లీటరు నీళ్లు రూ. 65 లక్షలు!


Sun,November 3, 2019 04:01 AM

ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే! ఎందుకంటే అవేం అల్లాటప్పా నీళ్లు కాదు. మనదగ్గర పది, ఇరవై రూపాయలకు దొరికే నీళ్లు అంతకన్నా కాదు. కాకులు దూరని కారడవుల్లోంచి, చీమలు దూరని చిట్టడవుల్లోంచి, మనిషి మనుగడ లేని మంచుకొండల నుంచి ఆ నీటిని తెస్తారు! ఆ నీటికి అంత ఖరీదు ఎందుకు వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోవడమే కాదు.. నీటిబొట్టు విలువ మనకీ తెలిసొస్తుంది! ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నీరు ఎక్కడెక్కడ దొరుకుతుందో మీరూ తెలుసుకోండి.

90 హెచ్2ఓ వాటర్:

దక్షిణ క్యాలిఫోర్నియాలోని పర్వాతల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. దాదాపు 5వేల అడుగుల లోతులో ఉన్న మంచుతీసి, కరిగించి నీరుగా మార్చుతున్నారు. అంతలోతు నుంచి తీసి మరీ.. లక్షల రూపాయలకు అమ్మాలా? అని సందేహం రావొచ్చు. అయితే ఆ నీటి బాటిల్‌కు చిన్న డైమండ్స్ పొదిగిన మూతను అమర్చుతారు.అందుకే ఆ నీటికి అంత విలువ. ఈ రకమైన లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు రూ.65 లక్షలు. 90 హెచ్2ఓ నీరు తాగితే అనారోగ్యం దూరమవుతుందని, వృద్ధాప్యం దరిచేదని ఈ నీటిని తయారు చేస్తున్న బెవర్లీ హిల్స్ కంపెనీ చెబుతున్నది. ఒకసారి ఈ నీటిని రుచిచూసిన వారు మరోసారి ఆర్డర్ చేస్తారని అంటున్నారు.
9OH2O

అక్వా డి క్రిస్టల్లో:

ఆక్వాడి క్రిస్టల్లో కంపెనీకి చెందిన పావులీటరు నీటి ఖరీదు అక్షరాల 42 లక్షల రూపాయలు. ఈ నీటిని నిల్వ చేయడానికి 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన బాటిల్‌ను ఉపయోగిస్తారు. బంగారం, వెండి, రాగి వంటి బాటిళ్లలో ఈ నీటిని అమ్ముతున్నారు. ఫిజి, ఫ్రాన్స్‌లోని సహజ నీటిబుగ్గలనుంచి ఈ నీటిని తయారు చేస్తున్నారు. స్వచ్ఛత, ఆరోగ్యానికి మారుపేరుగా నిలిచే ఈ నీటిని చాలామంది తాగుతున్నారు. ఒకసారి రుచి చూసినవారు కచ్చితంగా మరోసారి కొనుగోలు చేయాల్సిందే.

బ్లింగ్ హెచ్2ఓ:

బ్లింగ్ హెచ్2ఓ లీటర్ నీటి ఖరీదు దాదాపు లక్షా 90వేల రూపాయలు. ఇంత ఖరీదైన నీళ్ళు తాగే వారిలో ఎక్కువగా ఉండేది సెలబ్రిటీలే. బ్లింగ్ హెచ్‌టుఓ కంపెనీ వాటర్ బాటిల్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ నీటిని టెనెస్సీ దగ్గరున్న నీటి బుగ్గల నుంచి సేకరిస్తారు. ఈ జలంతో నింపే ఈ బాటిళ్లను స్వరోవ్‌స్కీ రాళ్ళతో తీర్చి దిద్దుతారు.

కోనా నిగరి:

కోనానిగరి అనే ఈ బ్రాండ్ నీటి ఖరీదు 28 వేల రూపాయలు! అంతమొత్తం చెల్లిస్తే ముప్పావు లీటర్ నీళ్లు మన సొంతం అవుతాయి. ఈ నీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గి, చర్మం నిగారిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఈ నీటిని హవాయి దగ్గర్లోని పసిఫిక్ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తోడుకొస్తారు! ప్రత్యేక పద్ధతుల్లో ఉప్పును పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. ఈ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీటిలో ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ నీటికి జపాన్‌లో బాగా డిమాండ్ ఉంది. రోజుకు 80 వేలకు పైగా బాటిళ్లు అక్కడకు దిగుమతి
అవుతాయి.

కోహ్లీ తాగేనీరు ఇదే..

ఈ ఫ్రాన్స్ కంపెనీ నీటి ధర లీటరుకు ఆరు వందలకు పైమాటే. క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో విరాట్ కోహ్లీ కోసం తప్పనిసరిగా ఏవియాన్ బ్రాండ్ నీరు తెప్పించాల్పిందేనట. 1789లో ఫ్రాన్స్‌కు చెందిన మార్కిస్ అనే వ్యక్తి రోజూ వాకింగ్‌కి వెళ్తూ ఏవి యానలెస్ బెయిన్స్ దగ్గరున్న నీటి బుగ్గలో నీరు తాగే వాడట. ఆ నీరు తాగడం మొదలుపెట్టాక అతడికున్న కిడ్నీ, లివర్ సమస్యలు నయమయ్యాయట. అది కాస్తా ప్రచారం కావడంతో ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తర్వాతి కాలంలో ఏవియాన్ బ్రాండ్‌గా విస్తరించింది. మనదేశంలోనూ ఆన్‌లైన్ ద్వారా ఈ బాటిళ్లు అమ్ముతున్నారు.
KOhliii

ఫిన్లాండ్ వీన్ వాటర్:

ఫిన్లాండ్ వీన్ కంపెనీకి చెందిన 750 మిల్లీలీటర్ల నీరు రూ.1500. భూటాన్‌లోని హిమాలయాల నుంచి ఈ నీటిని సేకరించి, పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

మంచునుంచి ఖరీదైన నీరు:

కెనడాలోని వాంకోవర్ నగరానికి 200 మైళ్ల దూరంలో ఉన్న పర్వతప్రాంతంలో జనసంచారం, జంతు సంచారం ఉండదు. అక్కడ 6వేల అడుగుల లోతుతో హిమనీనదాలను కరిగించి ఈ నీళ్లు తయారు చేస్తుంది 10 థౌజండ్ కంపెనీ. 750 మిల్లీలీటర్ల ధర రూ.950.

550
Tags

More News

VIRAL NEWS