రెండు, మూడు సంవత్సరాల్లో పర్యాటకుల సంఖ్య పెరిగిపోతుంది. సమీప గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. సీమాంధ్ర పాలకులు పాండవులగుట్టను విస్మరించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. తెలంగాణ సర్కార్ పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తుందని స్థానికులు భావిస్తున్నారు. జలపాతాల నీరు సమీప గ్రామాలకు ఉపయోగించుకోవచ్చు.

- గౌని ఐలయ్య, ఎన్‌డీ నాయకుడు
మరవలేని.. మరుపురాని దృశ్యాలు
పాండవులగుట్టలోని జలపాతాలు సుందర దృశ్యాలు. వాటిని వీక్షిస్తే స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏడు బావులు ఒకదానిపై ఒకటి పేర్చిన వైనాన్ని చూస్తే.. పర్యాటకులు మర్చిపోలేరు. పాండవుల వనవాసం చేసిన ఆనవాళ్లు ఇక్కడ కనపడతాయి. పర్యాటక కేంద్రంగా మారిస్తే దేశనలుమూలల నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా గిరిజన గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. జలపాతాల నీరు పైపులైన్ ద్వారా మిర్యాల పెంట చెరువుకు మళ్లిస్తే గిరిజన గ్రామాలకు మంచినీటి సమస్య తీరుతుంది.

- రెంటాల బుచ్చిడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడుతమ్మిశెట్టి వెంకటేశ్వర్లు
టీ మీడియా, ఇల్లందు
ఫోటోలు: అనుమల్ల గంగాధర్

12170

More News

Featured Articles

Health Articles